బంగారంపై దుబాయ్ భారీ డిస్కౌంట్స్.. భలే చౌక బేరం.. త్వరపడండి..!

బంగారంపై దుబాయ్ భారీ డిస్కౌంట్స్.. భలే చౌక బేరం.. త్వరపడండి..!

మిడిల్ ఈస్ట్‌లో కొనసాగుతున్న యుద్ధంతో ప్రపంచ కుబేరుల స్వర్గధామం దుబాయ్‌లో వింత పరిస్థితులను తీసుకొచ్చాయి. సాధారణంగా ప్రపంచమంతా బంగారం ధరలు ఆకాశాన్నంటుతుంటే.. దుబాయ్ మార్కెట్‌లో మాత్రం గోల్డ్ పై భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు అక్కడి వ్యాపారులు. యుద్ధం కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోవడం.. రవాణా వ్యవస్థ స్తంభించడంతో నిల్వలను వదిలించుకునేందుకు ట్రేడర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.

భారీ డిస్కౌంట్లు.. ఎందుకు?
దుబాయ్ నుంచి ఇతర దేశాలకు బంగారం ఎగుమతి కావడం ప్రస్తుతం గగనమైపోయింది. ఇరాన్ క్షిపణి దాడుల భయంతో యూఏఈ గగనతలం పాక్షికంగా మూతపడటంతో.. బులియన్ ఎగుమతులు నిలిచిపోయాయి. సాధారణంగా బంగారం ప్రయాణీకుల విమానాల్లోని కార్గో విభాగంలో రవాణా అవుతుంది. అయితే విమానాలు రద్దు కావడంతో.. ట్రేడర్లు తమ వద్ద ఉన్న స్టాక్‌ను భద్రపరచడానికి అయ్యే ఖర్చులు భరించలేక, లండన్ బెంచ్‌మార్క్ ధర కంటే ఔన్సుపై ఏకంగా 30 డాలర్ల వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. అంటే గ్రాముకు రూ.100 వరకు పైనే తగ్గింపును ఆఫర్ చేస్తున్నారు.

రవాణా కష్టాలు - రిస్క్ తీసుకోలేక..
దుబాయ్ అనేది ఆసియా.. ఆఫ్రికా దేశాలకు బంగారాన్ని రిఫైన్ చేసి ఎగుమతి చేసే ప్రధాన కేంద్రం. ప్రస్తుతం విమాన మార్గాలు మూసుకుపోవడంతో, రోడ్డు మార్గంలో సౌదీ అరేబియా లేదా ఒమన్ వంటి దేశాలకు బంగారాన్ని తరలించి అక్కడి నుండి ఎగుమతి చేసే అవకాశం ఉన్నప్పటికీ.. ట్రేడర్లు ఆ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. సరిహద్దుల వద్ద తనిఖీలు, భద్రతాపరమైన సమస్యలు, ఇన్సూరెన్స్ ఖర్చులు భారీగా పెరగడం దీనికి ప్రధాన కారణం. యుద్ధం మొదలైనప్పటి నుండి లాజిస్టిక్స్ ఖర్చులు 60% నుంచి 70% వరకు పెరిగాయని రిఫైనరీ నిపుణులు చెబుతున్నారు.

భారత్ పై ప్రభావం ఎలా ఉంది?
ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం దిగుమతిదారుల్లో ఒకటైన భారత్‌కు దుబాయ్ నుండే ఎక్కువ శాతం బంగారం దిగుమతి అవుతుంది. రవాణా నిలిచిపోవడంతో భారత్‌లో ఫిజికల్ బంగారం లభ్యత కొంత తగ్గినట్లు కనిపిస్తున్నా.. ప్రస్తుతం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. జనవరిలో భారత్ భారీగా బంగారాన్ని దిగుమతి చేసుకోవడంతో ప్రస్తుతానికి తగినంత స్టాక్ అందుబాటులో ఉందట. అయితే ఈ యుద్ధం మరో కొన్ని నెలల పాటు కొనసాగితే మాత్రం భారత్‌లో బంగారం ధరలు విపరీతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు.

అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర ఈ ఏడాది దాదాపు 20% పెరిగి, ఔన్సు ధర 5వేల డాలర్ల పైకి చేరింది. అయితే డాలర్ బలపడటం, యుద్ధ ఉద్రిక్తతల వల్ల మార్కెట్ చాలా అస్థిరంగా ఉంది. అటు ముడి బంగారం లభ్యత కూడా తగ్గిపోవడంతో రిఫైనరీల నిర్వహణ భారంగా మారింది. భారత్‌లోని ప్రముఖ రిఫైనరీ MMTC-PAMP వంటి సంస్థలకు మధ్యప్రాచ్యం నుంచి అందే సరఫరా నిలిచిపోవడంతో కొత్త కాంట్రాక్టుల కోసం వెతకాల్సి వస్తోంది. యుద్ధం కారణంగా దుబాయ్‌లో బంగారం ధర తగ్గడం అనేది ఇన్వెస్టర్లకు వింతగా అనిపించినా.. ఇది కేవలం రవాణా సమస్యల వల్ల ఏర్పడిన తాత్కాలిక తగ్గుదల మాత్రమేనని నిపుణులు అంటున్నారు.