Manchu Manoj: మహిళల వస్త్రధారణపై నీతులు చెబితే ఊరుకోం.. శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలకు మనోజ్ కౌంటర్!

Manchu Manoj: మహిళల వస్త్రధారణపై నీతులు చెబితే ఊరుకోం.. శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలకు మనోజ్ కౌంటర్!

టాలీవుడ్ లో ప్రస్తుతం 'వస్త్రధారణ' చుట్టూ మొదలైన వివాదం ముదురుతోంది. 'దండోరా' చిత్ర ఈవెంట్‌లో నటుడు శివాజీ  హీరోయిన్స్ దుస్తులపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే సింగర్ చిన్మయి, యాంకర్ అనసూయ వంటి వారు తమ నిరసన వ్యక్తం చేశారు. లేటెస్ట్ గా మంచు మనోజ్ ఈ అంశంపై స్పందించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శివాజీ పేరు ఎత్తకుండానే, ఆయన వ్యాఖ్యలలోని లోపాలను ఎండగడుతూ మనోజ్ రాసిన బహిరంగ లేఖ ఇప్పుడు చర్చనీయాంశమైంది.

మహిళల స్వేచ్ఛపై ఆంక్షలా? 

మహిళలు ఏం వేసుకోవాలో నిర్ణయించే అధికారం ఎవరికీ లేదు. వారిని కేవలం వస్తువులుగా చూడటం సభ్యసమాజానికి మంచిది కాదు అంటూ మంచు మనోజ్ తన ఆవేదనను వెళ్లగక్కారు. సమాజంలో సెలబ్రిటీలుగా ఉన్నవారు మాట్లాడే ప్రతి మాటపై బాధ్యత ఉండాలని ఆయన గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. శివాజీ వ్యాఖ్యలు కేవలం ఒక వ్యక్తిగత అభిప్రాయంలా లేవని, అవి భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాసేలా ఉన్నాయని మనోజ్ పేర్కొన్నారు. కుల, మత, లింగ వివక్ష లేకుండా అందరూ సమానమే అని చెబుతున్నాయి . ప్రతి వ్యక్తికి గౌరవప్రదమైన జీవితాన్ని, వ్యక్తిగత స్వేచ్ఛను ప్రసాదిస్తోంది. మహిళల దుస్తులపై నీతులు చెప్పడం ఈ రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమని మనోజ్ స్పష్టం చేశారు. గౌరవం, సమానత్వం అనేవి చర్చించాల్సిన విషయాలు కావు.. అవి కనీస హక్కులు అని ఆయన తేల్చి చెప్పారు.

 నేను క్షమాపణలు చెబుతున్నా..

మనోజ్ తన లేఖలో అత్యంత కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు. మహిళలను తక్కువ చేసి మాట్లాడిన ఆ నటుడి తరపున, ఒక పురుషుడిగా తాను క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు.అలాంటి పాతకాలపు ఆలోచనలు పురుషులందరి అభిప్రాయం కాదు. ఇలాంటి మాటలను మేం సమర్థించం, మౌనంగా భరించం అని తన నిరసనను గట్టిగా వినిపించారు. సావిత్రి, సౌందర్య వంటి నటీమణులను ఉదాహరణగా చూపిస్తూ ప్రస్తుత తరం హీరోయిన్లను విమర్శించడం సరైన పద్ధతి కాదని ఆయన హితవు పలికారు.

ALSO READ : నరసింహ పాత్రలో శివన్న విశ్వరూపం..

బాధ్యతాయుతమైన ప్రవర్తన అవసరం

పబ్లిక్ ఫిగర్స్‌గా ఉన్నప్పుడు సమాజంపై మన మాటల ప్రభావం ఎంత ఉంటుందో గమనించాలని మనోజ్ సూచించారు. దుస్తులను బట్టి నైతికతను కొలవడం ఆపేయాలి. గౌరవం అనేది ఎదుటివారి దుస్తుల్లో లేదు, చూసే మన కళ్లలో ఉండాలి అన్న సందేశాన్ని తన పోస్ట్ ద్వారా పంపారు.

ఏం జరిగిందంటే?

హైదరాబాద్‌లో జరిగిన ‘దండోరా’ సినిమా వేడుకలో శివాజీ మాట్లాడుతూ.. నేటితరం హీరోయిన్ల గ్లామర్ ప్రదర్శనపై విరుచుకుపడ్డారు. స్త్రీ అందం చీరకట్టులోనే ఉంటుందని చెబుతూనే, పొట్టి బట్టలు వేసుకునే వారిని ఉద్దేశించి అత్యంత అభ్యంతరకరమైన పదాలను వాడారు. సావిత్రి, సౌందర్యలను స్ఫూర్తిగా తీసుకోవాలని హితవు పలికారు.  ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి...