25 ఏళ్లలో 26 రెట్లు పెరిగిన వెండి.. అప్పుడు కొన్నోళ్లకు ఇప్పుడు పండగే..

25 ఏళ్లలో 26 రెట్లు పెరిగిన వెండి.. అప్పుడు కొన్నోళ్లకు ఇప్పుడు పండగే..

సాధారణంగా పెట్టుబడి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది బంగారం. కానీ గత రెండున్నర దశాబ్దాలుగా వెండి ఎవరూ ఊహించని రీతిలో భారీ లాభాలను అందిస్తూ, అత్యుత్తమ సంపద సృష్టికర్తగా అవతరించింది. 2000 సంవత్సరంలో కిలో వెండి ధర కేవలం రూ.7వేల900 ఉండగా.. ప్రస్తుతం దాని రేటు కేజీకి రూ.2లక్షల 34వేల మార్కును చేరుకుంది. అంటే ఈ 25 ఏళ్ల కాలంలో వెండి ఏకంగా 2,600 శాతం కంటే ఎక్కువ రిటర్న్స్‌ను అందించింది. 

వెండిలో దీర్ఘకాలిక పెట్టుబడి ఎంతటి శక్తివంతమైనదో ఈ లెక్కలు నిరూపిస్తున్నాయి. 2000 సంవత్సరంలో ఒక వ్యక్తి వెండిపై కేవలం రూ.వెయ్యి పెట్టుబడి పెట్టి ఉంటే.. నేడు దాని విలువ దాదాపు రూ.23,400 అయ్యేది. అంటే పాతికేళ్లలో డబ్బు 26 రెట్లు పెరిగింది. ద్రవ్యోల్బణం, మార్కెట్ అనిశ్చితి ఉన్నప్పటికీ.. వెండి తన విలువను కాపాడుకుంటూ పెట్టుబడిదారుల సంపదను నిలకడగా పెంచుతూ వచ్చింది.

2025 సంవత్సరం వెండి చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ సిల్వర్ మొదటిసారిగా 70 డాలర్ల మార్కును దాటి, సరికొత్త రికార్డును సృష్టించింది. దీని ప్రభావంతో భారతీయ మార్కెట్లో కూడా వెండి ధర కిలోకు రూ. 2,16,596 కు చేరింది. అమెరికా - వెనిజులా మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్ బలహీనపడటం వంటి కారణాలు ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమయ్యాయి.

ALSO READ : 2026 కోసం యాక్సిస్ సెక్యూరిటీస్ 9 స్టాక్స్ పిక్..

2025లో వెండి పనితీరు బంగారాన్ని కూడా మించిపోయింది. ఈ ఏడాది ఇప్పటివరకు బంగారం ధర 76 శాతం పెరగగా, వెండి ఏకంగా 140 శాతం వృద్ధిని నమోదు చేసింది. వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు, సురక్షితమైన పెట్టుబడి సాధనంగా వెండికి పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఇన్వెస్టర్లు ఇప్పుడు 'వైట్ మెటల్' వైపు మొగ్గు చూపుతున్నారు. కేవలం పారిశ్రామిక అవసరాలకే కాకుండా, సంపదను పెంచుకోవడానికి కూడా వెండి ఒక బలమైన మార్గమని ప్రస్తుత ర్యాలీ నిరూపిస్తోంది.