కరీంనగర్ డైమండ్స్ అదిరిపోయే కమ్‌బ్యాక్.. రంగారెడ్డిపై 58 రన్స్ తేడాతో విజయం

కరీంనగర్ డైమండ్స్ అదిరిపోయే కమ్‌బ్యాక్.. రంగారెడ్డిపై 58 రన్స్ తేడాతో విజయం

T20 League: టీజీ20 లీగ్ 2026 (TG20 League 2026) ప్రారంభంలో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోయిన కరీంనగర్ డైమండ్స్ జట్టు ఇప్పుడు టోర్నమెంట్‌లో దూసుకుపోతుంది. ఈరోజు (జులై 2న, గురువారం రంగారెడ్డి రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కరీంనగర్ జట్టు 58 పరుగుల భారీ తేడాతో విక్టరీ సాధించింది. ఈ లీగ్‌లో వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకున్న కరీంనగర్ డైమండ్స్, పాయింట్ల పట్టికలో ఏకంగా రెండో స్థానానికి దూసుకెళ్లి రచ్చ లేపింది.

కరీంనగర్ బ్యాటర్ల ఊచకోత: 
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్‌కు దిగిన కరీంనగర్ డైమండ్స్ బ్యాటర్లు రంగారెడ్డి బౌలర్లపై చెలరేగిపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 230 పరుగులని స్కోరుబోర్డుపై పెట్టారు. ఇక కరీంనగర్ బ్యాటర్లలో రాహుల్ రాడేశ్ (37 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 72 రన్స్ ), HK సింహ (38 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగులు) హాఫ్ సెంచరీలతో కిరాక్ ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరి జోడీ మూడో వికెట్‌కు ఏకంగా 123 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టు భారీ స్కోరు చేయడంలో కీ రోల్ పోషించింది. ఓపెనర్లు సాత్విక్ రెడ్డి (13 బంతుల్లో 24), తన్మన్ అగర్వాల్ (16 బంతుల్లో 29) పర్వాలేదనిపించగా, చందన్ సహాని 19, శుభమ్ శర్మ 17* రన్స్ చేశారు. కాగా రంగారెడ్డి బౌలర్లలో తనయ్ జడ్డూ 2 వికెట్లు తీసుకోగా.. నితిన్ సాయి యాదవ్, తనయ్ త్యాగరాజన్ చెరో వికెట్ పడగొట్టారు. 

►ALSO READ | వైభవ్ సూర్యవంశీని ఆడించాల్సింది.. ప్యాంట్లు ఊడగొట్టేవాడు: రవిశాస్త్రి

చేతులెత్తేసిన రంగారెడ్డి రైజర్స్ బ్యాటర్లు: 
231 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన రంగారెడ్డి రైజర్స్ జట్టు కరీంనగర్ బౌలర్ల ధాటికి తట్టుకోలేక నిర్ణీత 20 ఓవర్లలో 172/9 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. రంగారెడ్డి బ్యాటర్లలో ఆదిత్య జవ్వాజి (31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 48 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలిచినప్పటికీ జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. జ్ఞాన ప్రకాష్ రెడ్డి (23), ఆరోన్ జార్జ్ (19), నితిన్ సాయి యాదవ్ (15) తక్కువ రన్స్ కే ఔట్ కాగా.. చివర్లో ఆర్యన్ కరియప్ప (20 బంతుల్లో 30*) కాస్త దూకుడుగా ఆడినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో 58 పరుగుల తేడాతో కరీంనగర్ డైమాండ్స్ చేతిలో రంగారెడ్డి ఓడిపోయింది.