చిన్నారిపై లైంగిక వేధింపుల కేసు.. మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్‌కు జైలు శిక్ష?

చిన్నారిపై లైంగిక వేధింపుల కేసు.. మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్‌కు జైలు శిక్ష?

Ex Australia Cricketer: ఆస్ట్రేలియా మాజీ దేశీ క్రికెటర్ ఆరోన్ సమ్మర్స్ చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ (పిల్లలపై లైంగిక వేధింపులు) కేసులో నేరాన్ని అంగీకరించడంతో అతనికి జైలు శిక్ష పడే అవకాశం ఉంది. 2018లో టాస్మేనియాలో జరిగిన ఒక ఘటనకు సంబంధించి ఈ మాజీ క్రికెటర్ కోర్టులో తన వాంగ్మూలాన్ని మార్చుకుంటూ నేరాన్ని ఒప్పుకున్నాడని డెయిలీ మెయిల్ నివేదిక వెల్లడించింది. టాస్మేనియా, హోబర్ట్ హరికేన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన సమ్మర్స్.. ఒక చిన్నారికి అసభ్యకరమైన కంటెంట్‌ను చూపించే ఉద్దేశంతో గ్రూమింగ్‌కు పాల్పడటంతో పాటు ఆ పిల్లాడిపై రెండుసార్లు లైంగిక దాడికి ఒడిగట్టినట్లు కోర్టులో ఒప్పుకున్నాడు. 

హోబర్ట్ హరికేన్స్ జట్టులో ఉన్నప్పుడే: 
కోర్టు విచారణలో భాగంగా.. ఆరోన్ సమ్మర్స్ హోబర్ట్ హరికేన్స్ జట్టులో సభ్యుడిగా ఉన్న సమయంలోనే ఈ ఘోరానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జరగడానికి ముందు అతను సోషల్ మీడియా ద్వారా బాధిత పిల్లాడితో చాటింగ్ చేసినట్లు టాస్మేనియా సుప్రీం కోర్టుకు సమర్పించిన సాక్ష్యాలు స్పష్టం చేస్తున్నాయి.

ఒంటరితనం వల్లే అలా చేశాడు: 
కోర్టు విచారణలో ఆరోన్ సమ్మర్స్ తరఫు న్యాయవాది కారోలిన్ గ్రేవ్స్ వింత వాదనలు వినిపించారు. ఆ సమయంలో సమ్మర్స్ తీవ్రమైన ఒంటరితనంతో బాధపడుతున్నాడని, అతిగా సోషల్ మీడియా వాడటం వల్లే ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఈ తప్పు చేశాడని కోర్టుకు తెలిపారు. ఆ తర్వాత అతను తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపపడ్డాడు, కాబట్టి మళ్లీ ఇలాంటి నేరానికి పాల్పడే అవకాశం లేదని పేర్కొన్నారు. ఈ తప్పు జరిగిన సమయంలో అతను ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బౌలర్లలో ఒకడు, అందుకే అతనిని అంతర్జాతీయ క్రికెట్ కోసం ఎంపిక చేసే ప్రక్రియ కూడా జరిగింది. కానీ, అతను ఇకపై ఆస్ట్రేలియాలో కానీ, విదేశాల్లో కానీ ప్రొఫెషనల్ క్రికెట్ ఆడే ఛాన్స్ లేదని అతనికి కూడా తెలుసని పేర్కొన్నారు.

►ALSO READ | కరీంనగర్ డైమండ్స్ అదిరిపోయే కమ్‌బ్యాక్.. రంగారెడ్డిపై 58 రన్స్ తేడాతో విజయం

 జైలు శిక్ష.. ఆగస్టులో తుది తీర్పు: 
ఆరోన్ సమ్మర్స్ ఇలాంటి కేసులో ఇరుక్కోవడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు.. చైల్డ్ అబ్యూస్ మెటీరియల్‌ను కలిగి ఉండటం, దానిని ఇతరులకు పంపడం వంటి చైల్డ్ ఎక్స్‌ప్లాయిటేషన్ కేసుల్లో 2021లోనే నేరస్థుడిగా తేలడంతో అతను ఇప్పటికే నార్తర్న్ టెరిటరీలో జైలు శిక్షను అనుభవించి రిలీజ్ అయ్యాడు. ప్రస్తుత కేసులో అతనికి సస్పెండెడ్ సెంటెన్స్ (జైలుకు వెళ్లకుండా ఉండే శిక్ష) ఇవ్వాలని లాయర్ కోరినప్పటికీ, జస్టిస్ హెలెన్ వుడ్ ఆ అభ్యర్థనను తోసిపుచ్చారు. ఈ కేసులో ఎలాంటి రిలీఫ్ ఇవ్వడానికి అవకాశం లేదన్నారు.