ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఆదాయపు పన్ను (ఇన్‌కమ్ టాక్స్) రిటర్న్స్ ఫెయిల్ చేయడానికి టైం వచ్చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ (ITR) ఫైల్ చేయడానికి జూలై 31 ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఒకవేళ ఈ గడువులోగా మీ టాక్స్ వివరాలు సమర్పించకపోతే, వేలల్లో జరిమానా కట్టాల్సి వస్తుంది.
అసలు ఐటీఆర్ (ITR) అంటే ఏమిటి?
మీరు ఉద్యోగం చేస్తున్నా లేదా సొంతంగా ఏదైనా వ్యాపారం నిర్వహిస్తున్నా.. మీకు వచ్చే ఆదాయం, పొదుపు మార్గాలు, మినహాయింపులు ఇంకా ప్రభుత్వం వసూలు చేసే పన్ను వివరాలన్నింటినీ ఒక ఫామ్ రూపంలో ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కు సమర్పించడాన్నే 'ఐటీఆర్ ఫైలింగ్' అంటారు. పన్ను పరిధిలోకి రాని వారు కూడా భవిష్యత్తులో లోన్లు లేదా వీసాల కోసం దీన్ని ఒక ముఖ్యమైన ఆదాయ ఆధారంగా ఫైల్ చేస్తూ ఉంటారు.
చివరి తేదీ ఎప్పుడు?
ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ సమాచారం ప్రకారం.. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే వారందరూ ఈ ఏడాది జూలై 31లోపు ప్రక్రియను పూర్తి చేయాలి. ఇన్‌కమ్ టాక్స్ శాఖ ఇప్పటికే మే నెలలోనే ఐటీఆర్ ఫామ్ లను అందుబాటులోకి తెచ్చింది. ఈసారి నిబంధనల్లో కొన్ని చిన్న చిన్న మార్పులు కూడా చేశారు. ప్రస్తుతానికి మొత్తం ఏడు రకాల ఐటీఆర్ ఫామ్ లు అందుబాటులో ఉండగా, సాధారణ ఉద్యోగులు ఎక్కువగా 'ITR-1' ను, చిన్న వ్యాపారులు ఇంకా ఫ్రీలాన్సర్లు 'ITR-4' ఫామ్ లను వాడుతుంటారు.
గడువు దాటితే జరిమానా ఎంత
ఒకవేళ మీరు జూలై 31లోగా ఐటీఆర్ ఫైల్ చేయకపోతే, మీ ఆదాయాన్ని బట్టి లేట్ ఫీజు (జరిమానా) పడుతుంది. రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉంటే రూ.1,000 జరిమానా కట్టాలి. రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే రూ.5,000 వరకు జరిమానా పడుతుంది.
