హైదరాబాద్: జల్సాలు మాని బుద్ధిగా ఉండాలని చెప్పినందుకు భార్యను హత్య చేశాడు భర్త. ఈ ఘటన మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. రాజు, విజయలక్ష్మీ దంపతులు. వీరికి ఇద్దరూ పిల్లలు. గత 8 సంవత్సరాలుగా మియాపూర్ గోకుల్ ప్లాట్స్‌లో పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. గత కొంత కాలంగా రాజు జల్సాలకు అలవాటు పడ్డాడు. ఇదే విషయంపై భార్య భర్తల మధ్య తరుచు గొడవ జరుగుతోంది.
ఈ క్రమంలోనే బుధవారం (డిసెంబర్ 23) కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఎన్నిసార్లు చెప్పిన భర్త పద్ధతి మార్చుకోకపోవడంతో విసిగిపోయిన విజయలక్ష్మీ ఇక లాభం లేదని విషయాన్ని రాజు కుటుంబ సభ్యులకు చెప్పడానికి బయలుదేరింది. ఈ క్రమంలో భార్యను రోడ్డుపై అడ్డగించి గొడవకు దిగాడు రాజు.
►ALSO READ | చిక్కడపల్లిలో డ్రగ్ నెట్ వర్క్ గుట్టురట్టు..బాయ్ ఫ్రెండ్ తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న లేడీ సాఫ్ట్ వేర్
ఘర్షణ ముదరడంతో తీవ్ర ఆగ్రహనికి గురైన రాజు భార్యపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. దెబ్బలు తాళలేక విజయలక్ష్మీ రోడ్డుపై కుప్పకూలింది. వెంటనే భార్యను దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు రాజు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విజయలక్ష్మీ మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు రాజును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
