చలికాలం చలి కాకపోతే వేడి ఉంటుందా అని వెటకారాలు వద్దండీ.. చలి కాలంలో చలే ఉంటుంది. కాకపోతే ఈ సారి చలి గజ గజ వణికిస్తుంది. హైదరాబాద్ సిటీనే కాదు.. తెలంగాణ రాష్ట్రం అంతా టెంపరేచర్ సింగిల్ డిజిట్ కు పడిపోతుంది. జీరోకు దగ్గరగా వచ్చేస్తోంది రోజు రోజుకు ఉష్ణోగ్రతలు. రాబోయే నాలుగు రోజులు.. అంటే ఈ వీకెండ్ అంతా.. 2025, డిసెంబర్ 25 నుంచి 28వ తేదీ వరకు చలి మరింత పెరగనున్నట్లు వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది.
తెలంగాణలో ఇప్పటికే సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల తక్కువ టెంపరేచర్ నమోదు అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ కు పడిపోతుంది. హైదరాబాద్ సిటీ శివార్లలో చలి తీవ్రతతోపాటు చలి గాలులు వీస్తాయని స్పష్టం చేసింది వెదర్ డిపార్ట్ మెంట్. ఉదయం వేళల్లో పొగ మంచు ఎక్కువగా కురుస్తుందని.. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది వాతావరణ శాఖ.
చలి తీవ్రతపై ఎల్లో, ఆరంజ్ అలర్ట్స్ జారీ :
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రతపై ఎల్లో, ఆరంజ్ అలర్ట్స్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.
ఎల్లో అలర్ట్ జిల్లాలు : నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో చలి ఎక్కువగా ఉండే అవకాశం. ఎల్లో అలర్ట్ అంటే 10 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదు అవుతుంది.
ALSO READ : న్యూ ఇయర్ డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడితే బండి సీజ్..
ఆరంజ్ అలర్ట్ జిల్లాలు : ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఆరంజ్ అలర్ట్. అంటే ఈ జిల్లాల్లో 5 నుంచి 10 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. ఓవరాల్ గా తెలంగాణ అంతటా.. రాబోయే మూడు, నాలుగు రోజులు.., అంటే డిసెంబర్ 28వ తేదీ వరకు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఉష్ణోగ్రత తక్కువ నమోదు అవుతుంది.
ఇక రాత్రులు బయటకు వస్తే గజగజ వణికిపోవటమే.. అత్యవసరం అయితేనే బయటకు రండి అని స్పష్టం చేస్తుంది వాతావరణ శాఖ రిపోర్ట్.
