హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి కొత్త గవర్నర్ వచ్చిన కనీసం శుభాకాంక్షలు తెలిపేందుకైన ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న కేసీఆర్ సభ రాడా.. సభకు రావాల్సిన బాధ్యత లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజులు పోయినా రాచరిక పోకడలు పోలేదని.. కొంతమంది ఇంకా రాజులుగా భావిస్తున్నారని పరోక్షంగా కేసీఆర్ను విమర్శించారు. నియంత పోకడలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని.. బీఆర్ఎస్ను ఓడించి ప్రజలే తప్పు చేసినట్లుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
అధికారం పోయినా ఇంకా అదే అహంకారంతో ఉన్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ ఇప్పటికైనా సభకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఆయనకు ఉన్న అనుభవంతో ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేస్తే స్వీకరిస్తామని తెలిపారు. 4 కోట్ల ప్రజలను నిరాశ పర్చేలా ప్రతిపక్షాల తీరు ఉందని తమ ప్రభుత్వం భవిష్యత్ ప్రణాళికలతో ముందుకెళ్తుందని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై బుధవారం (మార్చి 18) సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు.
►ALSO READ | సింగరేణి కార్మికులకు పెన్షన్ పెంచండి: ఎంపీ వంశీకృష్ణ
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘గవర్నర్ ప్రసంగం చారిత్రాత్మకం. గవర్నర్ ప్రసంగం తెలంగాణ అభివ్రుద్ధికి విశిష్ట ప్రణాళిక. ప్రతిపక్షం కూడా గవర్నర్ ప్రసంగానికి హుందాగా ధన్యవాదాలు తెలుపుతుందని ఆశించాం. అభివ్రుద్ధిలో కలిసి వస్తారని ఆశించాం.. కానీ అహంకారం ప్రదర్శించారు. 4 కోట్ల మంది ప్రజలను నిరాశ పర్చేలా ప్రతీపక్షాల తీరు ఉంది. రాజ్యాలు పోయినా రాచరిక పోకడలు పోలేదు. కొందరు ఇంకా తాము రాజులుగా భావిస్తున్నారు.
నియంత పోకడలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభను పక్క దారి పట్టించారు. ప్రతిపక్షంలో కూర్చొబెట్టిన వాళ్ల తీరు మారలేదు. కొత్తగా వచ్చిన గవర్నర్ శుభాకాంక్షలు తెలపడానికి కూడా ప్రధాన ప్రతిపక్ష నేత రాలేదు. సభ సంప్రదాయాలను విపక్ష నేత గౌరవించకపోవడం రాష్ట్రానికి మాయని మచ్చ. ప్రతిపక్ష నాయకుడు ఇప్పటిదాకా కోటీ 6 లక్షలకు పైగా జీతభత్యాలు పొందారు. కేసీఆర్ ఇప్పటికైనా సభకు రావాలి’’ అని అన్నారు.
