తీసుకున్న లోన్లు చెల్లించకుండా మొండిగా వ్యవహరిస్తున్న మహిళా సంఘాలపై రెవెన్యూ రికవరీ యాక్ట్

తీసుకున్న లోన్లు చెల్లించకుండా మొండిగా వ్యవహరిస్తున్న మహిళా సంఘాలపై రెవెన్యూ రికవరీ యాక్ట్
  • 'స్త్రీ నిధి' లోన్​ కట్టకుంటే ఆస్తులు జప్తు..  ఫస్ట్​ ఫేజ్​ నోటీసులు జారీ.. 
  • ఈ వారంలోనే  సెకెండ్​ ఫేజ్​ నోటీసులు
  • యాదాద్రి, మెదక్, సిద్దిపేట జిల్లాలో పేరుక పోతున్న బకాయిలు

యాదాద్రి/మెదక్/సిద్దిపేట, వెలుగు: తీసుకున్న లోన్లు చెల్లించకుండా మొండిగా వ్యవహరిస్తున్న మహిళా సంఘాలపై రెవెన్యూ రికవరీ (ఆర్​ఆర్​) యాక్ట్​ ప్రయోగించడానికి ‘స్త్రీ నిధి క్రెడిట్​ కో ఆపరేటివ్​ ఫెడరేషన్​ లిమిటెడ్’  సిద్ధమవుతోంది. ఈ యాక్ట్​ కింద లోన్​ చెల్లించని సంఘాల బాధ్యుల ఆస్తులను జప్తు చేస్తారు.

తీసుకున్న లోన్లు మహిళలే సక్రమంగా చెల్లిస్తారని బ్యాంకులు సహా చాలామంది నమ్మకం. కొందరి కారణంగా ఇప్పుడు అది కూడా వమ్ము అవుతోంది. సభ్యులు చెల్లిస్తున్నా.. కొందరి ఆఫీస్​ బేరర్లు బ్యాంక్​లో చెల్లించని  కారణంగా మొండి బకాయిలు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితి యాదాద్రి, మెదక్, సిద్దిపేట జిల్లాలో ఎక్కువగా ఉంది.

2018 నుంచి పేమెంట్ ​డిఫాల్ట్..​  
యాదాద్రి జిల్లాలోని 17 మండలాలు, ఆరు మున్సిపాలిటీల్లో సెర్ఫ్, మెప్మా పరిధిలో 20,392 సంఘాలున్నాయి. ఆయా సంఘాలకు స్త్రీ నిధి లోన్లు ఇస్తున్నారు. మొదట్లో రికవరీలు సక్రమంగా ఉన్నాయి. మహిళలు కచ్చితంగా చెల్లిస్తారన్న నమ్మకంతో ఏటేటా సంఘాలకు లోన్లు భారీగా ఇస్తున్నారు. 2018–-19 ఫైనాన్స్​ ఇయర్​ నుంచి స్త్రీ నిధి రుణాల చెల్లింపులో జాప్యం మొదలైంది.  కరోనా విజృంభించిన సమయంలో వసూలు విషయంలో కొంత వెసులుబాటు కల్పించారు. అప్పటి నుంచి డిఫాల్ట్​ సంఘాల సంఖ్య మరింతగా పెరిగిపోయింది.

కొన్ని సంఘాల్లో సభ్యులు చెల్లిస్తున్నా ఆఫీస్​ బేరర్లుగా వ్యవహరించే అధ్యక్షురాలు, ప్రధాన కార్యదర్శి ఇతర లీడర్లు ఆ అమౌంట్​ను చెల్లించకుండా పక్కదారి పట్టిస్తున్నారు. ఈ పరిణామంతో జిల్లాలోని భువనగిరి, వలిగొండ, ఆలేరు సహా పలు మండలాల్లో లీడర్లు, సభ్యులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలు పై ఆఫీసర్ల దృష్టికి చేరిపోతున్నాయి. దీంతో సంఘాల నుంచి లోన్ల వసూలు విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. 

రూ. 36.09 కోట్లు పెండింగ్​
యాదాద్రి జిల్లాలోని 17 మండలాల్లోని సెర్ఫ్​ పరిధిలో 16,919 సంఘాలున్నాయి. ఇందులో 2025–-26 ఫైనాన్స్​ ఇయర్​లో 7,330 సంఘాలకు రూ.  44.34 కోట్లు రుణాలుగా ఇచ్చారు. దీంతో గతంలో పెండింగ్​ ఉన్న అమౌంట్​తో కలిపి రూ. 85.60 కోట్లకు చేరింది. 

ఇప్పటివరకూ రూ. 55.01 కోట్లు చెల్లించారు. ఇంకా రూ. 30.79 కోట్లు పెండింగ్​లో ఉంది. మెప్మా పరిధిలో 3,417 సంఘాల్లో 1,351 సంఘాలకు రూ. 16.34 కోట్లు లోన్​ ఇచ్చారు. గత పెండింగ్​తో కలిపి రూ. 20.07 కోట్లకు చేరింది. ఇప్పటివరకూ  రూ. 14.85 కోట్లు చెల్లించగా ఇంకా రూ. 5.29 కోట్లు బకాయిగా ఉంది.

మొత్తంగా రూ. 69.90 (66.13 శాతం) కోట్లు చెల్లించగా, రూ. 36.09 కోట్లు పెండింగ్​లో ఉంది. ఇందులో వలిగొండ మండలం టాప్​లో నిలిచింది. మున్సిపాలిటీలో భువనగిరి, మోత్కూరు టాప్​లో నిలిచాయి. గతేడాది ఏప్రిల్​ నుంచి ఇప్పటివరకూ ఏడాదిగా 1,684 సంఘాలు తీసుకున్న సంఘాల్లో ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఇందులో వలిగొండ మండలంలోనే 338 సంఘాలు ఉన్నాయి. 

రూల్స్​ ప్రకారం ఫైనాన్స్​ ఇయర్​ ఎండింగ్​కు మరో 13 రోజులే గడువుంది. ఈ లోపు బకాయి ఉన్న సంఘాలన్నీ తమ పేమెంట్​ చెల్లించాల్సి ఉంటుంది. వసూలు కోసం స్పెషల్​ డ్రైవ్​ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే పేమెంట్​ చెల్లింపుపై అనుమానాలు నెలకొన్నాయి. 

సంఘాలపై ఆర్​ఆర్​యాక్ట్​ ప్రయోగానికి రెడీ
స్త్రీ నిధి కింద లోన్లు తీసుకొని చెల్లించని సంఘాలపై రెవెన్యూ రికవరీ (ఆర్​ఆర్​) యాక్ట్​ 1864 ప్రయోగించడానికి ‘స్త్రీ నిధి క్రెడిట్​ కో ఆపరేటివ్​ ఫెడరేషన్​ లిమిటెడ్​’ సిద్ధమైంది. ఇందులో భాగంగా జిల్లాలో పెద్ద మొత్తంలో బకాయి ఉన్న 200 సంఘాలకు పైగా ఫస్ట్​ ఫేజ్​ నోటీసులు ఇప్పటికే జారీ చేశారు. ఈ నోటీసులు జారీ చేయడంతో భువనగిరిలో తాము లోన్​ తీసుకోకున్నా.. తీసుకున్నట్టు పేర్కొనడంతో సంఘంలో గొడవలు మొదలయ్యాయి. 

ఈ వారంలో సెకెండ్​ ఫేజ్​ నోటీసులు జారీ చేయనున్నారు. ఈ రెండు నోటీసులకు స్పందించని సంఘాలకు థర్డ్​ ఫేజ్​లో రెవెన్యూ రికవరీ యాక్ట్​ 1864 కింద నోటీసులు జారీ చేస్తారు. బకాయిలు చెల్లించని ఆయా సంఘాలకు సంబంధించిన ఆస్తులను జప్తు చేయనున్నారు. 

మెదక్ జిల్లాలో..
మెదక్​ జిల్లాలో మొత్తం 16,866 ఎస్‌‌హెచ్‌‌జీలు ఉండగా, 1,68,660 మంది సభ్యులు ఉన్నారు. వీటిలో సెర్ఫ్ పరిధిలో గ్రామాల్లో 14,906 మహిళా సంఘాల్లో 1,49,060 మంది సభ్యులు, మెప్మా పరిధిలోని మున్సిపాలిటీల్లో 1,960 ఎస్‌‌హెచ్‌‌జీ గ్రూపుల్లో వాటిలో 19,600 మంది సభ్యులు ఉన్నారు.  స్త్రీ నిధి ద్వారా ఈ ఏడాది రూ.78 కోట్ల రుణాలు ఇవ్వాలన్నది లక్ష్యం కాగా ఇప్పటివరకు రూ.71.20 కోట్లు (91.30 శాతం)  ఇచ్చారు. రుణ రికవరీ డిమాండ్ రూ.103 కోట్లు ఉండగా, ఇప్పటి వరకు రూ.78 కోట్లు (75.72 శాతం) మాత్రమే వసూలయ్యాయి.

రామాయంపేట, చేగుంట, నర్సాపూర్, కౌడిపల్లి, చిన్నశంకరం పేట మండలంలో బకాయిలు ఎక్కువగా ఉన్నాయి. మొండి బకాయిల వసూలుకు రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగా, ఆ మేరకు స్త్రీ నిధి, మెప్మా అధికారులు మహిళా సంఘాల సమావేశాలు నిర్వహిస్తూ, బకాయిదారులకు ఆ విషయం తెలియజేస్తున్నారు. బకాయిలు చెల్లించకుంటే ఆర్ఆర్ యాక్ట్, కో ఆపరేటివ్ యాక్ట్ కింద ఆస్తులు జప్తు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. అనంతరం నిబంధనల ప్రకారం బకాయిదారులకు దశలవారీగా నోటీసులు జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. 

సిద్దిపేట జిల్లాలో..
సిద్దిపేట జిల్లాలో 24,586 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లు ఉన్నాయి.  సెర్ప్‌‌ లో 18, 500, మెప్మాలో 61,250 సంఘాలు ఉండగా, అందులో 1.94 లక్షల మంది సభ్యులు ఉన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.56 కోట్లు స్త్రీ నిధి రుణాల టార్గెట్ ఉంది. ఇప్పటివరకు రూ.36 కోట్లు ఇవ్వగా, రికవరీ మాత్రం 62 శాతమే ఉంది. రూ.78 కోట్ల రికవరీ డిమాండ్ ఉండగా, ఇప్పటి వరకు రూ.40 కోట్లు కలెక్షన్స్ అయ్యాయి. రూ.30.20 కోట్ల బకాయి ఉన్నాయి.

జిల్లాలో 50 నుంచి 60 సంఘాలకు డిమాండ్ నోటీసులు అందజేశారు. మే 10లోగా డబ్బులు కట్టకపోతే ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ యాక్ట్ అమలు చేస్తామని అధికారులు చెబుతున్నారు.  సిద్దిపేట రూరల్, చిన్నకోడూరు, దుబ్బాక, మిరుదొడ్డి, దౌల్తాబాద్, మద్దూరు మండలాల్లో ఎక్కువగా బకాయి ఉన్నట్లు అధికారులు తెలిపారు.