ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ (ట్విట్టర్) సేవల్లో అంతరాయం

ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ (ట్విట్టర్) సేవల్లో అంతరాయం

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‎ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) సేవల్లో అంతరాయం ఏర్పడింది. బుధవారం (మార్చి 18) రాత్రి యాప్‎లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో యూజర్లు ఫీడ్‌ రిఫ్రెష్ చేయలేకపోవడం, లింక్‌లను తెరవలేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొన్నారు. ఇతర సోషల్ మీడియా ప్లాట్‌‎ఫామ్‎ల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. 

వైబ్ సైట్ల అంతరాయాలను ట్రాక్ చేసే డౌన్‌డిటెక్టర్ ప్రకారం.. భారతదేశంలో ఈ సమస్య బుధవారం (మార్చి 18) సాయంత్రం వేళల్లో ప్రారంభమైంది. రాత్రి 8:17 గంటల సమయానికి 1,200 మందికి పైగా వినియోగదారులు సమస్యలను నివేదించారు. రాత్రి 8:30 గంటల సమయానికి దేశవ్యాప్తంగా 4,500 మందికి పైగా వినియోగదారులు ఎక్స్‎లో సమస్యను గుర్తించారు. నోటిఫికేషన్‌లు వస్తున్నప్పటికీ టైమ్‌లైన్ మాత్రం రీఫ్రెష్ అవ్వడం లేదు. 

వినియోగదారులు రిఫ్రెష్ చేయడానికి ప్రయత్నించినా ప్రస్తుతానికి ఎలాంటి పోస్ట్‌లను పొందలేము.. దయచేసి తర్వాత మళ్లీ ప్రయత్నించండని మేసేజ్ కనిపించింది. అమెరికాలో కూడా ఎక్స్ సేవల్లో అంతరాయం ఏర్పడింది.  14 వేల మందికి పైగా వినియోగదారులు సమస్యలను నివేదించారు. ఈ అంతరాయానికి కారణమేమిటి.. సమస్య పరిష్కరించడానికి ఎంత సమయం పడుతుంది అనే దానిపై ఎక్స్ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.