షేక్ హసీనా ప్రెస్ మీట్‎తో భారత్‎కు సంబంధం లేదు: కేంద్రం

షేక్ హసీనా ప్రెస్ మీట్‎తో భారత్‎కు సంబంధం లేదు: కేంద్రం

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ నుంచి బహిష్కరణకు గురై, ఇండియాలో ఆశ్రయం పొందుతున్న బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా 2026, ఆగస్ట్ 5న నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‎పై భారత్ స్పందించింది. షేక్ హసీనా ప్రెస్ కాన్ఫరెన్స్‎లో తమ ప్రభుత్వ ప్రమేయం లేదని భారత్ క్లారిటీ ఇచ్చింది. ఆ కార్యక్రమం పూర్తిగా ఒక ప్రైవేట్ మీడియా సంస్థ నిర్వహించిందని స్పష్టం చేసింది. శుక్రవారం (ఆగస్ట్ 7) ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. షేక్ హసీనా ప్రెస్ కాన్ఫరెన్స్‎లో భారత ప్రభుత్వ ప్రమేయం లేదని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం సులభతరం చేయలేదని.. ఒక ప్రైవేట్ మీడియా సంస్థ ఆ కార్యక్రమాన్ని నిర్వహించిందని చెప్పారు. ప్రెస్ కాన్ఫరెన్స్‎లో హసీనా చెప్పిన ఏ విషయాన్నీ గానీ.. ముఖ్యంగా బంగ్లాదేశ్‌లో చట్టబద్ధంగా ఏర్పడిన ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించి చెప్పిన విషయాలను భారత ప్రభుత్వం ఆమోదించదని తెలిపారు. 

రెండేళ్ల తర్వాత హసీనా ప్రత్యక్షం:

బంగ్లాదేశ్ నుంచి బహిష్కరణకు గురై, ఇండియాలో ఆశ్రయం పొందుతున్న బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా రెండేళ్ల తర్వాత తొలి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2026 ఆగస్టు 5న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కీలక విషయాలు పంచుకున్నారు. బంగ్లాదేశ్‎కు -ఇండియా అత్యవసర సమయాల్లో అండగా ఉంటూ వచ్చిందని అన్నారు. 

బంగ్లాదేశ్ ఇప్పుడు మరో పాకిస్తాన్ లా మారిపోయిందని అన్నారు. అది -ఇండియాకు ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం అని అన్నారు. హసీనా ప్రధానిగా ఉన్న సమయంలో ఇండియా వ్యతిరేక శక్తులను, టెర్రరిస్టులను ఏరిపారేసినట్లు చెప్పారు. మహమ్మద్ యూనుస్ పాలనలో బంగ్లా పూర్తిగా నాశనం అయ్యిందని.. ఆగస్టు 5, 2024 తర్వాత రాజకీయ హత్యలు అధికారికంగా జరుగుతున్నాయని ఆరోపించారు. 

బంగ్లాదేశ్‏కు తిరిగి వెళ్లనున్నట్లు ఈ సందర్భంగా హసీనా చెప్పారు. తనపై కేసులకు భయపడనని అన్నారు. తను వెళ్తే చంపేయాలని చూస్తున్నారని... అయినా వెళ్తానని చెప్పారు. తను తిరిగి వెళ్లాలనుకునేది అధికారం కోసం కాదని.. అక్కడి తిరిగి దేశ భద్రత, అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు, శాంతిని నెలకొల్పేందుకేనని అన్నారు. వాళ్లు నన్ను జైల్లో వేసినా.. చంపేసినా ఏదైనా జరిగినా.. వెళ్లాల్సిందేనని అన్నారు. 2024 ఆగస్టులో ప్రభుత్వం మారిన తర్వాత భారత్ తో బంగ్లా సంబంధాలన్నీ చెడిపోయాయని.. దీనికి కారణం ప్రస్తుతం అక్కడ ఉన్న పాలకులేనని విమర్శించారు. ఆర్థికంగా బంగ్లా క్షీణించిపోయిందని.. జీడీపీ మందగించిందని అన్నారు. 

ద్రవ్యోల్బణం పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు చెప్పారు. పేదరికంతో అల్లాడుతున్నట్లు తెలిపారు. తను దేశం నుంచి బహిష్కరించాక 2024 నుంచి వేల మందిని అరెస్టు చేశారని.. ఎంతో మంది అవామీ లీగ్ కార్యకర్తలు, లీడరర్లను, తమ మద్దతు దారులను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. పోలీసులు, జర్నలిస్టులు, లాయర్లు, జడ్జీలు, మైనారిటీలను ఘోరంగా హింసించారని అన్నారు. వారందరికీ భరోసా ఇచ్చేందుకు, దేశంలో శాంతి సామరస్యం నెలకొల్పేందుకైనా తను వెళ్లాల్సి ఉందని అన్నారు.