అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుపై విజయ్ సంచలన ప్రకటన

అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుపై విజయ్ సంచలన ప్రకటన

చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుపై టీవీకే చీఫ్ విజయ్ కీలక ప్రకటన చేశారు. తాము ఎవరితో పొత్తు పెట్టుకోమని కుండబద్దలు కొట్టారు. ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తేల్చి చెప్పారు. తమ పార్టీ వివిధ రాజకీయ వర్గాలతో పొత్తు పెట్టుకుంటుందని వస్తోన్న వదంతులు నిరాధారమైనవని కొట్టిపారేశారు. మేం ఏ పార్టీ పక్షం కాదని.. మేము ప్రజల పక్షమని పేర్కొన్నారు. 

మేం ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని స్పష్టంగా చెప్పినప్పటికీ కొందరు ప్రజల్లో గందరగోళం సృష్టించాలని చూశారని కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదన్నారు. లౌకికవాదం, సామాజిక న్యాయ సూత్రాల విషయంలో తాను గానీ, తన పార్టీ గానీ ఎన్నిటికీ రాజీపడబోదని అన్నారు. సొంత నాయకత్వంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని టీవీకే పార్టీ నిశ్చయించుకుందని స్పష్టం చేశారు. 

►ALSO READ | అజిత్ పవార్ మృతి కేసులో కీలక పరిణామం: కేంద్ర హోంశాఖకు సీఎం ఫడ్నవీస్ లేఖ

కాగా, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఎన్డీఏ పొత్తు పెట్టుకుంటుందని తమిళనాడు రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. విజయ్‎కు డిప్యూటీ సీఎం పదవితో పాటు టీవీకేకు 80 సీట్లు కేటాయిస్తామని బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు ఊహాగానాలు వినిపించాయి. ఈ క్రమంలో పొత్తులపై విజయ్ తన వైఖరి స్పష్టం చేయడంతో ఎన్డీఏతో అలయెన్స్ పుకార్లకు చెక్ పడింది. 

విజయ్ తాజా ప్రకటనతో ఈసారి తమిళనాడులో త్రిముఖ పోరు ఖాయమని తేలిపోయింది. అధికారం కోసం డీఎంకే, ఎన్డీఏ కూటమి, టీవీకే ఎన్నికల బరిలో తలపడనున్నాయి. కాగా, మొత్తం 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో 2026, ఏప్రిల్ 23న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. 2026, మే 4న ఫలితాలు విడుదల కానున్నాయి.