ఇన్సూరెన్స్ కంపెనీలపై కంప్లైంట్లు.. ఫస్ట్ ఎల్ఐసీ.. తరువాత స్థానంలో స్టార్హెల్త్

ఇన్సూరెన్స్ కంపెనీలపై కంప్లైంట్లు.. ఫస్ట్ ఎల్ఐసీ.. తరువాత స్థానంలో స్టార్హెల్త్
  • మొత్తం 2.58 లక్షల కంప్లయింట్స్​
  • ఎల్​ఐసీపై 74 వేల వరకు.. తరువాత స్థానంలో స్టార్​హెల్త్​
  • పార్లమెంటులో కేంద్రం ప్రకటన

న్యూఢిల్లీ: లైఫ్​/ఇన్సూరెన్స్​ క్లెయిమ్​లను పరిష్కరించకపోవడంతో బీమా సంస్థలపై గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో లక్షల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయని కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంటులో వెల్లడించింది. ఇన్సూరెన్స్​ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్​ ఇండియా (ఐఆర్​డీఏఐ) లెక్కల ప్రకారం 2025 ఆర్థిక సంవత్సరంలో వీటిపై 2.58 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. 

2024 ఆర్థిక సంవత్సరంలో 2.15 లక్షలు, 2023లో 2.02 లక్షల ఫిర్యాదులు అందాయని రాజ్యసభలో ఎంపీ మేధా కులకర్ణి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి చెప్పారు. క్లెయిమ్ తిరస్కరణ, కారణం చెప్పకుండా క్లెయిమ్ నిలిపివేయడం, గడువు ముగిసినా ప్రయోజనాలు అందకపోవడం, అంచనా వేసిన నష్టానికి, చెల్లించిన మొత్తానికి మధ్య తేడాలు ఉండటం వంటి అంశాలపై పాలసీదారులు ఐఆర్​డీఏఐకి ఫిర్యాదు చేస్తున్నారు.

ఎల్​ఐసీ, స్టార్ హెల్త్​పై అత్యధిక ఫిర్యాదులు వచ్చాయి. గత ఏడాది ఎల్ఐసీపై 74,104 ఫిర్యాదులు, స్టార్ హెల్త్​పై 20,527 ఫిర్యాదులు నమోదయ్యాయి. నేషనల్ ఇన్సూరెన్స్, కేర్ హెల్త్, యునైటెడ్ ఇండియా వంటి సంస్థలూ ఈ జాబితాలో ఉన్నాయి. తప్పుడు సమాచారంతో పాలసీలు అమ్మడం అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముందుగా ఉన్న వ్యాధుల వెయిటింగ్ పీరియడ్​ను నాలుగేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించింది. పాలసీ రద్దు చేసుకునే ఫ్రీ లుక్ పీరియడ్​ను 30 రోజులకు పెంచింది. 

పొదుపు, బీమా ఉత్పత్తులకు సూటబిలిటీ అనాలిసిస్ తప్పనిసరి చేసింది.  ఒక వ్యక్తి ఆర్థిక అవసరాలు, లక్ష్యాలు, రిస్క్ తీసుకునే సామర్థ్యానికి తగిన బీమా పాలసీని ఎంచుకోవడాన్ని సూటబుల్​అనాలిసిస్​ అంటారు. ఏజెంట్ లేదా కంపెనీ ఒక పాలసీని అమ్మేముందు అది ఆ వినియోగదారునికి నిజంగా అవసరమా లేదా అని చేసే పరిశీలనే ఇది.  

కారణం లేకుండా తిరస్కరిస్తే కుదరదు
బీమా క్లెయిముల పరిష్కారానికి సంబంధించి వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ప్రొడక్ట్ మేనేజ్​మెంట్​ కమిటీ (పీఎంసీ) లేదా దానిలోని ముగ్గురు సభ్యులతో కూడిన క్లెయిమ్స్ రివ్యూ కమిటీ (సీఆర్​సీ) ఆమోదం లేకుండా క్లెయిమ్​ను తిరస్కరించకూడదు. కేవలం పత్రాలు లేవనో క్లెయిమ్ చేయడంలో ఆలస్యమైందనో ఫిర్యాదును మూసివేయడానికి వీల్లేదు. 

క్లెయిమ్ పూర్తిగా లేదా పాక్షికంగా తిరస్కరణకు గురైతే.. దానికి గల కారణాలను పాలసీ పత్రంలోని నిబంధనలు సహా స్పష్టంగా పాలసీహోల్డర్​కు తెలియజేయాలి. క్లెయిముల పరిష్కారానికి నిర్దిష్ట కాలపరిమితులు ఉన్నాయి. నిర్ణీత గడువులోపు క్లెయిమ్ సెటిల్ చేయడంలో ఆలస్యమైతే.. బీమా సంస్థలు జరిమానా, వడ్డీ కట్టాలి. ఈ నిబంధనలు బీమా సంస్థల జవాబుదారీతనాన్ని పెంచడంతో పాటు పాలసీదారులకు సకాలంలో ఆర్థిక భరోసా దక్కేలా చూస్తాయని ఐఆర్​డీఏ తెలిపింది.