హిల్ట్ పాలసీపై ఈడీ, సీబీఐ ఏ విచారణకైనా సిద్ధం: సీఎం రేవంత్

హిల్ట్ పాలసీపై ఈడీ, సీబీఐ ఏ విచారణకైనా సిద్ధం: సీఎం రేవంత్

హైదరాబాద్: హిల్ట్ పాలసీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ.. హిల్ట్ పాలసీపై కేటీఆర్, హరీష్ రావు లేఖ రాస్తే బీఆర్ఎస్ హయాంలో తెచ్చిన పాలసీ, తమ పాలసీపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని సీఎం రేవంత్ అన్నారు. గతంలో, ఇప్పటి హిల్ట్ పాలసీపై సీబీఐ, సిట్, ఈడీ ఏ విచారణకైని సిద్ధమని అన్నారు. అలాగే టీడీఆర్, బదిలీలపైనా విచారణకు సిద్ధమన్నారు. కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలకు పంపించేందుకే హిల్ట్ పాలసీ తెచ్చామని స్పష్టం చేశారు.

అసలు హిల్ట్ పాలసీ ఏంటి..?

హైదరాబాద్ సిటీ లోపల ఉన్న కాలుష్య కారక, అవుట్ డేటెడ్ టెక్నాలజీతో నడుస్తున్న పరిశ్రమలను అవుటర్ రింగ్ రోడ్డు( ఓఆర్ఆర్) అవతలకు తరలించేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కార్ కసరత్తు ప్రారంభించింది. బాలానగర్, కాటేదాన్,  కూకట్​పల్లి, ఉప్పల్, జీడిమెట్ల, చర్లపల్లి తదితర 22 ఇండస్ట్రియల్ ఏరియాల్లోని భూములను ఇతర అవసరాలకు వాడుకునేలా కొత్త పాలసీ రూపొందించింది. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్సఫర్మేషన్ పాలసీ ( హెచ్ఐఎల్టీపీ)ని నవంబర్ 17న  కేబినెట్ ఆమోదించి నవంబర్ 22న జీవో నెం.27ను  తీసుకొచ్చింది. 

దీని ప్రకారం 22 ఇండస్ట్రియల్ ఏరియాలోని  9,292.53  ఎకరాల భూములలో  ఖాయిలాపడి  మూతపడి ఉన్న పరిశ్రమల భూములు,  కాలుష్య కారకాలకు సంబంధించిన పరిశ్రమల భూములు ఉన్నవి.  ఇప్పటికే కొంతభాగం భూములు ఇతర అవసరాలకు వాడుతున్నందున,  మిగిలిన భూములను  కూడా  అదేవిధంగా వాడుకునేందుకు మార్చుకునేలా అవకాశం కల్పించింది. ఈ మొత్తం భూములు 4,740.14  ఎకరాలని ప్రభుత్వం పేర్కొంది.

►ALSO READ | సీఎస్ రామకృష్ణారావు పదవీ కాలం మరో 3 నెలల పొడగింపు

జనసాంద్రత మధ్య ఉన్న పరిశ్రమలను తరలించాలి

ప్రస్తుతం ఈ పారిశ్రామిక ప్రాంతాలు నగరం మధ్యలో ఉండి కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి.  సమీప ప్రాంతాలు బాగా అభివృద్ధి చెంది జన సాంద్రతను సంతరించుకున్నాయి. ఉమ్మడి రాష్ట్రం 2013లోనే  రెసిడెన్షియల్ జోన్​లో ఉన్న కాలుష్య కారకాల పరిశ్రమలన్నింటినీ ఓఆర్ఆర్ అవతలికి తరలించాలని ఆనాటి ప్రభుత్వం నిర్ణయించి జీవో 20ని తీసుకొచ్చింది.  దాని ప్రకారం కొన్ని కాలుష్య పరిశ్రమలు ఔటర్ రింగ్ రోడ్డు అవతలకు తరలించాల్సి ఉంది.

గత  బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కొన్ని కాలుష్య  పరిశ్రమలను మూసివేసి ఓఆర్ఆర్ అవతలికి పంపించింది.  మిగిలిన కొద్దిపాటి పరిశ్రమలు పాత సాంకేతికతనే  కొనసాగిస్తున్నాయి.  ఈ నేపథ్యంలో  ప్రధాన నగరంలో భాగంగా మారిన ఆనాటి పారిశ్రామికవాడల  నుంచి  పరిశ్రమలను  ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలకు పంపాలని గతంలో పాలకులు అనేక ప్రయత్నాలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఆ దిశగా ప్రయత్నాలు జరిగాయి.  ప్రస్తుత  కాంగ్రెస్  ప్రభుత్వం కూడా పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు అవతలకు తరలించేందుకు ప్రయత్నిస్తోంది.