ఘనంగా ఘటాల ఊరేగింపు

ఘనంగా ఘటాల ఊరేగింపు

బోనాలు ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఓల్డ్​ సిటీలోని ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో ఘటాల ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది. సాయంత్రం 4 గంటలకు హరిబౌలిలోని అక్కన్న మాదన్న ఆలయం వద్ద సిటీ సీపీ సీవీ ఆనంద్‌ జెండా ఊపి ప్రారంభించారు. గౌలిపురా, లాల్‌దర్వాజ, -శాలిబండ,-చార్మినార్, నయాపూల్‌లోని ఢిల్లీ గేట్ వరకు సాగింది. శోభాయాత్రను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. చార్మినార్ పరిసరాలు కిక్కిరిశాయి. అక్కన్నమాదన్న, లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయాల నుంచి సాయంత్రం అంబారీ ఊరేగింపు ఘనంగా ప్రారంభమైంది.

అంతకు ముందు లాల్ దర్వాజ ఆలయం వద్ద అనురాధ భవిష్యవాణి వినిపించారు. ‘‘నన్ను చాలా బాధపెడుతున్నారని, నాకు పూజలు సరిగ్గా జరపడం లేదని, పాపాలు పెరిగిపోతున్నాయని, నేను ఉగ్రరూపం చూపితే ఎవరికి ఏం జరుగుతుందో తెలియదన్నారు. ప్రజలు చేస్తున్న చెడు పనులు నన్ను బాధిస్తున్నాయని, మీరు ఎన్ని పాపాలు చేసినా మిమ్మల్ని రక్షిస్తానని” అభయం ఇచ్చారు. కార్వాన్ దర్బార్ మైసమ్మ  ఆలయం వద్ద సుశీలమ్మ భవిష్యవాణి వినిపించారు. అలాగే సిటీలోని వేర్వేరు ఆలయాల వద్ద ఫలహార బండ్ల ఊరేగింపు ఘనంగా జరిగింది.