అధికారం అగ్రవర్ణాల చేతిలో బందీ అయ్యింది

అధికారం అగ్రవర్ణాల చేతిలో బందీ అయ్యింది

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అధికారం అగ్రవర్ణాల చేతిలో బందీ అయిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కుటుంబ పాలనకు స్వస్తి పలికి సమాన అవకాశాలు ఉండే బహుజన రాజ్యాన్ని నిర్మించుకోవాలని, అందుకు విద్యావంతులు కీలక భూమిక పోషించాలని కోరారు. ఆదివారం హైదరాబాద్ బాగ్​లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహుజన విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో బహుజన విద్యావంతుల మేధోమదన సదస్సు జరిగింది. సదస్సుకు రాష్ట్రపతి మాజీ ఓఎస్డీ సాహూ, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరు మురళి, ప్రముఖ డాక్టర్ తిరుపతయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణలో బహుజన సమాజం పెను ప్రమాదంలో ఉందన్నారు.

లక్షల కోట్ల ప్రజాధనం ఆంధ్ర ప్రాంత కాంట్రాక్టర్లకు పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎన్నోసార్లు మోసపోయామని, ఈసారి మోసపోతే తప్పు విద్యావంతులది అవుతుందన్నారు. బహుజన విద్యావంతులంతా చైతన్యవంతంగా ఉండి గ్రామాల్లోకి వెళ్లి ఎక్కువ మందిని ప్రభావితం చేయాలన్నారు. ఆకునూరి మురళి మాట్లాడుతూ విద్యా వికాసం ద్వారానే సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. సదస్సులో బహుజన విద్యావంతుల వేదిక కన్వీనర్లు డాక్టర్​  శ్రీనివాస్, మాలిక్, కొంపల్లి రాజు, రిటైర్డ్ తహసీల్దార్​ బాలరాజ్, అలీ ఖాన్ తదితరులు
 పాల్గొన్నారు.