19 నుంచి క్యాబ్ లు బంద్

19 నుంచి క్యాబ్ లు బంద్

ఆర్టీసీ సమ్మెతో  13 రోజులుగా ఇబ్బందులు పడుతున్న జనాలకు క్యాబ్ డ్రైవర్ల సమ్మె మరింత గుబులు పుట్టిస్తోంది. ఇప్పటికే సిటీలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది.  అన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామ ని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేగా ఉంది. 3,850 సిటీ బస్సులు నడపాల్సిన 1,500 లకు మించి తిరగడం లేదు. వీటిలోనూ చాలా వరకు ప్రైవేట్ ట్రావెల్, మినీ, స్కూల్ బస్సులే ఉన్నాయి. ఇవి ప్రజల అవసరాలకు  ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో క్యాబ్ లు, ఆటోలే దిక్కు గా మారాయి. ఆర్టీసీ సమ్మె ప్రారంభ మైనప్పటి నుంచి క్యాబ్ ల పై ఆధా రపడుతున్న వారి సంఖ్య 25 లక్షలకు పెరిగింది. దాదాపు 80 వేలకు పైగా క్యాబ్ లు ఉన్నాయి. సాధారణ సమ యాల్లో 10 లక్షల మంది మాత్రమే క్యాబ్ సర్వీసులు ఉపయోగించుకునే వారు. క్యాబ్‌‌‌‌లై  జనాలకు కాస్త ఉపశమనంగా మారాయి.

హైదరాబాద్, వెలుగుఆర్టీసీ సమ్మె కారణంగా అష్టకష్టాలు పడుతున్న నగర జనాలకు మరో సమ్మె పోటు తప్పేలా లేదు. సిటీలోని ఓలా, ఉబర్ క్యాబ్‌‌‌‌లతో పాటు ఐటీ సంస్థలకు చెందిన 50 వేల క్యాబ్‌‌‌‌లు శనివారం నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లనున్నాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి ఓలా, ఉబెర్ సంస్థలకు తెలంగాణ ట్యాక్సీ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ 6 డిమాండ్లతో ఇప్పటికే సమ్మె నోటీసులు ఇచ్చింది. తెలంగాణ టాక్సీ అండ్ డ్రైవర్ల అసోసియేషన్ ముఖ్యంగా క్యాబ్ సర్వీసులకు అగ్రిగేటర్ సేవలు అమలు చేయాలని కోరుతోంది. కిలోమీటర్ కు రూ.22తో పాటు బోర్డు ఆఫ్ రోడ్ డ్రైవర్లను తిరిగి ఏర్పాటు చేయాలని, అన్ని క్యాబ్ డ్రైవర్లకు కనీస వ్యాపార హామీ ఇవ్వాలంటోంది.  ఐటీ సంస్థలకు అనుసంధానించిన డ్రైవర్లకు జీవో 61, 66 అమలు చేయాలని, డ్రైవర్లపై దాడుల కేసుల పరిష్కారానికి కేవైసీ ఆమోదాన్ని నిర్ధారించుకుంటూ ట్యాక్సీ డ్రైవర్స్ వెల్ఫేర్‌‌‌‌ అండ్ అడ్మినిస్ట్రేషన్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈనెల19 వ తేదీ లోపు ప్రభుత్వం స్పందించకుంటే నిరవధికంగా సమ్మె కొనసాగుతుందని తేల్చిచెప్పింది.  అదేవిధంగా శనివారం ఆర్టీసీ బంద్‌‌‌‌కు మద్దతుగా సమ్మెలో పాల్గొననున్నట్లు అసోసియేషన్‌‌‌‌ స్పష్టం చేసింది.

ఆఫీసులకు, పనులకు వెళ్లే దారేది

ఆర్టీసీ కార్మికులు సమ్మె లో ఉండగా క్యాబ్ డ్రైవర్లు కూడా నిరవధిక సమ్మెకు దిగితే జనాలకు కష్టాలు డబుల్​ కానున్నాయి. ఈ రెండు లేకపోతే అల్టర్ నేట్ కూడా లేదు. ఇప్పటికీ సిటీలో 50 లక్షల మంది వరకు తమ ప్రయాణానికి వీటిపైనే ఆధారపడున్నారు. 19 నుంచి క్యాబ్‌‌‌‌ల సమ్మె నేపథ్యంలో ప్రయాణానికి దారేదన్న ప్రశ్న తలెత్తింది. వ్యక్తిగత వాహనాలు ఉన్న వారికి ఇబ్బందులు లేవు గానీ, ఉద్యోగులు, కాలేజ్ విద్యార్థులకు సమ్మె పోటు తప్పేలా లేదు.  సిటీలో లక్షా 25 వేల వరకు ఉన్న ఆటోలతో ప్రయాణికుల అవసరాలను తీర్చటం సాధ్యమయ్యే పనికాదు.

స్కూళ్లు ప్రారంభమైతే  బస్సులు కూడా ఉండవు

ఈ నెల 21 నుంచి స్కూళ్లు, కాలేజ్ లు రీ ఓపెన్ కానున్నాయి. అదే జరిగితే ప్రస్తుతం సిటీలో నడుపుతున్న విద్యాసంస్థల బస్సులన్నింటిని వారికి అప్పగిస్తారు. దీంతో మరో 5 వందల బస్సులకు పైగా రోడ్డెక్కే పరిస్థితి ఉండదు. స్కూళ్లు, కాలేజ్ లు ప్రారంభమైతే రద్దీ పెరుగుతుంది.

ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికే చుక్కలే

సిటీలో ఉండే జనం మాత్రమే కాదు.  వివిధ ప్రాంతాల నుంచి పనుల కోసం లక్షల మంది  వస్తుంటారు. హాస్పిటల్స్, చదువు, బిజినెస్‌‌‌‌, టూరిజంతో పాటు వివిధ పనులపై రోజుకు 20 లక్షల మంది వరకు వచ్చి  పోతుంటారు. వీరంతా ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల నుంచి తమ గమ్య స్థానాలకు వెళ్లేందుకు వినియోగించేది ఎక్కువగా సిటీ బస్సులు, క్యాబ్ లే. ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో రోజుకు 5 వేలకు పైగా క్యాబ్ లు ప్రయాణికుల అవసరాలను తీరుస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు వినియోగించేది క్యాబ్ సర్వీసులనే. ఆర్టీసీ, క్యాబ్ ల సమ్మె కొనసాగితే వీరందరికీ కష్టాలు తప్పవు.

ఐటీ కంపెనీలకు తగలనున్న క్యాబ్ సమ్మె సెగ

ఐటీ కంపెనీలకు వేల సంఖ్యలో క్యాబ్ సర్వీసులు అందిస్తున్నాయి. ఆయా కంపెనీల ఉద్యోగులను పికప్, డ్రాప్ చేసుకుంటాయి. సమ్మె కారణంగా ఎంప్లాయీస్‌‌‌‌ ఆఫీసులకు వెళ్లటానికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. టైమ్‌‌‌‌కు ఆఫీసుకు వెళ్లే పరిస్థితి ఉండదు. దీనిపై పలు ఐటీ సంస్థలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

 బస్సు సర్వీసుల సంఖ్య పెంచని అధికారులు

ఆర్టీసీ సమ్మె 13 వ రోజు చేరగా ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు. ఇన్ని రోజులు గడిచినా పూర్తిస్థాయిలో బస్సులను అధికారులు ఏర్పాటు చేయలేదు. ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్, విద్యా సంస్థలు బస్సులు కలిపి 1,500 లకు మించిలేవు.   తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లుగా వచ్చేందుకు కొత్తవారు ఆసక్తి చూపటం లేదు.

మెట్రో, ఎంఎంటీఎస్‌‌‌‌ వైపే 

ఆర్టీసీ సమ్మె ప్రారంభమైన తర్వాత మెట్రో,ఎంఎంటీఎస్ ను వినియోగించే వారి సంఖ్య భారీగా పెరిగింది.మెట్రో అదనపు సర్వీసులతో పాటు టైమింగ్ పొడగిం చింది.గతంలో లేని విధంగా ప్రస్తుతం మెట్రోలో రోజుకు కనీసం 3లక్షలకు పైగా జనం ప్రయాణిస్తున్నారు. క్యాబ్ ల సమ్మె కొనసాగితే అవసరాన్ని బట్టిని మరిన్ని మెట్రో ట్రైన్స్ నడిపిస్తామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అటు సికింద్రాబా ద్ నుంచి హైటెక్ సిటీకి ఎంఎంటీఎస్ సర్వీసులు అందుబాటులో ఉండడంతో ఎంఎంటీఎస్ సర్వీసులకు కూడా రద్దీ పెరగనుంది.

నిరవధిక సమ్మె కొనసాగిస్తాం

క్యాబ్ డ్రైవర్ల సమస్యలను తీర్చాలంటూ 6 డిమాండ్లను ప్రభుత్వం ముందుం చాం. ఈ నెల 19 లోపు స్పందిస్తే సరే. లేదంటే నిరవధిక సమ్మె కొనసాగి స్తాం. శనివారం ఆర్టీసీ చేపట్టిన బంద్ కు మా మద్దతు తెలుపుతున్నాం. ఆ రోజు 50 వేల క్యాబ్ లు సమ్మెలో పాల్గొంటాయి. ఆ తర్వాత సమ్మె కొనసాగించే విషయంలో ప్రభుత్వం నుంచి వచ్చే స్పందనను బట్టి నిర్ణయం తీసుకుంటాం.

– సలావుద్దీన్, తెలంగాణ ట్యాక్సీ అండ్
డ్రైవర్స్ జేఏసీ చైర్మన్