కాంగ్రెస్‌ను ఎవరూ కాపాడలేరు: శివరాజ్ చౌహాన్

కాంగ్రెస్‌ను ఎవరూ కాపాడలేరు: శివరాజ్ చౌహాన్

న్యూఢిల్లీ: ఒక్క లేఖ.. కేవలం ఒకే ఒక్క లెటర్‌‌ కాంగ్రెస్‌ పార్టీలో తీవ్ర దుమారానికి కారణమవుతోంది. పార్టీ నాయత్వంలో మార్పులు చేయాలంటూ 23 మంది సీనియర్లు అధినేత్రి సోనియాకు లెటర్ రాశారు. దీనిపై గాంధీ కుటంబ నాయకత్వాన్ని ప్రశ్నిస్తారా అంటూ కొందరు నేతలు.. బీజేపీతో ఫైట్ చేయాలంటే కొత్త లీడర్‌‌షిప్ అవసరమని మరికొందరు కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా వివాదంపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ కామెంట్ చేశారు. ఇలాంటి పార్టీని ఎవరూ కాపాడలేరన్నారు.

‘సింధియా గళమెత్తినప్పుడు బీజేపీతో అంటకాగుతున్నారని ఆయనను విమర్శించారు. ఇప్పుడు గులాం నబీ ఆజాద్, కపిల్ సిబాల్ లాంటి నేతలు కాంగ్రెస్‌కు ఫుల్‌టైమ్‌ చీఫ్‌ కావాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో వారిద్దరినీ బీజేపీకి అనుకూలంగా పని చేస్తున్నారని దుయ్యబడుతున్నారు. ఇలాంటి పార్టీని ఎవరూ కాపాడలేరు’ అని శివరాజ్ చౌహాన్ ట్వీట్ చేశారు.

కాంగ్రెస్‌లో నాయకత్వ సంక్షోభంపై మరో బీజేపీ నేత ఉమా భారతి కూడా స్పందించారు. ‘గాంధీ–నెహ్రూ కుటుంబ ఉనికి ప్రమాదంలో ఉంది. వారి రాజకీయ ఆధిపత్యం ముగిసింది. కాంగ్రెస్ పని అయిపోయింది. ఇప్పుడు ఎవరు ఏ పొజిషన్‌లో ఉంటారనేదే ముఖ్యం. కాంగ్రెస్‌ గాంధీగా మారాలి. ఎలాంటి విదేశీ మూలకం లేని నిజమైన స్వదేశీ గాంధీగా మారాలి’ అని ఉమా భారతి పేర్కొన్నారు.