మైన్ను ఢీకొనడంతో యూఏఈ షిప్ డ్యామేజ్
దుబాయ్: పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య హార్ముజ్ జలసంధిలో జరిగిన ఓ ఘటన కలకలం రేపింది. దుబాయ్ నుంచి వస్తువులతో వెళ్తున్న సింగపూర్ జెండా కలిగిన 'జీఎఫ్ఎస్ ప్రైడ్' అనే కార్గో నౌక సముద్రంలో మునిగిపోవడంతో, అందులోని వేలాది ఐఫోన్ బాక్సులు, లగ్జరీ పర్ఫ్యూమ్ బాటిళ్లు నీటిపై తేలియాడాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
స్థానిక ప్రజలు చిన్న పుట్టీలు, నావలపై వచ్చి సముద్రంలో కొట్టుకొస్తున్న ఆ విలువైన వస్తువులను ఏరుకుపోతున్నట్లు ఆ వీడియోల్లో కనిపిస్తోంది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. ఈ నౌకలో సుమారు 2,500 కంటైనర్లు ఉన్నాయి. ఇది అనధికారిక మార్గంలో వెళ్తుండగా నావల్ మైన్ తగలడం వల్లే మునిగిపోయిందని ఇరాన్ ఐఆర్జీసీ ప్రకటించింది. మరోవైపు ఇది ఓ గుర్తుతెలియని మిసైల్ లేదా రాకెట్ దెబ్బకు గురైందని మారిటైమ్ అధికారులు తెలిపారు. ప్రమాద తీవ్రతకు నౌకలో మంటలు చెలరేగి పూర్తిగా మునిగిపోయింది. నౌకలో ఉన్న 21 మంది సిబ్బంది ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు.
