విశ్వాసం..ధర్మంతో కూడిన దానం తపస్సుతో సమానం

విశ్వాసం..ధర్మంతో కూడిన దానం తపస్సుతో సమానం

మనం తపస్సు అనే మాటను తరచుగా వింటుంటాం. ఏదైనా ఒక పనిని ప్రారంభిస్తే... ఆ పనిని ‘తపస్సులా చేయాలి’ అని పెద్దవాళ్లు చెప్పడం తెలిసిందే. ఎటువంటి తపోదీక్షకైనా కొన్ని విషయాలు అనివార్యం. అవి ఋతం, సత్యం, శ్రుతం, శాంతం, దమం, దానం, యజ్ఞం.  దానకర్మ ముఖ్యమైన తపస్సు. దానం చేయటమంటే, మన చేతిలో ఉన్నది ఎవరు అడిగితే వారికి ఇవ్వడంగా భావిస్తారు. కానీ దానానికి కొన్ని గుణాలు ఉన్నాయి. అన్యాయంగా సంపాదించిన ధనం, అపరిమితమైన ధనవాంఛతో సంపాదించిన ధనం, లోభప్రవృత్తితో సంపాదించిన ధనం... ఈ మూడు రకాల ధనాన్ని దానం చేయాలనుకుంటే అది అనర్హమే. లోకకల్యాణం కోసం, ఇతరుల శ్రేయస్సు కోసం దానధర్మాలు చేయాలి. ఆ విధంగా చేసే దానం మహోన్నతమైన తపస్సుగా భావింపబడుతుంది. 


ఋతః తపం సత్యం తపః శ్రుతం తపః శాంతం తపో 
దమస్తవః శమస్తపో దానం తపో యజ్ఞం 
తపో భూర్భువస్సువః బ్రహ్మై తదుపాస్యై తత్తపః

అని మహానారాయణోపనిషత్తులోని పదవ అనువాకం చెప్తోంది.చరిత్రలో దానాలు చేసినవారు ఎంతోమంది ఉన్నారు. అందులో ముఖ్యంగా శిబి చక్రవర్తి తన శరీరంలోని మాంసాన్ని కోసి దానం చేశాడు. ఈ దానం పరుల శ్రేయస్సు కోసం ఆచరించాడు. అందువల్ల ఈ దానాన్ని తపస్సుగా పరిగణిస్తారు. అక్రమ సంపాదనను దానంగా స్వీకరించడం వల్ల స్వీకరించినవారిలో కూడా దుర్బుద్ధి కలుగుతుందని ఒక కథ చెప్తుంది.


ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. నిత్యం సంధ్యావందనం చేస్తూ, సదాలోచనలతో జీవించేవాడు. భోజనం చేసేటప్పుడు భగవంతుడిని స్మరించేవాడు. ఒకరోజు ఒక వర్తకుని అభ్యర్థన మేరకు వారి ఇంట ఎంతో సంతోషంగా కడుపునిండా, తృప్తిగా పంచభక్ష్య పరమాన్నాలు ఆరగించాడు. భోజనమంతా పూర్తయిన తరువాత ఎవరూ చూడకుండా ఒక వెండి గ్లాసును తస్కరించాడు. ఇల్లు చేరుకున్న కొంతసేపటికి ఆ బ్రాహ్మణుడికి తాను చేసిన పని గుర్తుకు వచ్చింది. ‘అయ్యో! ఇదేమిటి? ఆ ఇంటి నుంచి వెండి గ్లాసు తస్కరించాలనే ఆలోచన నాకు ఎందుకు వచ్చింది?’ అని ఆలోచించాడు. విషయం తెలుసుకున్నాడు. తనకు ఆతిథ్యం ఇచ్చిన వర్తకుడు అక్రమంగా సంపాదించిన ధనంతో వండించిన భోజనం చేయటం వల్లే తనకు ఆ ఆలోచన వచ్చిందని తెలుసుకున్నాడు. ఆ గ్లాసును వారికి అందచేసి, ఇంటికి వచ్చేశాడు. 

ధర్మరాజు చేసిన దానం

కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత ధర్మరాజు అశ్వమేధ యాగం చేశాడు. వచ్చినవారందరికీ భూరిదానాలు అందించాడు. దేవతల ప్రశంసలు అందుకున్నాడు. వచ్చినవారంతా ‘ఇటువంటి యాగం ఎక్కడా చూడలేదు, ఇటువంటి దానం ఎక్కడా స్వీకరించలేదు’ అని స్తుతించారు. అలా వచ్చినవారంతా ధర్మరాజును పొగడ్తలతో ముంచెత్తుతున్న సమయంలో ఒక ముంగిస యాగవాటిక దగ్గరకు చేరి నేల మీద పొర్లడం మొదలుపెట్టింది. ఆ ముంగిస రూపం చిత్రంగా ఉంది. శరీరంలో ఒక సగభాగం మామూలుగాను, మరో సగం బంగారు వర్ణంలోను ఉంది. అది ‘అబ్బే! సక్తుప్రస్థుడు చేసిన ధర్మంతో పోలిస్తే ఈ దానం ఏపాటిది. దానికే ఇంతగా పొగడాలా’ అంది. వారికి విషయం ఏమిటో అర్థం కాలేదు.  అప్పుడు ఆ ముంగిస ఇలా చెప్పడం ప్రారంభించింది ‘‘అది కరవు కాలం. ఒక రోజున సక్తుప్రస్థుని కుటుంబం ఆకలి తీర్చుకునేందుకు కేవలం కుంచెడు పేలపిండి మాత్రమే ఉంది. దానినే వారు నాలుగు భాగాలు చేసుకుని, సక్తుప్రస్థుడు, భార్య, కొడుకు, కోడలు తినడానికి సిద్ధపడ్డారు.

సరిగ్గా అదే సమయంలో ఒక అతిథి ఆకలితో గుమ్మం ముందు నిలిచాడు. ఆ అతిథి ఆకలి తీర్చడానికి వారు నలుగురు ఒకరి తరువాత ఒకరు వారి వారి భాగాలను దానం చేశారు.  ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను. సక్తుప్రస్థుడు తన అతిథి కాళ్లను కడిగిన నీరు, పేలపిండి వాసన నా శరీరానికి సోకడంతో, నా శరీరంలో సగభాగం బంగారంగా మారింది. మిగతా శరీరం కూడా బంగారం కాకపోతుందా అని నేను ఇలా దానాలు జరిగే చోటుకు వస్తున్నా. ఈ అశ్వమేధయాగంలోనైనా నా కోరిక నెరవేరుతుందని ఆశించా. ప్రయోజనం లేకపోయింది’’ అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయింది. తపస్సులా దానం చేసేవారికి, మిగిలినవారి దానానికి అంతటి అంతరం ఉంటుందని ఈ కథ చెప్తోంది.

- డా. వైజయంతి పురాణపండ 
ఫోన్​: 80085 51232