క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలుస్తం

క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలుస్తం

హైదరాబాద్​, వెలుగు: నేతల క్రమశిక్షణపై రాష్ట్ర కాంగ్రెస్ లో గొడవ జరుగుతోంది. కొందరు లీడర్లు పార్టీ లైన్ తప్పారంటూ పీసీసీ క్రమశిక్షణ కమిటీ చేసిన కామెంట్లు నేతల మధ్య విబేధాలను మళ్లీ తెరపైకి తెచ్చాయి. పార్టీలో క్రమశిక్షణపై శుక్రవారం సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నామని పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ​జి.చిన్నారెడ్డి అన్నారు. ఏమన్నా ఉంటే పార్టీలో చర్చించాలి తప్ప బయట మాట్లాడొద్దని సీనియర్ లీడర్ జగ్గారెడ్డిని ఉద్దేశించి అన్నారు. ‘‘విబేధాలుంటే హై కమాండ్ కు, ఇన్ చార్జికి లేఖలు రాయొచ్చు గానీ వాటిని మీడియాకు ఇవ్వకూడదు. ప్రెసిడెంట్ సోనియా గాంధీకి ఆయన రాసిన లేఖ ఎలా లీకవుతుంది? ఈ విషయంలో ఆయన క్రమశిక్షణ ఉల్లంఘించినట్టు భావిస్తున్నం. త్వరలో ఆయనను కమిటీ ముందుకు పిలుస్తం” అని చెప్పారు. అయితే జగ్గారెడ్డిపై చర్యలు తమ పరిధిలోకి రావన్నారు. అలాగే తమ నోటీసుకు జనగామ డీసీసీ ప్రెసిడెంట్​జంగా రాఘవ రెడ్డి ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదన్నారు. వీహెచ్​వాహనంపై మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్​సాగర్​రావు అనుచరుల దాడిపైనా చర్చించామన్నారు. 

రేవంత్​కు క్రమశిక్షణ వర్తించదా: జగ్గారెడ్డి
తనపై క్రమశిక్షణ కమిటీ చేసిన వ్యాఖ్యలపై జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. ‘‘హుజురాబాద్​ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లి అధిష్టానం అనుమతి లేకుండా, పార్టీలో చర్చించకుండా పెద్దపల్లి అభ్యర్థిని ప్రకటించడం క్రమశిక్షణ పరిధిలోకి రాదా? వరంగల్​ ఇన్ చార్జిగా ఉన్న నాకు చెప్పకుండా భూపాలపల్లిలో రచ్చబండ చేయడం క్రమశిక్షణ కిందకు రాదా?’’  అని ప్రశ్నించారు. తాను హైకమాండ్​కు రాసిన లేఖ మీడియాకు ఎలా రిలీజైందో తనకు తెలియదన్నారు.  కమిటీ ముందుకొచ్చేందుకు తాను సిద్ధని, అయితే అంతకన్నా ముందు పీసీసీ చీఫ్​నూ పిలవాలని జగ్గారెడ్డి అన్నారు.