జుడిషియల్ ఇన్‌ఫ్రాస్టక్చర్‌‌ కార్పొరేషన్ పెట్టాలె

జుడిషియల్ ఇన్‌ఫ్రాస్టక్చర్‌‌ కార్పొరేషన్ పెట్టాలె

కోర్టుల్లో మౌలిక సదుపాయాలు ఉంటేనే పేదలకు న్యాయ సేవలు అందుతాయన్నారు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ. హనుమకొండలో కోర్టు భవన సముదాయాలను ప్రారంభించారు. ‘‘తెలుగు బిడ్డవైయ్యుండి తెలుగు రాదని చెప్పుటకు సిగ్గులేదందుకురా.. అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదని సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా” అన్న కాళోజీ మాటల స్ఫూర్తితో తాను తెలుగులోనే మాట్లాడుతానంటూ సీజేఐ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఓ నిజాం పిశాచమా.. కానరాడు నిన్ను పోలిన రాజు మాకెన్నడేని, తీగలను తెంపి అగ్ని లోకి దింపావు.. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరధి గర్జన పరపీడన నుంచి విముక్తి కోసం సాగిన ఎన్నో ఉద్యమాలకు స్ఫూర్తిని ఇచ్చిందన్నారు.  

ఓరుగల్లుతో తనకు ఎంతో అనుబంధం ఉందని చెప్పారు. వరంగల్ ఒక చారిత్రాత్మక నగరం అని, ప్రగతి శీల ఉద్యమాలకు నెలవు అని, అనేక రాజకీయ పోరాటాలకు, కళలకు నెలవు అన్నారు. బమ్మెర పోతన, కాళోజీ నారాయణ రావు, దాశరధి లాంటి కవులు ఇక్కడ పుట్టారని, దేశాని ఒక ప్రధానిని అందించిన గడ్డ ఇది అని సీజే ఎన్వీ రమణ చెప్పారు. 

కోటలకు, భారీ చారిత్రక కట్టడాలకు నెలవైన ఓరుగల్లులో కాకతీయుల వారసత్వానికి దీటుగా ఈ రోజు పది కోర్టుల భవనాన్ని తీర్చిదిద్దారని జస్టిస్ రమణ అన్నారు. తన ఆలోచనలకు అనుగుణంగా అన్ని రకాల అధునాతన సదుపాయాలతో నిర్మించిన ఈ ఓరుగల్లు కోర్టు బిల్డింగ్‌ను మోడల్ కోర్టుగా చూపించాలనుకుంటున్నానన్నారు. కేంద్రం నిధులివ్వకున్నా కోర్టు భవనాల నిర్మాణం పూర్తి చేశారన్నారు. 1936లో ప్రారంభమైన ఈ కోర్టు ప్రాంగణం.. ఎందరో పోరాట యోధుల, స్వతంత్ర సమర యోధులు, దేశభక్తుల అడుగలతో పునీతమైన ప్రాంతమని అన్నారు. జస్టిస్ జగన్‌మోహన్‌ రెడ్డి, కేశవరావు, రఘవీర్, మోతీ నాయక్‌ లాంటి న్యాయమూర్తులు ఇక్కడి నుంచే వచ్చారని అన్నారు. తాను సీజేఐ అయిన తర్వాత దేశంలో శిథిలమైన కోర్టులను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకమైన శ్రద్ధపెట్టి సమాచారం సేకరించామని, వచ్చిన డేటా ఆధారంగా మౌలిక సదపాయాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామన్నారు. జుడిషియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌ ద్వారా ఈ పనులు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని, శీతాకాల సమావేశాల్లో దీనిపై పార్లమెంటులో బిల్లు పెడతారని ఆశిస్తున్నానని చెప్పారు.

90 ఏళ్ల కిందట నిజాంకాలంలో నిర్మించిన భవనాల్లోనే ఇప్పటివరకు కోర్టులు నడుస్తున్నాయి. అవసరాలు పెరగడంతో  21 కోట్ల 65 లక్షలతో  విశాలమైన భవన సముదాయాన్ని నిర్మించారు. కోటి రూపాయలతో పార్కింగ్, అంతర్గత సీసీ రోడ్లు, లాన్ ను ఏర్పాటు చేశారు.  మరో 65లక్షలతో కోర్టు ప్రాంగణంలోనే శిశు సంక్షేమ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పోక్సో కేసులో బాధితులైన మైనర్లు CJI ను కలవడానికి ప్రత్యేక రూట్ ఏర్పాటు చేశారు.  కార్యక్రమంలో హైకోర్టు సీజే సతీష్ చంద్ర శర్మ , ఇతర న్యాయమూర్తులు, లాయర్లు , వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

కాగా, అంతకు ముందు  భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు  సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ NV రమణ. ఆలయ ప్రధాన అర్చకులు జస్టిస్ NV రమణకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి.. మొక్కులు చెల్లించుకున్నారు రమణ. తర్వాత అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేయగా...  అర్చకులు ఆశీర్వచనం చేశారు.