విద్యార్థులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఛత్తీస్ గడ్ సీఎం

విద్యార్థులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఛత్తీస్ గడ్ సీఎం

విద్యార్థులకు ఇచ్చిన హామీని ఛత్తీస్ గడ్ ప్రభుత్వం నిలబెట్టుకుంది. 10, 12వ తరగతి టాపర్లకు హెలికాప్టర్ రైడింగ్ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చిన ఆ రాష్ట్ర సీఎం భూపేష్ బఘేల్.. దాన్ని నెరవేర్చారు. దీంతో తొలిసారి ఆకాశంలో ప్రయాణించే అవకాశం వచ్చిందని, చాలా సంతోషంగా అనిపిస్తోందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

10,12వ తరగతి పరీక్షల్లో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరచిన మొదటి 10మంది విద్యార్థులను హెలికాప్టర్ లో తిప్పుతామని ఛత్తీస్ గడ్ సీఎం భూపేష్ బఘేల్ గత మే నెలలో హామీ ఇచ్చారు. విద్యార్థుల్ని మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ప్రకటన చేశామని ఆయన వెల్లడించారు. ఆకాశంలో ప్రయాణం చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారన్న ఆయన.. వారిని మరింత ఉన్నత స్థాయిలో నిలిపేందుకు ఈ రైడ్ ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఈ రైడ్ పై స్పందించిన సీఎం.. చూడండి పిల్లలు ఎంత ఆనందంగా ఉన్నారో.. ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థుల కోసం తాము ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నామని తెలియజేస్తూ వారి ఫొటోలను జత చేస్తూ ట్వీట్ చేశారు.