తెలంగాణ కశ్మీర్ మన అదిలాబాద్… పర్యాటక అభివృద్ది మాత్రం గుండు సున్నా..!

తెలంగాణ కశ్మీర్ మన అదిలాబాద్… పర్యాటక అభివృద్ది మాత్రం గుండు సున్నా..!

ఒకవైపు పచ్చని అందాలు… జాలువారే జలపాతాలు… ఆధ్యాత్మికతను చాటే ఆలయాలు…ఆకట్టుకునే కోటలు.. వన్యప్రాణులతో ప్రకృతి అందాలకు పుట్టినిల్లుగా పిలవబడుతోంది ఉమ్మడి ఆదిలాబాద్‍ జిల్లా. ఇక్కడి అందాలని చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కానీ  పర్యాటక రంగంలో అభివృద్ది మాత్రం కాగితాలకే పరిమితమైంది.

తెలంగాణ కశ్మీర్ గా పిలవబడే ఆదిలాబాద్ జిల్లా ప్రకృతి అందాలకి పెట్టింది పేరు. నేరడిగొండ మండలం కుంటాల, బోథ్‍ పొచ్చెర, కనకాయి, ఇచ్చోడ గాయత్రీ వాటర్‍పాల్స్ పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. సీజనల్‍గా వచ్చే ఈ జలధారలను చూసేందుకు ఉమ్మడి జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు.

జైనథ్‍లోని లక్ష్మీనారాయణస్వామి ఆలయం, నిర్మల్‍ జిల్లా బస్తర్‍గడ్‍, శ్యాంగడ్‍ కోటలు, ధర్మాసాగర్‍ చెరువు, కదిలి పాపాహరేశ్వరాలయాలు తమ అందాలతో పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.  మరోవైపు బాసరలోని అమ్మవారి దర్శనానికి నిత్యం వందల మంది భక్తులు వస్తుంటారు. ఈ మధ్యే బాసర ఆలయాభివృద్దికి 50కోట్ల నిధులు కేటాయిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించినా.. ఇప్పటివరకు అందలేదు. దీంతో సౌకర్యాలు లేక అరకొర వసతులతో అవస్థలు పడుతున్నారు భక్తులు.

బాసర ఆలయంతో పాటు ఈజ్ గాం మల్లన్న, జంగుబాయి గుహలు.. దేవరకోట, కాల్వ నర్సింహస్వామి, అడెళ్లి పోచమ్మ ఆలయాలు ఉమ్మడి జిల్లాలో ఫేమస్ గా ఉన్నాయి. ఈ ఆలయాలకు భక్తుల రద్దీ పెరుగుతోంది. అయినా సౌకర్యాలపై సర్కార్ దృష్టి పెట్టడం లేదంటున్నారు అక్కడి జనం.వీటితో పాటు ఆసిఫాబాద్‍ జిల్లాలో సప్తగుండాల, మిట్టా జలపాతంతో పాటు గిరిజన పోరాట యోధుడు కుమ్రంభీం స్మారక స్మృతివనం, అడ ప్రాజెక్ట్, అర్జున్‍లోద్ది గుహలు మంచి పర్యాటక ప్రాంతాలు.  ఇలాంటి పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నా..  తగిన అభివృద్ధి జరగలేదు.

కుంటాల వాటర్‍ఫాల్‍ను రోజుకి 5నుంచి 6 వేల మంది పర్యాటకులు సందర్శిస్తుండగా.. ఆదివారం, సెలవు దినాల్లో ఈ సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఈ జలపాతం దగ్గర సంరక్షణ చర్యలు చేపట్టకపోవడంతో ఏటా కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంద్రవెల్లి మండలంలోని నాగోబా జాతరకు ఏటా పెద్దఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. ఇలా ఉమ్మడి జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను రోజూ 4నుంచి 6 లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తారని అధికారులు చెబుతున్నారు.

మరోవైపు నిర్మల్ కొయ్య బొమ్మలు ప్రపంచ గుర్తింపు పొందాయి. ఈ కళాకారులకు ప్రభుత్వం చేయుతనివ్వడం లేదన్న విమర్శలు ఉన్నాయి. వీటికి మెరుగైన మార్కెటింగ్ సౌక్ర్యం, పబ్లిసిటీ కల్పించడం లేదంటున్నారు.

ఉమ్మడి జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్దికి మూడేళ్ల కింద అధికారులు 72కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అభివృద్ధి పనులకు సంబంధించి కార్యచరణ సిద్దం చేశారు. ఈ  ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. అయితే బోథ్‍ ఎక్స్ రోడ్‍ దగ్గరి హరిత హోటల్‍ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేస్తున్న అధికారులు.. నిధులు విడుదలైన వెంటనే వాటిల్లో పర్యాటకులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని చెబుతున్నారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టి… ఆదిలాబాద్ కు మరింత పేరు  తీసుకురావాలంటున్నారు  జిల్లా వాసులు.