ఏపీలో ఆరోగ్యశ్రీ ఆసరా

ఏపీలో ఆరోగ్యశ్రీ ఆసరా

అమరావతి, వెలుగు: ఏపీలో ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్ చేయించుకున్న రోగులు కోలుకునేవరకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. సోమవారం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ‘ఆరోగ్యశ్రీ ఆసరా’ స్కీమ్ ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత రోగులు విశ్రాంతి తీసుకోవాల్సి ఉన్నా పొట్ట కూటి కోసం పనులకు వెళ్లే పరిస్థితులు ఉన్నాయన్నారు. కూలికెళ్లినా మందులేసుకుని ఓ అరగంట పడుకుని మళ్లీ లేచి పనిచేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు అలాంటి పరిస్థితులు రాకుండా ఆపరేషన్ తరువాత ఎన్ని నెలలైనా ఉచిత మందులతో పాటు రోజుకు రూ.225 చొప్పున నెలకు రూ.5 వేల సాయం అందిస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామన్నారు. ప్రభుత్వంపై అదనపు భారం పడుతున్నా  రూ.5 లక్షల వార్షికాదాయం ఉన్న వారిని ఆరోగ్య శ్రీ పరిధిలోకి తెచ్చినట్లు చెప్పారు. తాజా నిబంధనలతో జనవరి 1 నుంచి కొత్త కార్డులు జారీ చేస్తామన్నారు. వ్యక్తులకు సంబంధించిన ఆరోగ్య సమాచారం క్యూఆర్ కోడ్ రూపంలో నమోదు చేస్తామని వివరించారు. 1,200 రోగాలకు విస్తరించిన ఆరోగ్య శ్రీ పథకాన్ని జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభిస్తామని చెప్పారు. ఆసుపత్రి బిల్లు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ  కింద డబ్బులిస్తామన్నారు. వచ్చే ఏడాది చివరి నాటికి 2 వేల వ్యాధులను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొస్తామన్నారు. నాడు – నేడు పథకం ద్వారా వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మారుస్తామని హామీ ఇచ్చారు. జనవరి 1వ తేదీ నుంచి తలసేమియా, సికిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెల్, హీమోఫీలియా వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేలు, బోదకాలు, కిడ్నీ వ్యాధులతో మంచానికే పరిమితమైన రోగులకు నెలకు రూ.5 వేలు, కుష్టు వ్యాధిగ్రస్తులను రూ.3 వేలు ఫించన్ ఇస్తామని ప్రకటించారు. ఆరోగ్య శ్రీ పథకం కింద క్యాన్స్ రోగులకు మెరుగైన చికిత్స అందిస్తామని తెలిపారు. జనవరి నుంచి క్యాన్సర్ రోగికి రేడియేషన్ ప్రాసెస్ లో ఎన్ని సైకిల్స్ అవసరమైనా ప్రభుత్వమే చేయిస్తుందన్నారు