గల్ఫ్ కార్మికులకు ఈ-కెవైసీ అప్ డేట్.. కేంద్రం నిర్ణయంపై ఆందోళన

గల్ఫ్ కార్మికులకు ఈ-కెవైసీ అప్ డేట్.. కేంద్రం నిర్ణయంపై ఆందోళన

గల్ఫ్‌ దేశాల్లో పనిచేసే వలస కార్మికులకు పెద్ద కష్టమే వచ్చింది. వారంతా ఇప్పుడు పరేషాన్‌లో పడ్డారు. రేషన్‌కార్డుల్లో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ–కేవైసీ పూర్తి చేయించుకోవాలని కేంద్రం సూచించిన విషయం తెలిసిందే. రేషన్‌ దుకాణాల్లో బయోమెట్రిక్‌ యంత్రంపై రేషన్‌ వినియోగదారులు వేలిముద్ర వేసి తమ ధృవీకరణ పూర్తి చేయాలి. రాష్ట్రంలోని వినియోగదారులు ఏ ప్రాంతంలో ఉన్నా సరే సొంతూరుకు వెళ్లకుండానే ఈకేవైసీ పూర్తి చేసే వెసులుబాటు కల్పించారు. పొరుగు రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్నవారు మాత్రం స్వరాష్ట్రానికి వచ్చి ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇదే ఇప్పుడు గల్ఫ్​ దేశాల్లో ఉన్న తెలంగాణ వలస కార్మికులకు పెద్ద చిక్క వచ్చి పడింది.

ఈ–కేవైసీ ప్రక్రియ ఇటీవలే ప్రారంభమైంది. అయితే దీనికి నిర్ణీత గడువు తేదీని మాత్రం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించలేదు. కాకపోతే ఈ ఏడాది డిసెంబర్ వరకు పూర్తి చేయాలని చెబుతోంది. వీలైనంత త్వరగా రేషన్‌కార్డుల్లో పేర్లు ఉన్నవారితో ఈకేవైసీ పూర్తి చేయించాలని అధికారులు రేషన్‌డీలర్లపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఒక కుటుంబంలోని సభ్యులు వేర్వేరు చోట్ల ఈకేవైసీ పూర్తి చేయించుకోవడానికి అవకాశముంది. ఈ విధానంతో పట్టణాలకు ఉన్నత చదువులకు వెళ్లినవారు, ఉపాధి పొందుతున్న వారు తాము ఉంటున్న ప్రాంతాల్లోనే ఈకేవైసీ పూర్తి చేయించుకుంటున్నారు. కానీ, గల్ఫ్‌తోపాటు ఇతర దేశాలకు వలస వెళ్లిన వారు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. వారి ఈకేవైసీ ఎలా అనే ఆందోళన వారి కుటుంబాల్లో నెలకొంది. 

కేవైసీ చేయించుకోని వారి పేర్లు రేషన్‌కార్డుల నుంచి తొలగిస్తారనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఉపాధి వెతుక్కుంటూ ఇతర దేశాలకు వెళ్లిన వారిలో కేంద్రం ఈ-కెవైసీ అప్ డేట్ ఆందోళన కల్గిస్తోంది. విదేశాలకు వెళ్లినవారు సంవత్సరాల తరబడి స్వదేశానికి దూరంగానే ఉంటున్నారు. వారు వచ్చిన తర్వాతైనా ఈకేవైసీ చేయించుకోవచ్చా..? అనే విషయంపై స్పష్టత లేకపోవడమే ఈ గందరగోళానికి కారణం. స్థానికంగా నివాసం ఉండనందుకు రేషన్‌బియ్యం కోటా తమకు దక్కకపోయినా ఇబ్బంది లేదని, రేషన్‌కార్డుల నుంచి పేర్లు తొలగించవద్దని అని వలస కార్మికులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. ప్రభుత్వాలు కొత్తగా ఏ సంక్షేమపథకం అమలు చేసినా రేషన్‌కార్డు ఆధారంగా తీసుకుంటుంది.

ఇలాంటి తరుణంలో తాము ఉపాధి కోసం సొంతూరిని విడచి వేరే ప్రాంతానికి వెళ్లామని, రేషన్‌కార్డుల నుంచి పేర్లు తొలగిస్తే ఎలా అని వలస కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ నుండి చాలా మంది ఉపాధి కోసం విదేశాలకు వెళ్లారు. గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి పొందుతున్న తెలంగాణ వాసుల సంఖ్య 15 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. కేంద్రం ప్రవేశపెట్టిన ఈకేవైసీ నిబంధనతో వలస కార్మికులు వేల సంఖ్యలో నష్టపోయే ప్రమాదం ఉంది. 

ఈకేవైసీ ప్రయోజనం కోసం భారతదేశానికి రావడం వారికి పెద్ద భారంగా మారుతుంది. ఈ విషయమై పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కూడా గల్ఫ్ వలస కూలీల ప్రయోజనాలను కాపాడేందుకు రేషన్ కార్డుల ఈ-కేవైసీ ప్రక్రియ నిబంధనలను సడలించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాశారు. అయినా కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి స్పందన లేదు.

ఈకేవైసీ పూర్తి చేయని వలస కార్మికుల పేర్లు రేషన్‌కార్డుల నుంచి తొలగించకుండా స్టార్‌మార్క్‌ చేయాలని ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షుడు మంద భీంరెడ్డి చెబుతున్నారు. వారు సొంతూరికి వచ్చిన తర్వాత ఈకేవైసీ అవకాశం కల్పించాలని కోరుతున్నారు. వలస కార్మికుల పేర్లు రేషన్‌కార్డుల నుంచి తొలగిస్తే వారు ఏ ప్రభుత్వ పథకానికి అర్హులు కాకుండా పోతారని, ప్రభుత్వం పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని కోరుతున్నారు.