ఏడేళ్లుగా కాంట్రాక్ట్ లెక్చరర్లకు ట్రాన్స్​ఫర్లు లేవు

ఏడేళ్లుగా  కాంట్రాక్ట్ లెక్చరర్లకు ట్రాన్స్​ఫర్లు లేవు
  • చాలామంది 12 ఏండ్ల నుంచి ఒకేచోట కొలువులు
  • ఫ్యామిలీలకు దూరంగా వందల కిలోమీటర్ల దూరంలో విధులు
  • బదిలీల కోసం వేడుకుంటున్నా కరుణించని సర్కార్

హైదరాబాద్​, వెలుగు: రాష్ర్టంలో బదిలీలు లేక కాంట్రాక్టు లెక్చరర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పేరెంట్స్​ను, కుటుంబాలను వదిలి, వందల కిలోమీటర్ల దూరంలో డ్యూటీలు చేస్తున్నారు. 10–12 ఏండ్లుగా ఒకేచోట డ్యూటీ చేస్తున్నా ప్రభుత్వం బదిలీలు చేయట్లేదు. రాష్ట్రం వచ్చాక ఏడేండ్ల లో ఒక్కసారి కూడా బదిలీలపై దృష్టి పెట్టలేదు. బదిలీలు చేయకపోవడంతో చాలా మంది లెక్చరర్లు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఎక్కడో దూరంగా డ్యూటీ చేస్తున్నారన్న కారణంతో పెండ్లి సంబంధాలు క్యాన్సిల్​ అవుతున్న పరిస్థితులూ ఉన్నాయి.

ఒక జిల్లా నుంచి మరొక జిల్లాలో

రాష్ర్టంలో 404 సర్కారు జూనియర్​ కాలేజీలున్నాయి. వీటన్నింటిలోనూ కాంట్రాక్టు లెక్చరర్లు ఉన్నారు. పర్మనెంట్​ లెక్చరర్లు లేని కాలేజీలు చాలానే ఉన్నాయి.. కానీ, కాంట్రాక్ట్​ లెక్చరర్లు లేని కాలేజీలు మాత్రం లేవు. ఉమ్మడి రాష్ర్టంలో 2000వ సంవత్సరం నుంచే కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్ల వ్యవస్థ మొదలైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,800 మంది దాకా కాంట్రాక్ట్​ లెక్చరర్లున్నారు. అయితే 2000–2007 వరకు కాలేజీ ప్రిన్సిపాల్స్​ ద్వారా కొందరిని నియమించారు. ఆ తర్వాత జోనల్​ స్థాయిలో నియామకాలు జరిగాయి. ప్రిన్సిపాల్స్​ నియమించిన వాళ్లలో చాలా వరకు స్థానికులే ఉండగా.. జోనల్​లో రిక్రూట్​ అయినవాళ్లు పాత జోన్ల ప్రకారం ఒక జిల్లా నుంచి వచ్చి ఇంకో జిల్లాలో పని చేస్తున్నారు. బదిలీలు చేస్తారన్న ధీమాతో డ్యూటీలో చేరిన వాళ్లంతా ఇప్పుడు అవస్థలు పడుతున్నారు.

ఎన్నేండ్ల నుంచో ఒక్కటే కాలేజ్​

సర్కారీ శాఖల్లో కనీసం మూడేండ్లు పనిచేసిన వారికి ట్రాన్స్​ఫర్స్​కు అవకాశముంటుంది. కానీ, ఇంటర్​ బోర్డులో మాత్రం అదేదీ పట్టించుకోవట్లేదు. ఏకంగా 12,13 ఏండ్ల నుంచి ఒకేచోట పనిచేస్తున్నా, వారిని మాత్రం ట్రాన్స్​ఫర్​ చేయట్లేదు. ఉమ్మడి రాష్ర్టంలో అధికారికంగా 2011, 2013లో బదిలీలు చేశారు. ఆ తర్వాత ఆ ఊసేలేదు. రాష్ట్రం వచ్చాక అప్పుడప్పుడు పైరవీలతో ట్రాన్స్​ఫర్లు జరిగాయని లెక్చరర్లు చెబుతున్నారు. అయితే ఇప్పటికే కాంట్రాక్ట్ ఉద్యోగులున్న డిగ్రీ కాలేజీల్లో, ఎస్సీ, ఎస్టీ, వైద్యశాఖలతో పాటు కేజీబీవీల్లోనూ బదిలీలు నిర్వహించారు. వీరిలాగే తమకూ బదిలీలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నా పట్టించుకోవడం లేదని కాంట్రాక్టు లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కుటుంబాలకు దూరంగా డ్యూటీలు

ఎప్పటికైనా పర్మనెంట్​ అవుతుందన్న ధీమాతో అప్పట్లో తక్కువ జీతానికే చాలా మంది కాంట్రాక్టు లెక్చరర్లు జాయిన్​ అయ్యారు. ఇపుడు నెలనెలా జీతాలు రాకపోతుండడంతో పనిచేసే చోట ఇంటి అద్దెలు కట్టలేక, సరుకులు కొనలేక, ఆరోగ్యం బాగాలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వందల కిలోమీటర్ల దూరంలో ఉంటున్న పేరెంట్స్​కు, ఇంటోళ్లకు హెల్త్​ బాగాలేకపోయినా వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నారు. కుటుంబాలతో కలిసి ఉంటున్న లెక్చరర్లకు ఏండ్ల నుంచి ఒకే చోట పనిచేస్తుండటంతో, వారి పిల్లల జోన్లు, స్థానికత మారుతుందన్న ఆందోళనా వ్యక్తమవుతోంది. సీఎం కేసీఆర్​తో పాటు ఉన్నతాధికారులు స్పందించి, కాంట్రాక్టు లెక్చరర్లకు సొంత జిల్లాలకు బదిలీ చేయాలని వారంతా కోరుతున్నారు.

సంబంధాలు వస్తున్నా వద్దంటున్న

మాది నిజామాబాద్​ సిటీ, యాదాద్రి జిల్లాలోని మోత్కూర్​ జూనియర్​ కాలేజీలో లెక్చరర్​గా చేస్తున్న. మా పేరెంట్స్​కు నేను ఒక్కదాన్నే. పెండ్లి సంబంధాలు వస్తున్నాయి. కానీ, నాతో పాటు అంతదూరం రావడానికి వారు ఇష్టపడక, ఉద్యోగం మానెయ్యాలని చెప్తున్నారు. అలాంటి సంబంధాలు క్యాన్సిల్​ చేస్తున్న.  నాన్న పోయినేడాది చనిపోయారు. ఇంట్లో అమ్మ ఒక్కతే ఉంటుంది. కాబట్టి వెంటనే  సొంత జిల్లాకు బదిలీ చేసి, మాకు న్యాయం చేయాలె.- గంగలక్ష్మి, మోత్కూర్​ జూనియర్​ కాలేజీ

12 ఏండ్లుగా ఒకే కాలేజీలో

నేను కర్నాటక బార్డర్​లోని సంగారెడ్డి జిల్లా కంగ్టి జూనియర్​ కాలేజీలో పనిచేస్తున్న. మాది కోదాడ. 2008లో జాబ్ లో చేరా.అప్పట్నుంచి ఇక్కడే పని చేస్తున్నా. ఇంటి దగ్గర  పేరెంట్స్​కు అనారోగ్య  సమస్యలు మొదలయ్యాయి. సొంతూర్లకు బదిలీ చేయాలని ఎన్నిసార్లు చెప్పినా.. సర్కారు పట్టించుకోవట్లేదు. మా ఊరు దగ్గరలోని నడిగూడెం కాలేజీలో సుమారు ఐదేండ్లుగా జంతుశాస్ర్తం లెక్చరర్ పోస్టు ఖాళీగానే ఉంది. ఇప్పటికైనా సొంతజిల్లాలకు ప్రభుత్వం ట్రాన్స్​ఫర్స్​ చేయాలె.- సైదాచారి, కంగ్టి జూనియర్​ కాలేజీ

ఫ్యామిలీకి దూరంగా ఉంటున్న

మా సొంతూరు కొత్తగూడెం. సిద్దిపేట జిల్లా బెజ్జంకి జూనియర్​ కాలేజీలో పనిచేస్తున్న. 2006లో టేకులపల్లిలో లెక్చరర్​గా  జాయిన్ అయ్యాను. 2011లో బెజ్జంకికి మార్చారు.  అప్పటి నుంచి ఇక్కడే వర్క్​ చేస్తున్న. ఫ్యామిలీకి దూరంగా ఉంటూ, కొలువు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.  గతంలో వారం, పదిహేను రోజులకు సొంతూరు వెళ్లేదాన్ని. కానీ కరోనా ఎఫెక్ట్​తో ప్రస్తుతం బస్సులూ నడవడం లేదు. ప్రభుత్వం మా సమస్యలపై స్పందించి వెంటనే బదిలీలు చేపట్టాలి. – విజయలక్ష్మి, బెజ్జంకి జూనియర్​ కాలేజీ