సహకార ఎన్నికల్లోనూ బేరాలు.. బెదిరింపులు

సహకార ఎన్నికల్లోనూ బేరాలు.. బెదిరింపులు

బేరాలు.. బెదిరింపులు
పీఏసీఎస్​లు ఏకగ్రీవం చేసేందుకు
టీఆర్ఎస్ నేతల ప్రయత్నాలు

వెలుగు, నెట్వర్క్ఆదిలాబాద్ జిల్లాలో డీసీసీబీ చైర్ పర్సన్ పదవి ఆశిస్తున్న అడ్డి భోజారెడ్డి… తాంసి కో ఆపరేటివ్ సొసైటీలో డైరెక్టర్ స్థానాలకు నామినేషన్లు వేసిన ఆరుగురిని క్యాంపులకు తరలించారు. మరో ఏడు స్థానాలను ఏకగ్రీవం చేసేందుకు ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యుల ఆధ్వర్యంలో బేరసారాలు నడుపుతున్నారు.

పార్టీలకు అతీతంగా జరిగే సొసైటీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్​రెడ్డి రాజకీయాలు చేస్తున్నారని, తమను పోటీ నుంచి తప్పించేందుకు అనుచరులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆర్మూర్​లో మున్నూరు కాపు సంఘం పెద్దలు ఆరోపించారు. ఈ రెండు చోట్ల మాత్రమే కాదు. అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పదవులపై కన్నేసిన అధికార పార్టీ లీడర్లు ప్రలోభాలకు తెరతీశారు. మాట వింటే ఆఫర్లు, వినకుంటే బెదిరింపులతో విపక్ష నేతలు, ఇండిపెండెంట్లను బరిలో నుంచి తప్పిస్తున్నారు. పలు జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

905 పీఏసీఎస్​లకు ఎన్నికలు

రాష్ట్రంలో 909 పీఏసీఎస్ (ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీ)​లు ఉండగా, 905 సొసైటీలకు ఈనెల 15న ఎన్నికలు జరగనున్నాయి. ప్రతి పీఏసీఎస్ నుంచి 13 మంది డైరెక్టర్లను ఎన్నుకుంటారు. వీళ్లు ఒకరిని చైర్​పర్సన్​గా, ఇంకొకరిని వైస్​చైర్​పర్సన్​గా ఎన్నుకుంటారు. ఇలా ఎన్నికైన సొసైటీల చైర్మన్లు తమలో నుంచి 16 మందిని డీసీసీబీ(డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్​బ్యాంక్)కి డైరెక్టర్లుగా, ఏడుగురిని డీసీఎంఎస్ (డిస్ట్రిక్ట్​ కోఆపరేటివ్ మార్కెంటింగ్ సొసైటీ) డైరెక్టర్లుగా ఎన్నుకుంటారు. వ్యవసాయేతర సంఘాల నుంచి ఐదుగురు డైరెక్టర్లు డీసీసీబీ ప్యానల్​లో, ముగ్గురు డీసీఎంఎస్ ప్యానల్​లో డైరెక్టర్లుగా ఉంటారు. డీసీసీబీ ప్యానల్​లోని 21 మంది తమలో ఒకరిని డీసీసీబీ చైర్మన్​గా, డీసీఎంస్ ప్యానల్​లోని 10 మంది   ఒకరిని చైర్మన్​గా ఎన్నుకుంటారు. వైస్​చైర్మన్ల ఎన్నిక  ఇలాగే జరుగుతుంది.

డీసీసీబీ చైర్మన్ పదవుల కోసం పోటీ

డీసీసీబీ చైర్మన్లుగా పని చేసిన ఎంతో మంది తర్వాత ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఎదిగారు. మంచి హోదా, నెలకు రూ.20 వేల గౌరవ వేతనం, కారు సౌకర్యం ఉండడం, తమ అనుకున్న వారికి లోన్లు ఇప్పించుకోగల పవర్ ఉండడం, గతంలో కొన్ని జిల్లాల డీసీసీబీ చైర్మన్లు కోట్లకు పడగెత్తడంతో ఈ పదవులకు రాజకీయంగా మంచి డిమాండ్​ ఏర్పడింది. దీంతో అధికార పార్టీలో డీసీసీబీ చైర్మన్ పదవి కోసం పోటీ పెరిగింది. 9న నామినేషన్ల స్క్రూటినీ పూర్తి కావడంతో టీఆర్ఎస్ నేతలు రంగంలోకి దిగారు. తమవారిని ఏకగ్రీవం చేసుకునేందుకు ఇండిపెండెంట్లను, విపక్ష, సొంత పార్టీ నేతలను నయానో, భయానో పోటీ నుంచి తప్పిస్తున్నారు.

పాలిటిక్స్ చేస్తే ఊరుకోం

ఎమ్మెల్యే జీవన్​రెడ్డికి మున్నూరు కాపు సంఘం నాయకుల హెచ్చరిక ఆర్మూర్, వెలుగు: పార్టీలకు అతీతంగా జరిగే సొసైటీ ఎన్నికల్లో రాజకీయం చేస్తే, బెదిరింపులకు పాల్పడితే ఊరుకోబోమని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని మున్నూరు కాపు సంఘం పెద్దలు హెచ్చరించారు. ఆదివారం ఆర్మూర్​లో సంఘం నాయకులు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే అనుచరులు తమను పోటీ నుంచి తప్పుకోవాలని బెదిరిస్తున్నారని ఆరోపించారు.

మరిన్ని వార్తల కోసం