12 రోజుల బిడ్డ‌కు క‌రోనా: 2 వారాలు వైర‌స్ తో పోరాడి..

12 రోజుల బిడ్డ‌కు క‌రోనా: 2 వారాలు వైర‌స్ తో పోరాడి..

దేశ వ్యాప్తంగా రోజు రోజుకీ క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఈ వైర‌స్ అంటుకుంటోంది. ఇప్ప‌టికే దాదాపు 37 వేల మందికి పైగా ఈ వైర‌స్ సోకింది. అందులో 1200 మంది ప్రాణాలు కోల్పోయారు. ప‌ది వేల మంది పూర్తిగా కోలుకుని బ‌య‌ట‌ప‌డ్డారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో పుట్టిన త‌ర్వాత‌ 12 రోజుల వ‌య‌సుకే క‌రోనా ఆస్ప‌త్రిపాలైన ప‌సికందు.. ఈ క‌రోనా మ‌హమ్మారిపై పోరాడి పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరింది. ఆ రాష్ట్ర రాజ‌ధాని భోపాల్ లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న క‌రోనా వ‌స్తే ఏమైపోతామో అని బెంబేలెత్తిపోతున్న‌ వారిలో ధైర్యం నింపుతోంది. వైర‌స్ సోకిందేమోన‌న్న అనుమానంతో అక్క‌డ‌క్క‌డా ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్న ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఆ చిన్నారి ఓ ఆశాదీపంలా నిలిచింది.

డెలివ‌రీ స‌మ‌యంలో న‌ర్సు నుంచి క‌రోనా…

భోపాల్ లోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి సుల్తానియా జ‌న‌న హాస్పిట‌ల్ లో ఏప్రిల్ 7న ఓ జంట‌కు పండంటి ఆడ శిశువు జ‌న్మించింది. ఆ చిన్నారికి ప్ర‌కృతి అని పేరు పెట్టారు త‌ల్లిదండ్రులు. 11వ తేదీన హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరారు. అయితే ఆ త‌ల్లికి పురుడు పోసిన టైమ్ లో ఉన్న న‌ర్సుకు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఈ వార్త తెలియ‌డంతో త‌ల్లిదండ్రులు చిన్నారి స‌హా ఆస్ప‌త్రికి వెళ్లారు. అక్క‌డ టెస్టు చేయ‌గా.. ఏప్రిల్ 19న పాప‌కు క‌రోనా వైర‌స్ సోకిన‌ట్లు నిర్ధార‌ణ అయింది. త‌ల్లిదండ్రుల‌కు మాత్రం నెగ‌టివ్ వ‌చ్చింది.

పాప‌తో పాటు త‌ల్లి కూడా ఆస్ప‌త్రిలోనే…

త‌ల్లికి క‌రోనా లేన‌ప్ప‌టికీ ఆ ప‌సికందుతో పాటు ఆమెను కూడా ఐసోలేష‌న్ కు త‌ర‌లించారు వైద్యులు. చిన్నారికి చికిత్స అందిస్తూ వ‌చ్చారు. పాప‌కు ప‌క్కా ప్రొటేక్ష‌న్ తో అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ త‌ల్లికి వైర‌స్ సోక‌కుండా పాప‌కు ఆమె చ‌నుబాలు ప‌ట్టేలా చూశారు. రెండు వారాల‌పాటు పోరాడిన ఆ చిన్నారి వైర‌స్ పై గెలిచింది. పూర్తిగా కోలుకున్న ఆ చిన్నారిని శుక్ర‌వారం రాత్రి హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జ్ చేసిన‌ట్లు వైద్య శాఖ అధికారులు తెలిపారు.