ఇండియా పెట్టుబడులకు ఆకర్షణీయం: శక్తికాంత్ దాస్

ఇండియా పెట్టుబడులకు ఆకర్షణీయం: శక్తికాంత్ దాస్

కంపెనీలకు కార్పొరేట్ టాక్స్‌‌ను తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో ఇండియా విదేశీ పెట్టుబడులకు మరింత ఆకర్షణీయంగా మారిందని ఆర్‌‌‌‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అన్నారు. 28 ఏళ్లలో తొలిసారి కార్పొరేట్ టాక్స్‌‌ను ప్రభుత్వం దాదాపు 10 శాతం మేర తగ్గించింది. ఆర్థిక వృద్ధి ఆరేళ్ల కనిష్టానికి పడిపోవడం, నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్టానికి పెరగడంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వానికి రూ.1.45 లక్షల కోట్ల ఆదాయం గండిపడనుంది. ‘ఇది చాలా కీలక నిర్ణయం. చాలా పాజిటివ్ కూడా. ఆసియాలోని ఇతర ఎమర్జింగ్ ఎకానమీలతో పోలిస్తే.. ఇండియన్ కార్పొరేట్ ట్యాక్స్ చాలా కాంపిటిటివ్‌‌గా ఉంది. ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్లను పరిగణలోకి తీసుకుంటే, ఇండియా కచ్చితంగా మరింత కాంపిటీటివ్ స్థానంలో ఉన్నట్టే. మరిన్ని పెట్టుబడులను ఇండియా ఆకర్షిస్తుంది’ అని దాస్ అన్నారు. దేశీయ ఇన్వెస్టర్ల పరంగా చూసుకుంటే, మరింత నగదు వారి చేతిలోకి వచ్చి మూలధనం ఖర్చు పెంచనున్నారని చెప్పారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌తో భేటీపై స్పందించిన దాస్.. సాధారణంగా మానిటరీ పాలసీ మీటింగ్‌‌కు ముందు మంత్రితో సమావేశమవుతామని తెలిపారు. పాలసీకి ముందు గవర్నర్, ఆర్థిక మంత్రితో భేటీ అవ్వడం చాలా కాలంగా కొనసాగుతున్న సంప్రదాయమని దాస్ చెప్పారు. ఈ భేటీలో  ఎకానమీపై చర్చించామన్నారు.