హైదరాబాద్‌‌ కరోనా టెస్టింగ్ డేటా అంతా ఫేకేనా?

హైదరాబాద్‌‌ కరోనా టెస్టింగ్ డేటా అంతా ఫేకేనా?

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌‌‌‌లో నిర్వహించిన కరోనా టెస్టులపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తక్కువ కేసులు నమోదైన పబ్లిక్ హెల్త్ సెంటర్స్ (పీహెచ్‌సీ)లో కొన్ని నెలలుగా జరిపిన సుదీర్ఘ విచారణలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. నకిలీ పేర్లు, అడ్రస్‌‌లు, ఫోన్ నంబర్లతో ఫేక్ పాజిటివ్ కేసులను ప్రకటించారనే విషయం వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు 352 టెస్టు డేటాలో 110 పీహెచ్‌‌సీల్లో కరో్నా కేసుల సమాచారంలో అనుమానాలు ఉన్నట్లు తెలుస్తోంది.

టెస్టు చేసిన సెకన్లలోనే ఫలితాలు: ఇన్వెస్టిగేషన్‌‌లో భాగంగా ఒక రిపోర్టర్ టెస్టు చేయించుకోగా.. 86 సెకన్లలోనే అతడికి ఆన్‌లైన్ ద్వారా టెస్టు ఫలితాన్ని పంపారు. సాధారణంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా టెస్టులు చేయరు. అలాగే కరోనా పరీక్ష చేసిన 24 గంటల తర్వాతే రిజల్ట్స్‌‌ను పంపుతారు. దీంతో ఇలాంటి మరిన్ని ఆరోగ్య కేంద్రాల డేటాను ఇన్వెస్టిగేషన్‌‌లో భాగంగా పరిశీలించగా చాలా విషయాలు బయటపడ్డాయి. హెల్త్ అఫీషియల్స్ కొన్ని టార్గెట్లు ఫిక్స్ చేయడంతో సిబ్బంది ఫేక్ టెస్టులు, తప్పుడు పాజిటివ్ కేసులను నమోదు చేసినట్లు సమాచారం.

పీహెచ్‌సీల్లో సగటున రోజుకు 50 నుంచి 60 కరోనా టెస్టులు నిర్వహిస్తుండగా, ఏరియా ఆస్పత్రుల్లో రోజూ 200 వరకు పరీక్షలు చేస్తున్నారు. ఒక సెంటర్‌‌లో ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్ నెలల డేటాను పరిశీలించగా.. ఒకే ఫోన్ నంబర్‌‌తో పలు రిజిస్ట్రేషన్‌‌లు జరిగినట్లుగా గుర్తించారు. వరదల కారణంగా ప్రజలు ఇళ్లలోనే ఉన్నప్పుడు కూడా కరోనా కేసుల్లో తగ్గుదల లేకపోవడం గమనార్హం.

ఫోన్ నంబర్లతో ఫేక్ టెస్టులు: జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ జరిగిన డిసెంబర్ 1న ఓ టెస్టింగ్ సెంటర్‌‌లో 60 మంది పరీక్షలు చేయించుకున్నారు. అందులో ఒకరైన అసద్ అనే పేషెంట్ ఫోన్ నంబర్‌‌ను తీసుకొని మరుసటి రోజు అనఘా (పేషెంట్ భద్రతను దృష్టిలో పెట్టుకొని అసలు పేరును మార్చారు) అనే పేరుతో ఫేక్ టెస్టు చేశారు. మరో పేషెంట్ విషయంలో ఇలాగే జరిగింది. డిసెంబర్ 3న జీహెచ్ఎంసీలో 5,003 టెస్టులు చేశారు. ఇందులో 141 మంది కరోనా పాజిటివ్‌‌గా తేలారు. పాజిటివిటీ రేటు 3 శాతంగా నమోదైంది. కానీ అనూహ్యంగా మీడియా బులెటిన్‌‌లో మాత్రం 109 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదైనట్లుగా వచ్చింది. ఈ విషయాలపై పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ స్పందించాల్సి ఉంది.

రాష్ట్రంలో కరోనా డేటా విషయంలో మొదటి నుంచి పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మార్చి 2 నుంచి జూన్ 17 దాకా స్టేట్‌‌లో సగటున రోజుకు 429 టెస్టులు చేశారు. అదే జూన్ తర్వాత హైదరాబాద్‌‌లో పది రోజుల్లోనే 50 వేల టెస్టులు చేసినట్లుగా ప్రకటించారు.