రజాకార్‌‌‌‌ సినిమా విడుదల ఆపండి.. సెన్సార్ బోర్డుకు సీపీఐ ఫిర్యాదు 

రజాకార్‌‌‌‌ సినిమా విడుదల ఆపండి.. సెన్సార్ బోర్డుకు సీపీఐ ఫిర్యాదు 

న్యూఢిల్లీ, వెలుగు: రజాకార్ సినిమాతో మత విద్వేషాలను రెచ్చగొట్టే అవకాశం ఉందని, ఆ మూవీ విడుదలను నిలిపివేయాలని సీపీఐ నేతలు కోరారు. శుక్రవారం ఢిల్లీలో ఆ పార్టీ ఎంపీ బినయ్ బిశ్వం, నేషనల్ సెక్రటరీ నారాయణ ఈసీఐ, రీజినల్ సెన్సార్ బోర్డు అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం అక్కడి తెలంగాణ భవన్‌‌లో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 19న రజాకార్ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌‌లో విడుదలైందని తెలిపారు.

ఈ సినిమాతో బీజేపీ నేతలు చరిత్రను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి ఓట్లు పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి ఈ సినిమాను ప్రొడ్యూస్‌‌ చేశారని తెలిపారు. రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణలో సాయుధ పోరాటం జరిగిందని, అయితే ఆ పోరాటాన్ని బీజేపీ విముక్తి పోరాటంగా చూపిస్తోందన్నారు. ఇలాంటి ప్రయత్నాల వల్ల ఆ పార్టీ నేతలు చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.