కరెంట్ బిల్లు పేమెంట్ హాస్టలర్స్ దే అంటున్న ఓనర్లు

కరెంట్ బిల్లు పేమెంట్ హాస్టలర్స్ దే అంటున్న ఓనర్లు

హైదరాబాద్, వెలుగు: కరోనా టైమ్​లో వెలవెలబోయిన ఐటీ కారిడార్ ప్రస్తుతం ఎంప్లాయీస్​తో కళకళలాడుతోంది. వర్క్​ఫ్రమ్​ఆఫీస్​కు రావాలంటూ సంస్థలు చెప్తుండటంతో చాలామంది ఎంప్లాయీస్ సొంతూళ్ల నుంచి సిటీకి వచ్చేశారు. వీరిలో ఎక్కువ శాతం ఆఫీసులకు దగ్గరలో అకామిడేషన్ కోసం చూస్తున్నారు. కాగా హైటెక్​సిటీ పరిసర ప్రాంతాల్లో దాదాపు 2,300 హాస్టళ్లు ఉన్నాయి. ఐటీ ఎంప్లాయీస్​నే  నమ్ముకుని నిర్వాహకులు వీటిని నడిపిస్తున్నారు. కరోనా సమయంలో ఎవరూ లేక వెలవెలబోయిన ఈ హాస్టళ్లు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ ఆఫీస్, హైబ్రిడ్ మోడల్ వర్క్ వల్ల నిండిపోతున్నాయి. అయితే గతంతో పోలిస్తే హాస్టల్ ఓనర్లు మెయింటెనె
న్స్​లో పలు మార్పులను తీసుకురావడంతో పాటు కండీషన్స్ పెడుతున్నారు. ఒకప్పుడు అన్నింటికి  కలిపి ఒకటే అమౌంట్ తీసుకునేవారు. కానీ కొంతకాలంగా విడివిడిగా బిల్లులు చార్జి చేస్తున్నారు. 

వాటాలు వేసుకొని కట్టాలంటూ..

రెండేండ్ల కిందట పోలిస్తే రూ.500 పెంచి చార్జి చేస్తున్నామని హాస్టల్స్ ఓనర్లు పేర్కొంటున్నారు. కానీ అంతకు మించి తీసుకుంటున్నారని హాస్టలర్స్ చెప్తున్నారు. ప్రస్తుతం ఐటీ కారిడార్‌‌‌‌లోని హాస్టల్స్​లో ప్రతి రూమ్‌‌కు సెపరేట్​గా ప్రీ పెయిడ్ కరెంట్ మీటర్లు పెడుతున్నారు. నెలకు ఎంత బిల్లు వచ్చినా అది ఆయా రూముల్లో ఉండేవారు వాటాలుగా వేసుకొని కట్టుకోవాలని చెప్తున్నారు. అదేవిధంగా షేరింగ్​ను బట్టి రెంట్‌‌ చార్జి చేస్తున్నారు. ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఉండేలా షేరింగ్ రూమ్ లను అందుబాటులో ఉంచుతూ.. అకామిడేషన్​కి మాత్రమే రూ.5 వేల నుంచి మొదలు కొని, ఫుడ్​కి మళ్లీ నాలుగైదు వేలు చార్జి చేస్తున్నట్లు హాస్టలర్లు చెప్తున్నారు. ఇవి కాకుండా కొత్తగా కరెంట్‌‌ బిల్ కూడా యాడ్‌‌ అవడంతో నెలకి రూ.10 వేల నుంచి 13 వేల వరకు కడుతున్నట్లు పేర్కొంటున్నారు. 

మెయింటెనెన్స్ భారమంటూ.. 

కరోనా టైమ్​లో హాస్టళ్లన్నీ ఖాళీ అయిపోయాయి. బిల్డింగ్ రెంట్లు, మెయింటెనెన్స్ చేయలేక దాదాపు 30 శాతం మంది ఓనర్లు హాస్టల్స్ తీసేసి సొంతూర్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఐటీ ఎంప్లాయీస్ అందరూ వస్తుండటంతో మళ్లీ హాస్టళ్లకు డిమాండ్ ​పెరిగింది. ఏడాది కిందటి వరకు 15 శాతం ఉన్న ఆక్యుపెన్సీ ఇప్పుడు 75శాతం వరకు పెరిగిందని హాస్టళ్ల ఓనర్లు చెప్తున్నారు. బిల్డింగ్​ల రెంట్ పెరిగిందని, కరెంట్ బిల్లులు సైతం ఎక్కువగా వస్తున్నాయంటున్నారు. ఈ కారణంగానే రెంట్లను పెంచామని చెప్తున్నారు. హాస్టలర్ల వద్ద ల్యాప్​టాప్​లు, సెల్​ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్​గ్యాడ్జెట్స్ పెరిగిపోయి కరెంట్ బిల్లులు విపరీతంగా వస్తుండటంతో రూమ్‌‌లకు సెపరేట్​గా సబ్‌‌ మీటర్లు ఏర్పాటు చేశామని చెబుతున్నారు.