ఊరినే ముంచిన సైబర్ నేరగాళ్లు

ఊరినే ముంచిన సైబర్ నేరగాళ్లు
  • ఒకే ఊళ్లో 200 మంది బాధితులు.. కోటిన్నర మోసం
  • సైబర్ క్రైమ్​ పోలీసులకు బాధితుల ఫిర్యాదు 
  • వికారాబాద్ జిల్లా కడ్మూరులో ఘటన 

వికారాబాద్, వెలుగు: సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే, పెట్టిన దానికి పది రెట్లు ఇస్తామని నమ్మించారు. ఒకే ఊరును టార్గెట్ చేసుకొని 200 మంది నుంచి రూ.కోటిన్నర కొట్టేశారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కడ్మూరులో జరిగింది. 3 నెలల క్రితం గ్రామంలో లైమ్ కంపెనీ యాప్ పేరుతో ఓ లింక్ సర్క్యులేట్ అయింది. కొంతమంది అది డౌన్ లోడ్ చేసుకోగా.. రూ.10 వేలు ఇన్వెస్ట్ చేస్తే రూ.లక్ష, రూ.లక్ష ఇన్వెస్ట్ చేస్తే రూ.10 లక్షలు ఇస్తామని సైబర్ నేరగాళ్లు నమ్మించారు. ముందుగా రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.500 వసూలు చేశారు. ఫస్ట్‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ చేసిన వారి అకౌంట్లలో డబ్బులు డిపాజిట్ అయినట్లు చూపించారు. దీంతో ఊళ్లోని యువకులందరూ ఆ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకున్నారు. ఒకరికొకరు షేర్ చేసుకున్నారు. యాప్ డౌన్ లోడ్ చేసుకున్నోళ్లతో సీమ అనే మహిళ, మరికొందరు చాటింగ్ చేశారు. అమౌంట్ ట్రాన్స్ ఫర్ చేయాల్సిన బ్యాంక్ అకౌంట్లు ఇచ్చారు. డబ్బులు వస్తాయనే ఆశతో బాధితులు పెద్ద ఎత్తున డబ్బులు డిపాజిట్ చేశారు. అప్పులు చేసి మరీ సైబర్ నేరగాళ్ల అకౌంట్లలో వేశారు. 

ఒక్కొక్కరు లక్ష వరకు పోగొట్టుకున్నరు.. 
గత నెల 25 నుంచి యాప్ లో డబ్బు విత్‌‌ డ్రా ఆప్షన్‌‌ పని చేయకపోవడంలో బాధితులు అలర్ట్‌‌ అయ్యారు. ఇంతకుముందు చాట్‌‌ చేసిన నెంబర్‌‌‌‌లో డబ్బు గురించి అడిగారు. దీంతో మరో రూ.6 వేలు డిపాజిట్ చేస్తే, క్యాష్ విత్ డ్రా ఆప్షన్ ఇస్తామని సైబర్ నేరగాళ్లు నమ్మించారు. డబ్బులు వస్తాయని నమ్మిన గ్రామస్తులు.. మళ్లీ రూ.6 వేలు డిపాజిట్ చేశారు. కానీ రూపాయి కూడా రాలేవు. దీంతో మోసపోయామని బాధితులు తెలుసుకున్నారు. శంకర్, రాంచంద్రయ్య, నర్సింలు, అనంతయ్య, మరో ఇద్దరు కలిసి సోమవారం హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఒక్కొక్కరు రూ.500 నుంచి రూ.లక్ష వరకు పోగొట్టుకున్నారని వారు చెప్పారు. సైబర్ నేరగాళ్లు మొత్తంగా 200 మంది నుంచి రూ. కోటి 56 లక్షలు కొట్టేశారని తెలిపారు. తాము ఆరుగురం రూ.5 లక్షల 42 వేల528 పోగొట్టుకున్నామని పేర్కొన్నారు. కాగా, బాధితులు సైబర్ క్రైమ్ లో ఇచ్చిన ఫిర్యాదు తమకు అందిందని, దర్యాప్తు చేస్తున్నామని పూడూరు ఎస్సై శ్రీశైలం చెప్పారు.