వారియర్స్‌‌దే కిరీటం : ప్రొ కబడ్డీ ఫైనల్లో ఢిల్లీపై ఘన విజయం

వారియర్స్‌‌దే కిరీటం : ప్రొ కబడ్డీ ఫైనల్లో ఢిల్లీపై ఘన విజయం

ప్రొ కబడ్డీ ఏడో సీజన్‌‌ విజేత బెంగాల్‌‌

అహ్మదాబాద్‌‌: రైడింగ్‌‌లో జోరు చూపెట్టిన బెంగాల్‌‌ వారియర్స్‌‌.. తొలిసారి ప్రొ కబడ్డీ లీగ్‌‌ (పీకేఎల్‌‌) టైటిల్‌‌ను కైవసం చేసుకుంది. శనివారం జరిగిన హోరాహోరీ ఫైనల్లో బెంగాల్‌‌ 39–34తో దబాంగ్‌‌ ఢిల్లీపై గెలిచింది. ఈ సీజన్‌‌లో 205 పాయింట్లు స్కోర్‌‌ చేసిన తమ కెప్టెన్‌‌ మణిందర్‌‌ సింగ్‌‌ లేకుండానే ఫైనల్లో బరిలోకి దిగిన బెంగాల్‌‌ను ఆల్‌‌రౌండర్‌‌ మహ్మద్‌‌ నబీ భక్ష్ (10 పాయింట్లు) సూపర్‌‌ టెన్‌‌తో ముందుండి నడిపించాడు. అతనికి సుఖేశ్‌‌ హెగ్డే (8 పాయింట్లు) అండగా నిలిచాడు. ఢిల్లీ స్టార్‌‌ నవీన్‌‌ కుమార్‌‌ (18 పాయింట్లు) వరుసగా 21వ సారి సూపర్‌‌ టెన్‌‌ సాధించి ఒంటరి పోరాటం చేసినా తమ టీమ్‌‌ను గెలిపించలేకపోయాడు.

మ్యాచ్‌‌ను ధాటిగా ఆరంభించిన ఢిల్లీ నెమ్మదిగా పట్టుకోల్పోయింది. మ్యాచ్‌‌ 15వ నిమిషంలో ఢిల్లీని ఆలౌట్‌‌ చేసిన నబీభక్ష్ బెంగాల్‌‌ను రేసులోకి తెచ్చాడు. దీంతో ఫస్టాఫ్ ముగిసే సరికి ఇరుజట్లు 17–17తో సమంగా నిలిచాయి. సెకండాఫ్ ప్రారంభంలో ఇరుజట్లు నువ్వానేనా అన్నట్టు ఆడినా నెమ్మదిగా లీడ్‌‌లోకి వచ్చిన బెంగాల్‌‌ చివరిదాకా ఆధిక్యం కొనసాగించి విజేతగా నిలిచింది. అంతేకాక ఈ  సీజన్‌‌లో ఢిల్లీతో ఆడిన ప్రతిసారి బెంగాలే విజయం సాధించింది.

ప్రైజ్‌‌మనీ

విన్నర్‌‌: రూ. 3 కోట్లు, రన్నరప్‌‌: రూ.1.80 కోట్లు
ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌: నవీన్‌‌ కుమార్‌‌

రైడర్‌‌ ఆఫ్‌‌ ద సీజన్‌‌:పవన్‌‌ షెరావత్‌‌ (346 పాయింట్లు), బెంగళూరు బుల్స్‌‌.

డిఫెండర్ ఆఫ్‌‌ ద సీజన్‌‌: ఫజల్‌‌ అత్రాచలి (82 ట్యాకిల్‌‌ పాయింట్లు), యు ముంబా

మోస్ట్‌‌ వాల్యుబుల్‌‌ ప్లేయర్‌‌: నవీన్‌‌ కుమార్‌‌ (301 రైడ్‌‌ పాయింట్లు), దబాంగ్‌‌ ఢిల్లీ