ఢిల్లీని వణికిస్తున్న చలి 15 డిగ్రీలు తగ్గిన ఉష్ణోగ్రతలు

ఢిల్లీని వణికిస్తున్న చలి  15 డిగ్రీలు తగ్గిన ఉష్ణోగ్రతలు

న్యూఢిల్లీ: ఢిల్లీని చలి వణికిస్తోంది. శనివారం అత్యంత తక్కువగా 15.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సీజన్‌ సగటు కంటే మూడు డిగ్రీలు తక్కువగా రికార్డయిందని ఐఎండీ తెలిపింది. అలాగే, రాష్ట్రంలో వాయు కాలుష్యం పెరగడంతో ఎయిర్‌‌ క్వాలిటీ కూడా పడిపోయిందని చెప్పింది. పగటిపూట ఆకాశం నిర్మలంగా ఉంటుందని, 32 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్ (సీపీసీబీ) డేటా ప్రకారం ఢిల్లీలో ఎయిర్‌‌ క్వాలిటీ ఇండెక్స్‌ (ఏక్యూఐ) ఉదయం 9 గంటలకు 219 పాయింట్లుగా ఉంది. సఫర్‌‌ ఇండియా ప్రకారం.. ఎయిర్‌‌ క్వాలిటీ 173 పాయింట్లు నమోదైంది. గాలులు తగ్గుముఖం పట్టడంతో శని, ఆదివారాల్లో ఏక్యూఐ క్షీణించే అవకాశం ఉంది. 

ఆదివారం రాత్రి ఒకటి రెండు చోట్ల చిరు జల్లులు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం నుంచి రాబోయే ఆరు రోజులు ఎయిర్‌‌ క్వాలిటీ మరింత తగ్గే చాన్స్‌ ఉందని తెలిపింది. కాగా, ఢిల్లీలో గాలి క్షీణిస్తున్న నేపథ్యంలో పలు అథారిటీలకు నేషనల్‌ గ్రీన్ ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) నోటీసులు జారీ చేసింది. గాలి నాణ్యతకు సంబంధించి ఏం చర్యలు తీసుకుంటున్నారో రిపోర్ట్‌ ఇవ్వాలని ఢిల్లీ చీఫ్‌ సెక్రటరీ, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఢిల్లీ(ఎంసీడీ)లకు శనివారం నోటీసులు జారీ చేసింది. మరోవైపు, పొల్యూషన్‌ అండర్‌‌ కంట్రోల్‌ సర్టిఫికేట్స్‌ (పీయూసీసీ) లేని వాహనదారులకు ఢిల్లీ ట్రాఫిక్‌ పోలీసులు పెద్ద ఎత్తున చలాన్లు జారీ చేశారు. జనవరి 1 నుంచి అక్టోబర్‌‌ 15 వరకు మొత్తం 1,58,762 చలాన్లు జారీ చేసినట్లు తెలిపారు. గతేడాది ఇదే టైమ్‌తో  పోలిస్తే 50,662 చలాన్లు ఎక్కువగా జారీ చేశారు.