వంట నూనెను ఎలా వాడాలో..ఏది మంచిదో తెలుసా?

వంట నూనెను ఎలా వాడాలో..ఏది మంచిదో తెలుసా?

ఒకప్పుడు పండుగలు, పబ్బాలకు తప్ప మిగతా రోజుల్లో కిలో నూనె నెలంతా సరిపోయేది. ఇప్పుడు ఐదారు కిలోలు తెచ్చినా సరిపోవడంలేదు. ఇలా ఎందుకంటే ఇప్పుడంతా రిఫైన్డ్​. నూనె కూడా నీళ్లలా ఉండాలి. దీంతో కూరల్లో ఎంత నూనె పోసినా ఆ ఫ్లేవరే ఉండడంలేదు. ఒకప్పుడు అలాకాదు.. ఒక స్పూన్​ నూనె వేసి వంట చేసినా దాని ఫ్లేవర్​ బాగా తెలిసేది.

ఇంతకీ ఒకప్పటిలా ఏ ప్రాసెస్​ చేయని నూనె మంచిదా? ఇప్పుడు వాడుతున్న రిఫైన్డ్​ ఆయిల్​ మంచిదా? ఏ నూనె వాడడం ఆరోగ్యానికి మంచిది? కొందరు సన్​ఫ్లవర్​ ఆయిల్​ మంచిదంటారు. మార్కెట్​లో రకరకాల బ్రాండ్​లున్నాయి. ‘మా నూనెలో ఎ, డి, ఇ విటమిన్లు ఉన్నాయ’ని ఒక కంపెనీ ప్రచారం చేసుకుంటుంది. మరో కంపెనీ మాదే ఒరిజినల్​ ఆయిల్​ అని చెబుతుంది. దీంతో ఏ నూనె వాడాలో తెలియని కన్ఫ్యూజన్ రావటం సహజం​. వంట నూనెకు సంబంధించి ఎన్నో డౌట్స్​. వాటన్నింటిపై అవేర్​నెస్​ కావాలంటే కొన్ని వివరాలు తెలుసుకోవాలంటున్నారు డాక్టర్లు.

నూనె లేకుండా వంట చేయలేం. చేసినా టేస్ట్ ఉండదు. వంటల్లో వాడే కంపల్సరీ ఇంగ్రెడియెంట్​గా నూనె మారిపోయింది. అయితే రుచి కోసం కాకుండా హెల్త్​ కోసం ఈ నూనెను వాడితే ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందొచ్చని చెబుతున్నారు డాక్టర్లు.

ఆరోగ్యానికి ఏ నూనె మంచిది? ఏ నూనె వాడడం వల్ల హెల్త్​ ఇష్యూస్​ వస్తాయి? నూనెలో ఏయే పోషకాలు ఉండాలి? ఆరోగ్యంగా ఉన్న ఒక వ్యక్తికి రోజుకు ఎంత నూనె సరిపోతుంది? నూనె వినియోగం పెరిగిపోవడానికి కారణమేంటి? అందుకు కార్పొరేట్​ కంపెనీలు చేస్తున్న మార్కెట్​ గిమ్మిక్కులేంటి? ఇది దేనికి దారి తీస్తుంది? …ఇలా వంట నూనెకు సంబంధించి వరల్డ్​వైడ్​గా పెద్ద డిబేట్​ జరుగుతోంది. ప్రతి కంపెనీ తమ బ్రాండ్​ నూనె మంచిదంటే… తమ బ్రాండ్​ నూనె మంచిదని చెబుతున్నాయి.

ఇదే ఆరోగ్యానికి మంచిదనలేం

వంటనూనెలపై జాతీయస్థాయిలో జరిగే డిబేట్​లలో ఎక్కువగా కనిపించే డాక్టర్​ హెక్​కే చోప్రా, న్యూట్రిషనిస్ట్​ నీలంజన చెప్పిన వివరాల ప్రకారం.. ఏ నూనె కూడా ఆరోగ్యానికి మంచిదని చెప్పలేం. ఒక్కో ప్రాంతం వాళ్లు ఒక్కో నూనె వాడుతున్నారు. ఉత్తరాదిన ఆవాల నూనె వాడుతున్నారు. దక్షిణాదిలో పల్లినూనె, సన్​ఫ్లవర్​ ఆయిల్​,​ కొబ్బరి నూనె వాడతారు. ఇదే బెస్ట్ నూనె అనుకోవడం కరెక్టు కాదు. ప్రతీ నూనెలో కొవ్వుతోపాటు మరికొన్ని పదార్థాలుంటాయి. ఇవి అందరికీ మేలు చేస్తాయని చెప్పలేం. అలాగని అందరి ఆరోగ్యాలను దెబ్బతీస్తాయని కూడా అనుకోవద్దు. కొన్ని పదార్థాలు కొందరికి అవసరమైతే, మరికొందరిలో సమస్యలు సృష్టిస్తాయి.

కాంబినేషన్​ ఆయిల్స్​

ఒకే ఆయిల్​ను కాకుండా రెండు రకాల నూనెల్ని కలిపి వాడడం మంచిది. నిజానికి మోనోశాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (MUFA) ఉండే నూనెల్ని వాడాలి. ఎందుకంటే MUFA అనేది మంచి కొవ్వు. అలాగే… పాలీ అన్‌‌శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ – PUFA అనేవి ఒమెగా-3, ఒమెగా-6 ఫ్యాటీ యాసిడ్స్ కలిగి వుంటాయి. ఇవి మన బాడీకి చాలా అవసరం. మన శరీరం వాటిని స్వయంగా తయారుచేసుకోలేదు. వంట నూనె ద్వారానే అవి శరీరానికి అందుతాయి. అందుకే వేరువేరు నూనెల్ని కలిపి వాడుకోవడం వల్ల ఎక్కువ బెనిఫిట్స్​ ఉంటాయి.

ఏ ఆయిల్ కాంబినేషన్​ మంచిది?

కాంబినేషన్​ ఆయిల్స్​ విషయంలో కూడా కొంత అవేర్​నెస్​ అవసరం. ఎందుకంటే… సపోజ్ కొబ్బరి నూనెను వంటకు వాడుతుంటే… ఇక వేరే అవసరాలకు కొబ్బరినూనె వాడొద్దు. ఎందుకంటే కొబ్బరి నూనెలో ఫ్యాట్ ఎక్కువ. కొబ్బరి నూనెతో వంట చేసేవాళ్లు… రైస్ బ్రాన్ ఆయిల్, నువ్వుల నూనె వాడొచ్చు. ఎందుకంటే PUFA అనేది కొబ్బరి నూనెలో ఉండదు. ఇక పల్లీనూనె వాడేవాళ్లు అందులో 25శాతం సన్​ఫ్లవర్​ ఆయిల్​ కలుపుకోవచ్చు. సన్​ఫ్లవర్​ ఆయిల్​తో వంట చేసేవాళ్లు అందులో నువ్వుల నూనె కాకుండా మరేదైనా ఆయిల్​ కలుపుకోవచ్చు.

మిక్స్​డ్​ ఆయిల్స్​

ప్రస్తుతం మార్కెట్లలో మిక్స్‌‌డ్ ఆయిల్స్ కూడా దొరుకుతున్నాయి. వాటిని డైరెక్టుగా వాడుకోవచ్చు. రకరకాల కాంబినేషన్​లతో ఉండే ఈ ఆయిల్స్​ను కూడా తరచూ మారుస్తుండాలి. మన హెల్త్​ కండీషన్​ను బట్టి ఈ ఆయిల్​ కాంబినేషన్​ను నిర్ణయించుకోవాలి. అందుకోసం డాక్టర్​ సలహా తప్పనిసరి.
ఈ నూనెలు వాడొద్దు..

పామ్ కెర్నెల్ ఆయిల్

చాలామంది పామ్ ఆయిల్, పామ్ కెర్నెల్ ఆయిల్ రెండూ ఒకటే అనుకుంటారు. పామ్​ ఆయిల్​ను పండు నుంచి తీస్తారు. పామ్​ కెర్నెల్​ ఆయిల్​ను గింజ నుంచి తీస్తారు. ఈ రెండూ ఒకేరకమైన గుణాన్ని కలిగి ఉంటాయి. అందుకే పామ్​ కెర్నెల్​ ఆయిల్​ను వాడకపోవడమే మంచిది.

కొబ్బరి నూనె

కొబ్బరి నూనెలో కొలెస్ట్రాల్​, కొవ్వులు ఎక్కువ. అందుకే దీనిని వంటల్లో కాకుండా జుట్టుకు వాడడమే మంచిది. వంటల్లో ఎక్కువగా కొబ్బరి నూనెను ఉపయోగిస్తే రక్తనాళాల్లో కొవ్వు ఎక్కువగా చేరుతుంది. కేరళలో కొబ్బరి నూనె వినియోగం ఎక్కువగా ఉన్నా.. ఆయా ప్రాంతాల సంప్రదాయాల వల్ల కొబ్బరినూనె సైడ్​ ఎఫెక్ట్స్​ పెద్దగా కనిపించడంలేదు. అలాగని మిగతా ప్రాంతాలవాళ్లు కూడా కొబ్బరినూనె వాడడం మంచిది కాదు.

జొన్న నూనె

కొన్నిరోజుల కిందట జొన్న గింజల నూనె మార్కెట్​లోకి వచ్చింది. ఇది ఎంతో హెల్దీ అని అంతా చెప్పుకున్నారు. కాని తర్వాతి రోజుల్లో అది అంత హెల్దీ కాదని, ఫ్యాటీ యాసిడ్స్​ ఎక్కువగా ఉన్నాయని తేలడంతో ఈ నూనెను వాడడం తగ్గించేశారు.

హైడ్రోజినేటెడ్ ఆయిల్

హైడ్రోజినేటెడ్​ ఆయిల్​ పేరుతో కూడా మార్కెట్​లో వంటనూనెలు అమ్ముతున్నారు. దీనిలో ట్రాన్స్​ ఫ్యాట్స్​ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తనాళాలను బ్లాక్​ చేస్తాయి.

ఈ జాగ్రత్తలు కంపల్సరీ

  • హార్ట్​ ఇష్యూస్​కు ప్రధాన కారణం వంట నూనెలే. కూరల్లో ఎక్కువగా నూనె వాడడం, ఆయిల్​ ఫుడ్స్​ ఎక్కువగా తినడం, ఒకసారి వాడిన నూనెను పదే పదే వినియోగించడం వంటివి గుండె జబ్బులకు కారణమవుతాయి. ముఖ్యంగా శరీరంలో కొవ్వుశాతాన్ని పెంచి, బ్లడ్​ సర్క్యులేషన్​ను అడ్డుకుంటాయి. ఇదే హార్ట్​ఎటాక్​కు దారితీస్తుంది.
  • నూనెను వేడి చేసినప్పుడు వాటి టెంపరేచర్​ కూడా మారుతుంది. దీనిని స్మోకింగ్ పాయింట్ అంటారు. దీనిపై అవగాహన కలిగి ఉండాలి. అంతకు మించి వేడి చేయొద్దు. డబుల్​ రిఫైన్డ్​ ఆయిల్స్​ను ఎంత వేడి చేసినా వాటి నుంచి స్మోక్​ రాదు. అదే పల్లీ, సోయాబీన్​, సన్​ఫ్లవర్​ నూనెలను వేడిచేస్తే పొగలు వస్తాయి.
  • వంటనూనె‌‌ను ఎక్కువగా వేడి చేస్తే అందులో ఉండే విటమిన్–ఇ ఆవిరైపోతుంది. అంతేకాదు.. ఏ నూనెనైనా నాలుగుసార్ల కంటే ఎక్కువ వేడి చేసి వాడకూడదు.
  • ఒకసారి వాడిన నూనెను మరోసారి వాడే ముందు పాత్రలో అడుగున ఉన్న నూనెను వదిలేయాలి. లేదంటే వడగట్టుకొని వాడాలి.
  • వంటనూనెపై ఎండ పడకుండా చూడాలి. నేరుగా ఎండ పడడం వల్ల నూనెలో కొన్ని రసాయనిక మార్పులు జరుగుతాయి.
  • వంటనూనె కొనేముందు అందులో ఉన్న కొవ్వు శాతం చూసి మరీ కొనాలి. వంటకు వాడే నూనెలో ఎనిమిది నుంచి 10 శాతం శాచ్యురేటెడ్ కొవ్వు ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉంటే ప్రమాదకరం.