63 డిగ్రీ కాలేజీల్లో ఒక్కరూ చేరలె

63 డిగ్రీ కాలేజీల్లో ఒక్కరూ చేరలె
  •     ముగిసిన దోస్త్ ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్ మెంట్
  •     సీట్లు పొందినోళ్లు 25లోగా రిపోర్ట్ చేయాలె
  •     ప్రొఫెసర్ లింబాద్రి, నవీన్ మిట్టల్ వెల్లడి

హైదరాబాద్, వెలుగు: డిగ్రీ ఆన్​లైన్ సర్వీసెస్​ తెలంగాణ(దోస్త్) ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్ మెంట్ ప్రక్రియ శుక్రవారం ముగిసింది. దీంట్లో మొత్తం 889 కాలేజీలు పాల్గొనగా.. 63 ప్రైవేటు కాలేజీల్లో ఒక్కరూ చేరలేదు. సీట్ల అలాట్మెంట్ వివరాలను హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ మీడియాకు వెల్లడించారు. డిగ్రీలో మొత్తం 512 కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

ఈ కోర్సుల్లో చేరేందుకు ఫస్ట్ ఫేజ్​లో 1,05,935 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దీంట్లో 78,212 మంది వెబ్ ఆప్షన్లు ఇవ్వగా, వారిలో 73,220 మందికి సీట్లు అలాట్ అయ్యాయి. మరో 4,992 మంది తక్కువ ఆప్షన్లు ఇవ్వడంతో వారికి సీట్లు అలాట్ కాలేదు. సీట్లు అలాట్ అయిన వారిలో అమ్మాయిలు 44,113 మంది, అబ్బాయిలు 29,107 మంది ఉన్నారు. దోస్త్ ఫస్ట్ ఫేజ్ లో​33,251 (45.41%) మంది అభ్యర్థులు కామర్స్ గ్రూపును ఎంచుకున్నారు. ఆ తర్వాత లైఫ్ సైన్సెస్ కోర్సుల్లో 16,434(22.44%) మందికి, ఫిజికల్ సైన్స్ లో 13,438 (18.39%)  ఆర్ట్స్ కోర్సుల్లో 7,771(10.61%), డేటాసైన్స్ అండ్ ఏఐ, ఎంఎల్ కోర్సుల్లో 1,955, డీఫార్మసీలో 254, ఇతర కోర్సుల్లో 87 మందికి సీట్లు అలాట్ అయ్యాయి.  సీట్లు అలాట్ అయిన వారికి మెసేజ్​ల రూపంలో సమాచారం అందించామని చైర్మన్ లింబాద్రి, కమిషనర్ నవీన్ మిట్టల్ వెల్లడించారు. వారంతా ఈ నెల 25లోగా ఆన్​లైన్​లో సెల్ఫ్ రిపోర్టు చేయాలని సూచించారు.

స్కాలర్ షిప్​ పొందే అవకాశమున్న స్టూడెంట్లు రూ.500, ఇతర స్టూడెంట్లు రూ.వెయ్యి చెల్లించాలని తెలిపారు. ఆన్​ లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయకుంటే సీటుతో పాటు దోస్త్ రిజిస్ట్రేషన్ కూడా రద్దవుతుందని హెచ్చరించారు. అలాగే, దోస్త్ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ఈ నెల 27 వరకు ఉంటుందని, 30న సీట్ల అలాల్మెంట్ ఉంటుందని చెప్పారు. వచ్చే నెల 17 నుంచి డిగ్రీ ఫస్టియర్ క్లాసులు మొదలుపెడ్తామని వారు వెల్లడించారు. ఈ ఏడాది 14  కాలేజీల్లో బీఎస్సీ హానర్స్ నాలుగేండ్ల కోర్సు ప్రవేశపెట్టగా మంచి రెస్పాన్స్ వచ్చిందని చైర్మన్​, కమిషనర్​ వెల్లడించారు. 880 సీట్లుకు గాను 662 సీట్లు భర్తీ అయ్యాయని చెప్పారు. సిటీ కాలేజీలో బీఎస్సీ హానర్స్​ బయోటెక్నాలజీ కోర్సు పెట్టగా.. 60కి 60 సీట్లు నిండాయన్నారు.