డ్రైవర్​లేని స్మార్ట్​​ రైలు.. నిమిషాలే జర్నీ టైము

డ్రైవర్​లేని స్మార్ట్​​ రైలు.. నిమిషాలే జర్నీ టైము

వింటర్​ ఒలింపిక్స్​ కోసం స్పెషల్​గా తయారు చేసిన చైనా
గంటకు 350 కిలోమీటర్ల వేగం.. 3 గంటల జర్నీ 47 నిమిషాలకు కుదింపు

బుల్లెట్​ రైలు అనగానే గుర్తొచ్చేది జపాన్​, చైనాలే. అయితే, ఇప్పుడు చైనా ఇంకో అడుగు ముందుకేసింది. డ్రైవర్​లెస్​ కార్లలాగే డ్రైవర్​ అవసరం లేని బుల్లెట్​ రైలును తయారు చేసింది. తయారు చేయడమే కాదు, పట్టాలపైకి ఎక్కించి పరుగులు పెట్టించింది. 2022 బీజింగ్​ ఒలింపిక్స్​కు కౌంట్​డౌన్​ కొనసాగుతున్న టైంలోనే చైనా ఈ రైలును ప్రారంభించింది. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ బుల్లెట్​ ట్రెయిన్​, డ్రాగన్​ కంట్రీ రాజధాని బీజింగ్​ నుంచి ఒలింపిక్స్​ జరిగే ఝాంగ్జియాకు సిటీకి పరుగులు పెడుతుంది. ఇప్పటిదాకా ఆ రెండు సిటీల మధ్య ప్రయాణ దూరం 3 గంటలు కాగా, ఈ బుల్లెట్​ రైలులో కేవలం 47 నిమిషాల్లోనే చేరుకోవచ్చట. డ్రైవర్​ లేని బుల్లెట్​ రైళ్లలో ఇదే ఫస్ట్​ అని చెబుతున్నారు. జింగ్​ఝాంగ్​ హై స్పీడ్​ రైల్వేస్​లో భాగంగా ఈ రైలును, రైల్వే లైన్​ను రెడీ చేశారు.

దానికి దాదాపు నాలుగేళ్లు పట్టిందట. బీజింగ్​, యాంఖింగ్, ఝాంగ్జియాకు రూట్లలో తిరుగుతుంది. గ్రేట్​ వాల్​ ఆఫ్​ చైనా ఉండే బదాలాంగ్​ చాంగ్​షెంగ్ ప్రాంతం సహా 10 స్టేషన్లలో ఈ రైలు ఆగుతుందట. డిసెంబర్​ 30నే దీని సర్వీస్​ ప్రారంభమైంది. బీజింగ్​ నార్త్​రైల్వే స్టేషన్​ నుంచి తైజీషెంగ్​ రైల్వేస్టేషన్​కు ఫస్ట్​ ట్రిప్పు వెళ్లింది. దీంట్లో టికెట్లు కావాలంటే రెండు రోజుల ముందే బుక్​ చేసుకోవాల్సి ఉంటుందట. ఈ ట్రైన్​లో 5జీ సిగ్నల్స్​, అవసరానికి తగ్గట్టు వెలిగే లైట్లు, రియల్​టైం డేటా తీసుకునేందుకు, రైల్లో లోపాలను గుర్తించేందుకు 2,718 సెన్సర్లు ఉన్నాయి. అందుకే దీన్ని స్మార్ట్​ ట్రైన్​గా పిలుస్తున్నారు. అంతేగాకుండా ప్రతి స్క్రీన్​కూ ఓ టచ్​స్క్రీన్​ కంట్రోల్​ ప్యానెల్​తో పాటు వైర్​లెస్​ చార్జింగ్​ డాక్​లు దీని స్పెషాలిటీ. తనంతట తానే దూసుకెళ్లే ఈ ట్రైన్​లో, దాని గమనాన్ని పరిశీలించేందుకు మాత్రం స్పెషల్​గా ఓ డ్రైవర్​ ఉంటాడు. స్టేషన్లలో స్టార్ట్​ కావడానికిగానీ, ఆగడానికి డ్రైవర్​ అవసరం లేదు. దానంతట అదే చూసుకుంటుంది. అంతేగాకుండా స్టేషన్ల మధ్య స్పీడ్​లనూ అదే అడ్జస్ట్​ చేసుకుంటుంది. పేపర్​లెస్​ చెకిన్స్​ కోసం రోబోలు, ఫేషియల్​ రికగ్నిషన్​ టెక్నాలజీలను వివిధ రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేశారు.

ఆటగాళ్లను దృష్టిలో పెట్టుకుని…

వింటర్​ ఒలింపిక్స్​ కోసం స్పెషల్​గా ఈ ట్రైన్​ను తయారు చేశారు కాబట్టి, ఆటగాళ్లు, జర్నలిస్టులను దృష్టిలో పెట్టుకుని రైలు పెట్టెలను తయారు చేశారు. వాళ్ల సామాన్లకు తగ్గట్టు స్టోరేజీ స్పేస్​ ఇచ్చారు. అయితే, స్పేస్​ను తీసుకోవాలంటే మాత్రం క్యూఆర్​ కోడ్​ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. మామూలు టైంలో డైనింగ్​ కోసం వాడే రైలు బోగిని, ఒలింపిక్స్​ టైంలో మీడియా సెంటర్​గా మారుస్తారు. అక్కడి నుంచే లైవ్​ కవరేజీ ఇవ్చొచ్చట. వీల్​చైర్లలో వచ్చే దివ్యాంగుల కోసం సీట్లను తొలగించేలా ‘కార్​ ఫోర్​’ను ఏర్పాటు చేశారు.