సీక్రెట్ గా ఎంసెట్.. V6 న్యూస్ తో వెనక్కి తగ్గిన సర్కారు

సీక్రెట్ గా ఎంసెట్.. V6 న్యూస్ తో వెనక్కి తగ్గిన సర్కారు
  • గప్​చుప్​గా 80 మందికే టెస్ట్​ పెట్టే ప్రయత్నం
  • 24 వేల మంది స్టూడెంట్లకు నష్టం జరిగేలా చర్యలు
  • ‘వీ6’ వార్తతో వెనక్కి తగ్గిన సర్కారు
  • ఎగ్జామ్​ వాయిదా వేస్తున్నట్టు శుక్రవారం రాత్రి ప్రకటన

హైదరాబాద్, వెలుగుకరోనా బారినపడి ఎంసెట్ (ఇంజినీరింగ్) రాయని స్టూడెంట్లకు ఎగ్జామ్​విషయంలో ఆఫీసర్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా, వెబ్​సైట్​లోనూ ప్రకటించకుండా.. గప్​చుప్​గా కేవలం 80 మందికి శనివారం టెస్టు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ విషయం ‘వీ 6’ బయటపెట్టడంతో వెనక్కితగ్గారు. పరీక్షను వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రకటించారు. జేఎన్టీయూలో శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగాల్సిన పరీక్షను వాయిదా వేస్తున్నామని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్​ పేర్కొన్నారు. ఎప్పుడు నిర్వహించేది వెబ్​సైట్​లో తెలియజేస్తామని ‘వెలుగు’తో చెప్పారు.

అప్పట్లో ఇంటిమేషన్​ ఇస్తామని చెప్పి..!

వాస్తవానికి మే నెలలో ఎంసెట్  జరగాలి. కానీ కరోనా ఎఫెక్ట్​తో సెప్టెంబర్​కు వాయిదా పడింది. సెప్టెంబర్ 9 నుంచి 14 వరకూ ఎంసెట్ ఇంజినీరింగ్.. సెప్టెంబర్ 28, 29న అగ్రికల్చర్  ఎంట్రెన్స్​ టెస్టులు నిర్వహించారు.  అయితే కరోనా పాజిటివ్ పేషెంట్లు, ఆ లక్షణాలు ఉన్న వాళ్లు, క్వారంటైన్​లో ఉన్న వాళ్లు ఎంసెట్​కు రావొద్దని, వారికి తర్వాత ఎగ్జామ్​ నిర్వహిస్తామని అప్పట్లో సెట్​ఆఫీసర్లు బహిరంగంగా ప్రకటించారు.అయితే కరోనా పాజిటివ్ పేషెంట్లు, ఆ లక్షణాలు ఉన్న వాళ్లు, క్వారంటైన్​లో ఉన్న వాళ్లు ఎంసెట్​కు రావొద్దని, వారికి తర్వాత ఎగ్జామ్​ నిర్వహిస్తామని అప్పట్లో సెట్​ఆఫీసర్లు బహిరంగంగా ప్రకటించారు. దీంతో కరోనా లక్షణాలు ఉన్న వాళ్లు చాలా మంది ఎగ్జామ్​కు రాలేదు. కొందరు హైఫివర్, జలుబు ఉండి ఎగ్జామ్​ సెంటర్​కు వస్తే వారిని ఆఫీసర్లు వెనక్కి పంపించేశారు. తమకు దగ్గు, ఫివర్, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదని సెల్ఫ్​డిక్లరేషన్​ ఇచ్చిన స్టూడెంట్లను మాత్రమే సెంటర్లలోకి అనుమతించారు. అప్పట్లో ఇంత తంతు నిర్వహించిన ఎంసెట్ నిర్వాహకులు.. మళ్లీ పరీక్ష నిర్వహించే విషయంలో ఎలాంటి ఇంటిమేషన్​ ఇవ్వకుండా, ప్రకటన చేయకుండా శనివారం గప్​చుప్​గా కొందరికి మాత్రమే పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

24 వేల మంది రాయలేదు

సెప్టెంబర్​లో జరిగిన ఎంసెట్ (ఇంజినీరింగ్) కు మొత్తం 1,43,330 మంది హాజరుకావాల్సి ఉండగా.. 1,19,187 మందే హాజరయ్యారు. 24,143 మంది ఎగ్జామ్​ రాయలేదు. వీరిలో కరోనా పాజిటివ్ స్టూడెంట్లతో పాటు పేరెంట్స్​కు, బంధువులకు పాజిటివ్ వచ్చి సెల్ఫ్ క్వారంటైన్​లో ఉన్న స్టూడెంట్లూ చాలా మంది ఉన్నారు. వీరందరికీ సమాచారం ఇచ్చి మళ్లీ విడిగా పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే.. హెల్ప్​డెస్క్​కు కాల్ చేసి పేర్లు నమోదు చేసుకున్న కేవలం 80 మంది ఇంజనీరింగ్​ విభాగం వారికి శనివారం టెస్టు నిర్వహించేందుకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేశారు.  ఆ 80 మందికి ఈ నెల1,2 తేదీల్లో మెసేజ్​ల రూపంలో సమాచారం ఇచ్చినట్లు వారు చెప్తున్నారు. తాము హెల్ప్​డెస్క్​కు ఫోన్​చేసినా సరైనా సమాచారం ఇవ్వలేదని, తమకు తెలియకుండా పరీక్ష పెట్టాలని చూడటం ఏమిటని ఇతర స్టూడెంట్ల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. కరోనా సెల్ఫ్​​డిక్లరేషన్​ను వెబ్​సైట్​లో పెట్టిన ఆఫీసర్లు..  ఎగ్జామ్​ ఉందనే విషయాన్ని వెబ్​ సైట్​లో పెట్టకపోవడం ఏమిటని స్టూడెంట్ల తల్లిదండ్రులు ప్రశ్నించారు. కొందరు పొలిటికల్ లీడర్ల  పిల్లల కోసమే ఇలా స్పెషల్​గా ఎగ్జామ్​ నిర్వహించేందుకు ప్రయత్నించారని విమర్శించారు. వ్యవహారాన్ని శుక్రవారం సాయంత్రం ‘వీ 6’ బయటపెట్టింది. దీంతో దిగివచ్చిన ఆఫీసర్లు.. టెస్టును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.