ఎన్నికల హోర్డింగులు: 3నెలల్లో మూడేళ్లకు సరిపడా ప్లాస్టిక్ చెత్త

ఎన్నికల హోర్డింగులు: 3నెలల్లో మూడేళ్లకు సరిపడా ప్లాస్టిక్ చెత్త

ఇండియాలో ఎన్నికలంటే మామూలు వ్యక్తికి తొలుత కనిపించేవి హోర్డింగులే. సర్కారు విజయాలను లేదా వైఫల్యాలను టామ్ టామ్ చేయడానికి రాజకీయ పార్టీలు వీటిని అస్త్రంగా వాడతాయి. ఎక్కడపడితే అక్కడ హోర్డింగులు కడుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తాయి. అయితే, దీని వల్ల ఒక సమస్య ఉంది. కొన్నేళ్లుగా ఇది వెంటాడుతున్నా పార్టీలు మాత్రం పట్టీపట్టనట్టుగా వదిలేస్తున్నాయి. హోర్డింగులు పర్యావరణానికి చాలా హాని చేస్తాయి. వీటిని పాలీ వినైల్ క్లోరైడ్(పీవీసీ), ప్లాస్టిక్‌ తో తయారు చేస్తారు. మరికొద్ది వారాల్లో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యం లో హోర్డింగుల సమస్య మరింత పెద్దది కానుంది. ఈ ఎన్నికల్లో పీవీసీతో తయారైన హోర్డింగులను ప్రచారానికి వాడొద్దని రాజకీయ పార్టీలను ఎన్నికల కమిషన్ కోరింది. అయితే ఇది ఎన్నికల ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’ కిందకు రాదు. పార్టీలన్నీ స్వచ్ఛందంగానే పీవీసీ, ప్లాస్టిక్ హోర్డింగులను పక్కనబెట్టాలి . మరి అవి అలా చేస్తాయా? ఈసీ పార్టీలను కోరిన రోజే భారతీయ జనతా పార్టీ(బీజేపీ) న్యూఢిల్లీలోని పార్టీ ఆఫీసుకు భారీగా పీవీసీ హోర్డింగులను తగిలించింది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలూ తమ ఆఫీసులను ఫ్లెక్సీ లతో నిం పేశాయి.

ఒక శాతమే రీసైకిల్
దేశంలో 90 శాతం వీధి ప్రకటనలు అన్నీ పీవీసీ హోర్డిం గులపైనే ముద్రిస్తున్నారు. దాదాపు 2.16 లక్షల టన్నుల ఫ్లెక్స్ బ్యానర్లను పాలీమర్లపై ప్రింట్ చేస్తున్నారని మూడీస్ కు చెందిన ఐసీఆర్ఏ పేర్కొంది. 2017 ఏప్రిల్ నుంచి 2018 మార్చి మధ్య బీజేపీ 147.10 కోట్ల రూపాయలను ఔట్ డోర్ పబ్లిసిటీకి వాడింది. బిల్ బోర్డులు, గోడలు, వాహనాలపై ప్రచార అడ్వర్టయిజ్ మెంట్ల ఖర్చు కూడా ఇందులోనే ఉంది. దేశంలో సాధారణ ఎన్నికలు జరిగే మూడు నెలల్లో, మూడేళ్లలో వచ్చేంత ప్లాస్టిక్ చెత్త తయారవుతుందని పర్యావరణ కేసులను వాదించే సుప్రీం కోర్టు లాయర్ సంజయ్ ఉపాధ్యాయ్ తెలిపారు. కుప్పలుతెప్పలుగా వచ్చి పడే పీవీసీలో కేవలం ఒక శాతం మాత్రమే రీసైక్లింగ్ అవుతోందని చెప్పారు. మిగతా దాంట్లో ఎక్కువ భాగం భూమిలో కలుస్తోందని వివరించారు. ఈ సమయంలో దానిలోని రసాయనాలు నేలలోకి విడుదలవుతున్నాయని పేర్కొన్నారు. పీవీసీ కేన్సర్‌‌‌‌‌‌‌‌ కారకం కూడా. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు దీని వాడకాన్ని తగ్గిస్తూ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా 2022లో ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులను బ్యాన్ చేయాలని భావిస్తోంది. ది ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇనిస్టిట్యూ ట్ లెక్కల ప్రకారం ఇండియాలో ఏటా 1.34 కోట్ల టన్నుల సింగి ల్ యూజ్ ప్లాస్టిక్స్ తయారవుతున్నాయి.

ఆచరణ ఓ చాలెంజ్
మనసుంటే మార్గముంటుంది అన్నట్లు , ఎలక్షన్స్ తోనే పర్యావరణ హిత ప్రచారాన్ని మొదలుపెట్టొచ్చు. ‘‘ఈ ఎన్నికలు ప్రజల్లో అవగాహన పెంచడానికి రాజకీయ పార్టీలన్నింటికి దొరికి న ఓ సదవకాశం. అందరూ ప్లాస్టిక్ , పీవీసీని ప్రచారానికి వాడటాన్ని వదలిపెట్టండి. వాటి స్థానంలో క్లాత్, రీసైకిల్ చేసిన పేపర్ ను వాడండి. క్లాత్ భూమిలో కలవడానికి ఐదారు నెలలు పడుతుంది. అదే పీవీసీ అయితే దాదాపు 50 ఏళ్లు తీసుకుంటుంది” అంటూ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ సెక్రటరీ సీకే మిశ్రా జనవరి నెలలో రాజకీయ పార్టీలకు ఓ లేఖ రాశారు. ఇది జరిగి న నెల రోజులకు ఈసీ కూడా పార్టీలు అన్నింటికీ ఇదే విషయాన్ని మరోసారి చెప్పింది. సింగి ల్ యూజ్ ప్లాస్టిక్స్‌‌‌‌‌‌‌‌ను వాడొద్దని కోరింది. ఇదే టైంలో సంజయ్ ఉపాధ్యాయ్ ఎన్నికల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ను వాడకుండా నిషేధించాలంటూ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్(ఎన్జీటీ)లో ఫిర్యాదు చేశారు. బ్యాన్ ను పరిగణలోకి తీసుకుంటే బావుంటుందని ఈసీ, కేంద్ర ప్రభుత్వం , సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఎన్జీటీ సూచించింది.