హైదరాబాద్ లో రూ.69 లక్షల.. 2 వేల నకిలీ నోట్లు పట్టివేత

హైదరాబాద్ లో రూ.69 లక్షల.. 2 వేల నకిలీ నోట్లు పట్టివేత
  • నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • రూ. 69 లక్షల నకిలీ 2 వేల నోట్లు స్వాధీనం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : పాతబస్తీలోని రిటైల్ మార్కెట్​లో నకిలీ రూ.2 వేల నోటును చలామణి చేస్తున్న నలుగురిని కాలాపత్తర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ వివరాలను గురువారం సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య వెల్లడించారు. మేడ్చల్ జిల్లా చింతల్‌‌‌‌కు చెందిన ఖాజా నయీముద్దీన్‌‌‌‌, నిజామాబాద్‌‌‌‌కు చెంది షిండేతో కలిసి నకిలీ కరెన్సీ నోట్లను సప్లయ్ చేస్తున్నారు.  చిన్నారులు ఆడుకునే ‘చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ బొమ్మ నోట్లను చలామణి చేస్తున్నారు.  ఇందులో భాగంగా పాతబస్తీలోని తలాబ్‌‌‌‌కట్టకు చెందిన సేల్స్‌‌‌‌ మన్‌‌‌‌ జాహెద్‌‌‌‌ ఖాన్‌‌‌‌(45)తో సిటీలో ఫేక్ కరెన్సీని సప్లయ్ చేసేందుకు స్కెచ్ వేశాడు.

నిజామాబాద్‌‌‌‌కు చెందిన షిండేతో నకిలీ రూ.2 వేల నోట్లను సిటీకి ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ చేయించాడు. తాడ్‌‌‌‌బన్ లోని జామా మసీద్‌‌‌‌కు చెందిన ఏసీ టెక్నీషియన్‌‌‌‌ మహ్మద్‌‌‌‌ రయీసుద్దీన్‌‌‌‌(46), కాలాపత్తర్‌‌‌‌‌‌‌‌కు చెందిన రియల్టర్ మహ్మద్ అన్వర్‌‌‌‌‌‌‌‌(36), చాంద్రాయణగుట్టకు చెందిన ఫ్లవర్ డెకరేషన్ వ్యాపారి మహ్మద్‌‌‌‌ మునీర్ అలీ(40)తో కలిసి జాహెద్ ఖాన్ ఈ నకిలీ నోట్లను రిటైల్ మార్కెట్ లో చలామణి చేసేందుకు యత్నించాడు.

ఫేక్ కరెన్సీని ఎక్స్‌‌‌‌చేంజ్‌‌‌‌ చేస్తూ దొరికిన్రు

నయీముద్దీన్‌‌‌‌ ఇచ్చిన సమాచారంతో మంగళవారం రాత్రి షిండే 34 బండిల్స్ తో హైదరాబాద్ వచ్చాడు. ఒక్కో బండిల్‌‌‌‌లో 100 చొప్పున నకిలీ రూ.2 వేల నోట్లు, 52 ‘చిల్డ్రన్‌‌‌‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ బొమ్మనోట్లను మరో బండిల్ లో ప్యాక్ చేశాడు. షిండే బుధవారం ఉదయం 7 గంటలకు కాలాపత్తర్ పీఎస్‌‌‌‌ పరిధిలోని తాడ్‌‌‌‌బండ్ క్రాస్ రోడ్స్‌‌‌‌లో జాహెద్‌‌‌‌ గ్యాంగ్‌‌‌‌కు ఈ నకిలీ నోట్లను అందించాడు. జాహెద్‌‌‌‌ గ్యాంగ్‌‌‌‌ గురించి సమాచారం అందుకున్న కాలాపత్తర్ ఇన్‌‌‌‌స్పెక్టర్ డాలీ నాయిడు టీమ్‌‌‌‌ వారిపై నిఘా పెట్టింది.  మోచి కాలనీలో రూ. 2 వేల నోట్లను ఎక్స్‌‌‌‌ చేంజ్‌‌‌‌ చేస్తున్నారనే సమాచారంతో మధ్యాహ్నం 1 గంటకు అక్కడికి చేరుకుని దాడులు చేసింది.

జాహెద్‌‌‌‌, రయీసుద్దీన్‌‌‌‌, అన్వర్‌‌‌‌‌‌‌‌,మునీర్‌‌‌‌‌‌‌‌ అలీను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి  నుంచి 35 బండిల్స్‌‌‌‌ లో ఉన్న రూ.69 లక్షల నకిలీ రూ.2 వేల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులు నయీముద్దీన్‌‌‌‌, షిండే పరారీలో ఉన్నారు. ఫేక్ కరెన్సీని ఎక్కడ ప్రింట్‌‌‌‌ చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు.