ఫారెస్ట్ అధికారిపై దాడిచేసిన రైతులు

ఫారెస్ట్ అధికారిపై దాడిచేసిన రైతులు
  • అడ్డుకున్న పోలీసులు.. ఏడుగురు రైతులపై ఫిర్యాదు

కొత్తగూడ, వెలుగు: మహబూబాబాద్​జిల్లా గంగారం మండలం మడగూడలో మంగళవారం ఫారెస్ట్​ఆఫీసర్లు, పోడు రైతుల మధ్య ఘర్షణ చోటుచేసుకొంది. డిప్యూటీ రేంజ్​ఆఫీసర్(డీఆర్వో)పై పోడు రైతులు దాడి చేశారు. మడగూడలోని 836 కంపార్ట్​మెంట్​లోని 20 హెక్టార్లలో రెండు నెలల క్రితం ఫారెస్ట్​ ఆఫీసర్లు ట్రెంచ్​కొట్టారు. ఈ క్రమంలో ఆ భూమిలో మొక్కలు నాటేందుకు రేంజర్​చలపతిరావు, డీఆర్వో కరుణానాయక్​తోపాటు మరికొందరు ఫారెస్ట్​ సిబ్బంది పోలీసులతో అక్కడకు చేరుకున్నారు. ట్రాక్టర్లతో చదును పనులు చేపట్టారు. గతంలో ఆ భూమిలో పోడు చేసిన ఆదివాసీ రైతులు కొందరు అక్కడికి చేరుకొని ఫారెస్ట్​ఆఫీసర్లను పనులు ఆపాలని వేడుకున్నారు. ఫారెస్ట్​ఆఫీసర్లు వినిపించుకోకపోవడంతో భూములు పోతున్నాయనే కోపంతో ఫారెస్ట్ డిప్యూటీ రేంజర్​కరుణానాయక్ పై రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. రైతులను పోలీసులు అడ్డుకుని స్టేషన్​కు తరలించారు. డీఆర్వో ఫిర్యాదు  మేరకు ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఇన్​చార్జి ఎస్సై సురేష్​ చెప్పారు

ముక్కిడిగుండంలోనూ ఉద్రిక్తత
నాగర్​కర్నూల్​జిల్లా కొల్లాపూర్​మండలం ముక్కిడిగుండం గ్రామ సరిహద్దుల్లోని పొలాల్లో విత్తనాలు నాటేందుకు వెళ్లిన గిరిజన కుటుంబాలను ఫారెస్ట్​ సిబ్బంది అడ్డుకున్నారు. ముక్కిడిగుండం గ్రామానికి చెందిన 20 గిరిజన కుటుంబాలు దాదాపు 30 ఏళ్లుగా 20 ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నాయి. నాలుగేళ్ల క్రితం ఫారెస్టు ఆఫీసర్లు దాదాపు20 మంది గిరిజనులపై కేసులు నమోదు చేశారు. ఈ ఏడాది వర్షాలతో అదను కాగానే 20 ఎకరాల భూమిని దున్నిన 20 గిరిజన కుటుంబాలు మంగళవారం విత్తనాలు వేసేందుకు వెళ్లారు. అటవీ భూముల్లో సాగు చేయడానికి వీల్లేదని అడ్డు చెప్పడంతో గిరిజన కుటుంబాలు, ఫారెస్ట్​ సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తమ ప్రాణాలు ఈ మట్టిలోనే పోవాలంటూ గిరిజన మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఫారెస్ట్​ సిబ్బంది వెనుదిరిగారు. దాంతో తాత్కాలికంగా వివాదం సద్దుమణిగింది. సర్కారు భూములు అమ్ముకుని బిజినెస్​ చేయొచ్చు కానీ  ఆదివాసీలు, గిరిజనులు భూములను నమ్ముకోవద్దా అని తెలంగాణ గిరిజన సమాఖ్య కార్యదర్శి అశోక్​ ప్రశ్నించారు. పోడు భూముల సమస్యను పరిష్కరించాలని డిమాండ్​ చేశారు.