అమరావతిని పోలీసు రాజ్యం చేశారు

అమరావతిని  పోలీసు రాజ్యం చేశారు

అమరావతి, వెలుగు: ఏపీలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా రాజధాని ప్రాంత రైతులు ఐదో రోజూ రిలే నిరాహార దీక్షలు, రహదారి దిగ్బంధం, ధర్నాలు, నిరసనలు చేపట్టారు. ఆదివారం తుళ్లూరు, మందడం, వెలగపూడి గ్రామాల్లో 29 గ్రామాల రైతులు ధర్నా చేశారు.  రైతులతోపాటు వారి కుటుంబసభ్యులు ఆందోళనల్లో పాల్గొన్నారు. “ప్రాణాలైనా అర్పిస్తాం అమరావతిని సాధిస్తాం, 3 రాజధానులు వద్దు అమరావతే ముద్దు. రాజకీయాల కోసం రైతులను బలిచేస్తారా?’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విజయవాడ గుంటూరు నుంచి అమరావతి చేరుకునే రోడ్లను దిగ్బంధించారు. నల్ల జెండాలు ప్రదర్శించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మందడం ప్రధాన రహదారిపై రైతులు పడవను అడ్డంగా ఉంచారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రోడ్డుకు అడ్డంగా ఉన్న పడవను తొలగించారు. రిలే నిరాహార దీక్షకు టెంట్ వేయడానికి అనుమతి ఇవ్వకపోవడంతో పోలీసులకు వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. మందడంలో నిర్వహించిన ధర్నాలో అమరావతి విట్ క్యాంపస్ స్టూడెంట్స్ పాల్గొన్నారు. రైతులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించారు. ఉద్దండరాయునిపాలెంలో రైతులు వంటావార్పు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఓ రైతు చెప్పుల దండను మెడలో వేసుకుని నిరసన తెలిపాడు. తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామ సచివాలయానికి టీడీపీ కార్యకర్తలు నల్లరంగు వేస్తారన్న అనుమానంతో భారీగా పోలీసులను మోహరించారు. అమరావతి నుంచి రాజధానిని తరలించాలని చూస్తే ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా వెనుకాడబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏసీ గదుల్లో కూర్చొని అమరావతి భూములు వెనక్కిచ్చేస్తామని మాట్లాడుతున్న మంత్రులు రాజధాని గ్రామాల్లోకి వచ్చి మాట్లాడాలన్నారు. అమరావతిని పరిపాలన రాజధాని చేస్తామన్న ప్రభుత్వం చివరికి పోలీసు రాజ్యం చేసిందని రైతులు మండిపడ్డారు. అమరావతిని కాపాడుకునేందుకు ఆమరణ దీక్షకు దిగుతామని టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు.