ఉద్యోగం చేసే వారు ఫాలో కావాల్సిన ట్రిక్స్…

ఉద్యోగం చేసే వారు ఫాలో కావాల్సిన ట్రిక్స్…

మహిళలైనా, పురుషులైనా… ఉద్యోగం చేస్తున్నారంటే కొన్ని శాక్రిఫైజ్​లు చేయాల్సిందే. అది పర్సనల్​ లైఫ్​లో కావచ్చు లేదా ప్రొఫెషనల్​గానూ ఉండొచ్చు. అసలు త్యాగాలు ఎందుకు చేస్తారనుకుంటున్నారా? కారణం ఒక్కటే… ఆఫీసులో పని చేస్తున్న వాళ్లందర్లో తామే ముందుండాలన్న కోరిక, ప్రత్యేక గుర్తింపు పొందాలన్న ఆశ. అయితే అలా ముందుండాలంటే శ్రమ, త్యాగం మాత్రమే సరిపోవు. ఎదుటివాళ్లతో పోటీ పడి గెలవాలన్నా… కెరీర్​లో సక్సెస్​ అందుకోవాలన్నా… కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఎప్పటికప్పుడు తప్పొప్పులను అంచనా వేసుకోవాలి.

ఆఫీసులో అందరికంటే అన్ని విషయాల్లో బెస్ట్​ అనిపించుకోవాలని చాలామందికి ఉంటుంది. అలాంటి వాళ్లు ముందుగా అసలు పోటీ ఎవరితో, ఏ అంశంలో అనే విషయంపై క్లారిటీ తెచ్చుకోవాలి. ఇంకో విషయం… పోటీ అనగానే అది కొలీగ్స్​తోనే ఉండాలని లేదు. ఒక పని లేదా పనితీరుపైనా ఉండొచ్చు. అలాంటప్పుడు ఆ పోటీలో విజయం సాధిస్తే… చేయాల్సిన పని త్వరగా, సమర్థంగా పూర్తవుతుంది. అలాగే చుట్టూ జరుగుతున్న మార్పులు ఎప్పటికప్పుడు అర్థం చేసుకోవాలి.

ప్రొడక్టివిటీ అవసరం

ఏ ఆఫీసులోనైనా ప్రొడక్టివిటీ చాలా ముఖ్యం. ఎన్ని తెలివితేటలు ఉన్నా… గతంలో ఎన్ని విజయాలు సాధించినా… ప్రస్తుతం ఉన్న ఆఫీసులో సరిగ్గా పని చేయకపోతే అంతా వృథా అవుతుంది. అంతేకాదు… కంపెనీ ప్రొడక్టివిటీ పెంచేందుకు ఏం చేయగలమో ఆలోచించి పని చేయాలి.

ఇన్నొవేషనే కీలకం

నలుగురిలో ఎప్పుడూ ముందుంటూ… మంచి పేరు తెచ్చుకోవాలంటే అప్​డేటెడ్​గా ఉండాలి. పని చేస్తున్న రంగంలో బయట ఎలాంటి ఇన్నొవేషన్లు జరుగుతున్నాయో తెలుసుకోవాలి. ఏ రంగంలో పని చేస్తే… ఆ రంగంలో ఫ్రెండ్స్​ని పెంచుకోవాలి. దానివల్ల వాళ్ల ద్వారానైనా ఎప్పటికప్పుడు అప్​డేట్స్​ అందుతాయి. కొత్తకొత్త ఐడియాలతో ఆఫీసులో పని చేస్తే, అందరికంటే ముందుంటూ మంచి పేరు తెచ్చుకుంటారు.

ఎవరి ప్రమోషన్​ వాళ్లదే

చేసిన పనిని ఎవరో వచ్చి ప్రమోట్​ చేస్తారని ఎదురుచూడొద్దు. సెల్ఫ్​ మార్కెటింగ్​, తమ పనిని తామే ప్రమోట్​ చేసుకోవాలి. అప్పుడే ఆఫీస్​ కాంపిటీషన్​లో ముందుంటారు. తాము చేసిన పనిని పక్కవాళ్లకే చెప్పకపోతే… ప్రపంచానికి ఎలా తెలుస్తుంది. చేసిన పని గురించి ముందుగా కో–వర్కర్స్​, సీనియర్స్​తో చెప్పాలి. అలాగే ఇప్పుడు ఎలాంటి ప్రమోషన్​ అయినా సోషల్​ మీడియా ద్వారా త్వరగా రీచ్​ అవుతోంది. అందుకే చేసిన పని, పడిన కష్టాన్ని వీలైతే అందులో పోస్ట్​ చేసుకోవాలి. అయితే ఆఫీస్​ సీక్రెట్లు అందులో ఉంచకూడదు.

అవార్డులు కావాలి

కొంతమంది ఎప్పుడూ పని, ఆఫీసు తప్ప…  వేరే ప్రపంచమే లేనంత బిజీగా ఉంటారు. తమ పని ఎవరికీ తెలిసే చాన్స్​ లేకుండా పని చేస్తారు. కొన్ని రంగాల్లో పనికి తగ్గ గుర్తింపు, అవార్డులు ఉంటాయి. అలాంటి రంగాల్లో ఉన్నవాళ్లు… ఆ అవకాశాన్ని వాడుకోవాలి. అవార్డులు వస్తేనే పని చేసినట్టు కాదు కానీ, అవి భవిష్యత్తులోనైనా ఉపయోగ పడతాయి. అవార్డులనేవి మనుషుల్ని బాగా ఎంకరేజ్​ చేస్తాయి. కొత్త ఉత్సాహాన్ని అందిస్తూ… అవతలి వాళ్లకు ఇన్​స్పైరింగ్​గా ఉంటాయి.