సోలార్‍పంపుసెట్ల పేరుతో గిరిజనులకు టోకరా

సోలార్‍పంపుసెట్ల పేరుతో గిరిజనులకు టోకరా

భద్రాచలం, వెలుగు: భద్రాచలం మన్యంలో ఆదివాసీలకు అవగాహన లేకపోవడం, నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని బురిడీ కొట్టించి దోచుకుంటున్నారు. దుమ్ముగూడెం మండలంలో హైదరాబాద్​కు చెందిన కొందరు సోలార్‍పంపుసెట్ల పేరిట వసూళ్లకు పాల్పడుతూ గిరిజన రైతులకు కుచ్చుటోపీ పెడుతున్నారు.  
సోలార్​ బోర్ల పేరుతో..
నాబార్డు సహకారంతో పంట పొలాల్లో బోర్లు, మోటార్లు ఏర్పాట్లు చేసి సోలార్‍ప్లేట్లను బిగిస్తామని, ఇది నాబార్డు, ప్రభుత్వ స్కీమ్ ​అంటూ కొందరు దుమ్ముగూడెం మండలంలో వాలిపోయారు. భీమవరం, ఆర్లగూడెం, లక్ష్మీనగరంతో  పాటు పలు గ్రామాల్లో గిరిజనులను నమ్మబలుకుతున్నారు. గత ఏడాది సెప్టెంబరులో సోలార్​ప్లేట్లను బిగించాలంటే రూ.76వేలు ఖర్చవుతుందంటూ ఓ వ్యక్తి.. పెనుబల్లి గంగరాజు అనే రైతు నుంచి రూ.40‌‌వేలు తీసుకున్నాడు. పనులు మొదలుపెడతామని నవంబరులో రూ.36వేలు తీసుకున్నాడు. భీమవరం గ్రామానికి చెందిన సోయం జోగయ్య అనే రైతు కూడా విడతల వారీగా రూ.55 వేలు కట్టాడు. ఇదే గ్రామంలో పారికలవాగు చెక్‍డ్యాం నుంచి నీటిని ఎత్తిపోసేందుకు సోలార్‍ ద్వారా మోటారు ఏర్పాటు చేస్తామని చెప్తే 15 మంది రైతులు సోయం చిట్టిబాబు అనే రైతు పేరుతో మొదటి విడత రూ.33వేలు, రెండో విడత రూ.43వేలు సమర్పించుకున్నారు. భీమవరం, పెద్దార్లగూడెం గ్రామాల్లో గిరిజన రైతులకు నాబార్డు స్కీమ్​అని, చిన్నార్లగూడెంలో ఏదో ప్రభుత్వ పథకం అని చెప్పి .. రూ.20వేలు కట్టించుకున్నాడు. వ్యవసాయ బోరు ఏర్పాటు చేస్తామని, మరో రూ.10వేలు కడితే సోలార్‍ ప్యానల్ ​ఫిక్స్​ చేస్తామని చెప్పారు. దీంతో  చిన్నార్లగూడెంకు చెందిన కారం ఎర్రయ్య, పాయం వెంకటేశ్‍, పాయం నాగేశ్వరరావు, కొర్సా లింగయ్య, కొర్సా భద్రయ్య, రాజుపేటకు చెందిన తుర్సా అర్జున్‍ ఒక్కొక్కరు రూ.20వేలు చొప్పున రూ.1.20లక్షలు అందజేశారు.  కానీ ఇప్పటివరకు బోరు వేయలేదు. ఆర్లగూడెంకు చెందిన పూసం వెంకయ్య, కొర్సా సీతారాములు, పూసం నర్సయ్య, పొడియం ముత్తయ్యల  నుంచి  రూ.29,500 చొప్పున వసూలు చేసి బోర్లు వేశారు. అయితే 200 అడుగుల లోతు, 60 అడుగుల కేసింగ్‍కు మాత్రమే ఆ సొమ్ము అంటూ మరింత లోతుగా వేయాలంటే ఒక్కొక్కరు  రూ.11వేలు అదనంగా ఇవ్వాలని చెప్పి ముక్కు పిండి వసూలు చేశారు. హైదరాబాద్​కు చెందిన  ఈ వ్యక్తి మన్యంలో కొందరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా గిరిజనులను మోసం చేస్తున్నట్టు సమాచారం.  
ఒత్తిడి తేవడంతో చెల్లని చెక్కులు
ఇన్నోవెంట్​ సోలార్​సిస్టమ్ ​పేరుతో బురిడీ కొట్టించిన వ్యక్తి చుట్టూ తమ డబ్బులు ఇవ్వాలని రైతులు ప్రదక్షిణలు చేస్తున్నారు. కాటాయిగూడెంకు చెందిన మీడియేటర్​ ద్వారా పెనుబల్లి గంగరాజు అనే రైతు ఒత్తిడి తేవడంతో  ఆయనకు సంతకం చేయకుండానే రూ.75వేల చెక్కులను అంటగట్టాడు. మరి కొందరికి కూడా ఇలాగే చెక్కులు ఇచ్చాడు. ఈ చెక్కులను పట్టుకుని రైతులు తమకు డబ్బులు రావాలని బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.