డిగ్రీలో బీకాం కోర్సుకే జై కొడుతున్న స్టూడెంట్లు

డిగ్రీలో బీకాం కోర్సుకే జై కొడుతున్న స్టూడెంట్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీకాం కోర్సుకు ఫుల్ డిమాండ్ ఉంటోంది. సైన్స్​, ఆర్ట్స్ కోర్సులతో పోలిస్తే… ఈ ఏడాది కామర్స్​లో అడ్మిషన్లు పెద్ద ఎత్తున పెరిగాయి. 2020–21 అకడమిక్ ఇయర్ కు సంబంధించి డిగ్రీ ఓవరాల్ అడ్మిషన్లు కూడా పెరిగాయి. రాష్ర్టంలో దోస్త్ పరిధిలో మొత్తం1,059 డిగ్రీ కాలేజీలుండగా.. వాటిలో 4,24,315 సీట్లు ఉన్నాయి. కరోనా ఎఫెక్ట్​తో ఈసారి అడ్మిషన్లు ఆలస్యమయ్యాయి. మూడ్రోజుల క్రితమే డిగ్రీ ఆన్ లైన్ అడ్మిషన్ల ప్రాసెస్ పూర్తయింది. 4,24,315 సీట్లకు గాను.. 2,12,429 (50.53శాతం) మంది మాత్రమే కాలేజీల్లో చేరారు. వీరిలో అబ్బాయిలు 1,07,898 మంది ఉండగా, అమ్మాయిలు 1,04,531 మంది ఉన్నారు. గతేడాదితో పోలిస్తే అబ్బాయిల అడ్మిషన్లు పెరగ్గా, అమ్మాయిల అడ్మిషన్లు తగ్గాయి. 2019–20లో 1,87,774 అడ్మిషన్లు జరగ్గా… ఈ ఏడాది 24,665 అడ్మిషన్లు పెరిగాయి.

రెండేండ్లుగా బీకామే టాప్..

డిగ్రీలో పోయినేడు 174 కోర్సులుండగా.. సీబీసీఎస్ విధానంతో ఈ ఏడాది 501 కోర్సులు ఉన్నాయి. వీటిని 10 కేటగిరీలుగా పేర్కొన్నారు. పోయినేడు లాగానే ఈసారీ అడ్మిషన్లలో బీకాం కోర్సే టాప్ లో నిలిచింది. బీకాంలో 85,691 మంది చేరగా, బీఎస్సీ ఫిజికల్ సైన్స్​లో 45,180, బీఎస్సీ లైఫ్​ సైన్స్​లో 41,462, బీఏలో 31,179 మంది చేరారు.  బీబీఏలో 6,944 మంది, బీసీఏలో 204 మంది, బీఎస్ డబ్ల్యూలో 45 మంది, ఒకేషనల్​లో 107 మంది, డిప్లొమాలో 607 మంది అడ్మిషన్లు పొందారు. 2018లో బీకాంలో 78,842 మంది చేరగా, 2019 లో 73,716 మంది అడ్మిషన్ తీసుకున్నారు. రెండేండ్లుగా బీకాంలోనే ఎక్కువ మంది స్టూడెంట్లు చేరుతున్నారు. కొత్తగా జీఎస్టీ అమల్లోకి రావడం, స్టూడెంట్స్ సీఏ వైపు మొగ్గు చూపుతుండడంతో బీకాం కోర్సును ఎంపిక చేసుకుంటున్నారని లెక్చరర్లు చెబుతున్నారు.

వర్సిటీల్లో అడ్మిషన్లు పెరిగినయ్..

స్టేట్​లోని ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన,  తెలంగాణ యూనివర్సిటీలతో పాటు స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్బీటీఈటీ) పరిధిలో అడ్మిషన్లు పెరిగాయి. ఈ ఏడాది ఓయూలో అత్యధికంగా 81,448 మంది, కేయూలో 56,073 మంది, శాతవాహన వర్సిటీలో 26,027, పాలమూరు వర్సిటీలో 16,670, తెలంగాణ వర్సిటీలో 16,484 మంది, మహాత్మాగాంధీ వర్సిటీలో 15,120 మంది, ఎస్బీటీఈటీ పరిధిలో 607 మంది చేరారు.

ఇక ఈసారి సగానికి పైగా అడ్మిషన్లు ప్రైవేట్ కాలేజీల్లోనే ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీల్లో 1,52,805 మంది చేరగా.. సర్కార్ కాలేజీల్లో 34,301 మంది చేరారు. గవర్నమెంట్ అటానమస్ కాలేజీల్లో 11,022 మంది, ఎయిడెడ్ కాలేజీల్లో 10,120 మంది, ఎయిడెడ్ అటానమస్ కాలేజీల్లో 119 మంది, ప్రైవేట్ అటానమస్ కాలేజీల్లో 355 మంది, యూనివర్సిటీ కాలేజీల్లో 864 మంది, యూనివర్సిటీ అటానమస్ కాలేజీల్లో 2,721 మంది, రైల్వే డిపార్ట్​మెంట్ కాలేజీల్లో 122 మంది అడ్మిషన్లు పొందారు. గతేడాదితో పోలిస్తే ఎయిడెడ్ అటానమస్ , ప్రైవేట్ అటానమస్ కాలేజీల్లో అడ్మిషన్లు తగ్గగా, మిగిలిన కాలేజీల్లో పెరిగాయి. ఈసారి అడ్మిషన్లు పొందిన వారిలో ఓసీలు 39,619 మంది, ఎస్సీలు 34,447 మంది, ఎస్టీలు18,540 మంది, బీసీ–ఏ 18,594 మంది, బీసీ–బీ 39,072 మంది, బీసీ–సీ 519 మంది, బీసీ–డీలో 47,888 మంది, బీసీ–ఈ కేటగిరీలో 13,748 మంది ఉన్నారు.