ఆంత్రాక్స్ కలకలం : 50 గొర్రెల మృత్యువాత

 ఆంత్రాక్స్ కలకలం : 50 గొర్రెల మృత్యువాత

సూర్యాపేట వెలుగు : గొర్రెలకు అరుదుగా సోకే ఆంత్రాక్స్ వ్యాధి మళ్లీ జీవం పోసుకున్నట్టే కనిపిస్తోంది. సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వుకు చెందిన సుంకరబోయిన తిరపయ్య, వెంకట్రామయ్యకు చెందిన 50 గొర్రెలు మంగళవారం చనిపోవడానికి ఆంత్రాక్సే కారణమని జిల్లా పశుసంవర్థక అధికారి వేణుమనోహర్ రావు అన్నారు. గొర్రెల చెవి, రక్త నమూనా లాబొరేటరీ పరీక్షలకు హైదరాబాద్, ఖమ్మం పంపించామని తెలిపారు. తమ పరిశీలనలో ప్రాథమికంగా ఆంత్రాక్స్ లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పారు. తక్షణం మందలోని మిగిలిన గొర్రెలను దూర ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మందలోని మిగిలిన గొర్రెలకు ఆంత్రాక్స్ సోకకు డా వ్యాక్సిన్ ఇచ్చామన్నారు. 3 కి.మీ. మేర ఆంత్రాక్స్ బ్యాక్టీరియా ప్రభావాన్ని చూపిస్తుందని, ఆ పరిధిలో ఉన్న ఇతర గొర్రెలకు కూడా ఇది సోకే అవకాశముందని తెలిపారు.

వ్యాధి లక్షణాలు : వ్యాధి సోకిన గొర్రె చెవి,ముక్కు, విసర్జక అవయవాల నుంచి రక్తం కారుతుంది. కారిన రక్తం త్వరగా గడ్డ కట్టదు. పొట్ట ఉబ్బినట్టుగా కనిపిస్తుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు : వ్యాధి సోకిందని అనుమానమొస్తే మందలోని మిగిలిన గొర్రెలకు దానిని దూరంగా ఉంచాలి. వ్యాధి సోకిందని డాక్టర్ నిర్ధారిస్తే దూరంగా ఆరడుగుల గొయ్యి తీసి ఎక్కువ మొత్తంలో సున్నం వేసి వ్యాధి సోకిన గొర్రెను పాతిపెట్టాలి. చనిపోయిన గొర్రెను కొయ్యకూడదు. తక్షణమే మిగిలిన గొర్రెలకు యాంటీ ఆంత్రాక్స్ వ్యాక్సిన్ వేయించాలి.