నవ్వడం నేర్పిస్తున్నారు

నవ్వడం నేర్పిస్తున్నారు

కొవిడ్ ప్రపంచాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. లైఫ్​ స్టయిల్​లో చాలా మార్పులకు దారితీసింది. దాంతో లోకమంతా ఏకమై దానిపై పోరాటం చేశాం. అందులో భాగంగా మాస్క్, శానిటైజర్ వంటివి లైఫ్​ స్టైల్​లో భాగమైపోయాయి. మహమ్మారి టైంలో ప్రపంచంలో ఎక్కడ చూసినా మాస్క్​పెట్టుకున్న ముఖాలే కనిపించాయి. ఆ టైంలో చాలామంది మాస్క్​కి బాగా అలవాటైపోయారు. ప్యాండెమిక్ అయిపోయాక కూడా చాలామంది ఆ అలవాటు నుంచి బయటపడలేకపోయారు. ఆ తర్వాత నెమ్మదిగా నార్మల్ లైఫ్ స్టయిల్​లోకి వచ్చాం. జపాన్​లో కూడా అంతే.. కాకపోతే వాళ్లు మాస్క్​ అలవాటు మానుకున్నారు. కానీ... నవ్వడం మర్చిపోయారు! కారణం వాళ్లు ఐలాండ్​ దేశంలో జీవించడం. 

మామూలుగానే అక్కడ ఉన్న సెక్యూరిటీ వల్ల పాశ్చాత్యుల కంటే జపనీయులు చాలా తక్కువగా నవ్వుతారట. దానికి మాస్క్​ తోడవడంతో అసలు ఇప్పుడు నవ్వడమే మర్చిపోయారట వాళ్లు. అందుకని వాళ్లంతా నవ్వడం నేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే, ఎగయొకు అనే కంపెనీ వాళ్లు ‘స్మైల్ ఎడ్యుకేషన్’ మొదలుపెట్టారు. ఈ క్లాసులకు డిమాండ్​ నాలుగు రెట్లు పెరిగింది అంటోంది ఆ కంపెనీ. ఒక్కో సెషన్​కి ఫీజు అక్షరాలా 7,700 యెన్​లు (4,549 రూపాయలు). ‘ప్రజలు నవ్వాల్సిన అవసరం ఉంది’ అంటోంది ఆ కంపెనీ ఓనర్ కవనొ.మే నెలలో పెట్టిన ఒక పోల్​లో ఇప్పటికీ 55 శాతం జపనీయులు మాస్క్​లు పెట్టుకుంటున్నట్టు వెల్లడైంది. కేవలం 8 శాతం మాత్రమే మాస్క్​లు పెట్టుకోవడం మానేశారట. 
 
ఫీడ్​ బ్యాక్​ కూడా..

యోషిదా అనే 20 ఏండ్ల అమ్మాయి కొవిడ్​ టైంలో మాస్క్ పెట్టుకోవడం వల్ల తన ముఖ కండరాలను అస్సలు కదిలించలేదు. దాంతో ఆమె ముఖంలో ఎక్స్​ప్రెషన్ సరిగా పలకట్లేదు ఇప్పుడు. దానికోసం స్మైల్​ ఇన్​స్ట్రక్టర్​ సర్వీస్​లు తీసుకుంటోంది యోషిదా. అద్దం చూస్తూ నవ్వడం ప్రాక్టీస్ చేస్తోంది. ‘‘దీనివల్ల ఫేషియల్ మజిల్స్​కి ఎక్సర్​సైజ్​ అవుతుంది. ఇప్పుడు నేను జపాన్​లో జాబ్​ కోసం వెతకడం స్టార్ట్ చేయొచ్చు కూడా” అని సంతోషంగా చెప్పిందామె. అంతేకాదు... తన క్లాస్​మేట్స్​ని కూడా ఇందులో జాయిన్ చేసిందట. మొత్తం మీద నవ్వడం నేర్చుకుంటున్నారన్నమాట జపాన్​ ప్రజలు.

ఇస్మార్ట్​ ఆటో టూర్​

మనదేశంలో ఆటోలు చాలా పాపులర్. తక్కువ దూరాలకు తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయొచ్చు. ప్యాసింజర్లను ఆకర్షించేందుకు ఆటో డ్రైవర్లు కొన్ని ట్రిక్స్ వాడుతుంటారు. ఆటో వెనక సినిమా యాక్టర్ల ఫొటోలు, పోస్టర్లు అతికించడం, స్లోగన్స్ రాయడం, చక్రాలకు మెరిసే రంగులు వేయడం వంటివి చేస్తుంటారు. అయితే, బెంగళూరుకు చెందిన ఆటో డ్రైవర్​ ఇంకాస్త డిఫరెంట్​గా ఆలోచించాడు. ప్యాసింజర్లను అట్రాక్ట్​ చేసే పనిలో భాగంగా మల్టీ కలర్స్ ఎల్​ఈడీ లైట్స్ ఫిట్​ చేశాడు ఆటోకి. డ్రైవర్ వైపు​, ప్యాసింజర్స్ వైపు తలుపులు, గ్లాస్​ కిటికీలు ఉన్నాయి. అంతేనా కంఫర్ట్​ మరింత పెంచి ఆటోలో కుషన్స్, లెదర్ సీట్స్, ఫ్యాన్​, ట్రే టేబుల్స్ అమర్చాడు. 

ఆటో వెనక దివంగత కన్నడ నటులు పునీత్ రాజ్ కుమార్, శంకర్ నాగ్​ ఫొటోలు అతికించాడు. దానిపైన లైట్లతో ఒక స్లోగన్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. మొత్తంగా ఆటోకి అసలు ఫీచర్స్ పోయి, కొత్త ఫీచర్స్​తో అదరగొట్టేశాడు ఈ ఆటో డ్రైవర్. ఈ ఆటోలో కూర్చుంటే ఎంత దూరం జర్నీ చేసినా అలసట అనిపించదు. నిజం చెప్పాలంటే... ఒక్కసారి ఎక్కితే దిగబుద్ధి కాదు. అంత కంఫర్టబుల్​గా తయారుచేశాడు అంటున్నారు కొందరు. ఈ టాలెంటెడ్​ ఆటో డ్రైవర్ క్రియేటివిటీని వీడియో తీసి, ట్విటర్​లో పోస్ట్ చేశాడు అజిత్ సహాని అనే వ్యక్తి. ఈ వీడియో చూసిన నెటిజన్​లు ‘హైటెక్ ఆటో ఇన్ స్మార్ట్​ సిటీ బెంగళూరు’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఈ ఇంటిని మడతపెట్టేయొచ్చు

కొన్నిసార్లు ఇల్లు విడిచి దూరంగా వెళ్లాలంటే చాలా బాధపడతారు. ఇంటిమీద బెంగతో దూరంగా పోవాలనిపించదు. కానీ ఇప్పుడు ఆ దిగులు అక్కర్లేదు. ఎందుకంటే ఈ ఇంటిని మీతో పాటే తీసుకెళ్లొచ్చు. సూట్​కేస్​లో బట్టలు సర్దినట్లు ఇల్లు మొత్తం సర్దేసి ఎక్కడికంటే అక్కడికి పట్టుకెళ్లొచ్చు. ఐడియా భలే ఉంది కదూ! కానీ, ఇది సినిమాలో గ్రాఫిక్స్​ లేదా కామిక్ స్టోరీస్​లో యానిమేషన్​కి బాగా ఉపయోగపడుతుంది. 

రియల్​ లైఫ్​లో సాధ్యం కాదు అనుకుంటున్నారా?  ఇది మనుషులు ఉండటానికి తయారుచేసిన నిజమైన ఇల్లు. దీన్ని ఫోల్డబుల్ హౌస్​ అంటారు. అమెరికన్ హౌసింగ్​ నిర్మాణ సంస్థ ఒకటి దీన్ని డిజైన్ చేసింది. 400 చదరపు అడుగులు ఉండే ఈ ఇంటిని కనెక్టర్ ప్లేట్స్ వాడి ఒక చోట నుంచి మరో చోటుకు మార్చుకోవచ్చు. ఇంతకీ దీని ధర ఎంత అంటారా.. అక్షరాలా నలభై లక్షల రూపాయలు. దానికి తగ్గట్లే ఇంట్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేసుకోవచ్చు. ఈ ఇంటిని వేరే చోటుకి తీసుకెళ్లాలంటే పికప్ ట్రక్ వాడాలి. ఈ హోమ్​ టూర్​ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది చూసిన పాపులర్ బిజినెస్​మెన్, మహీంద్రా గ్రూప్ చైర్మన్​ ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్​లో షేర్ చేశాడు. ఇలాంటి ఇన్వెన్షన్స్ ఇండియాలో కూడా జరగాలని కోరారు.